ఉరికే ఉత్సాహం.. ఉరిమే చైతన్యం.. దేశంలో నవతరం..!
ఇనుప కండలు.. ఉక్కు నరాలు.. ఉరికే ఉత్సాహం.. ఉరిమే చైతన్యం!.. ఇవే అర్హతలుగా తెలుగు దేశం పార్టీ నవ తరానికి పిలుపునిస్తోంది.;
ఇనుప కండలు.. ఉక్కు నరాలు.. ఉరికే ఉత్సాహం.. ఉరిమే చైతన్యం!.. ఇవే అర్హతలుగా తెలుగు దేశం పార్టీ నవ తరానికి పిలుపునిస్తోంది. భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. భారీ ఎత్తున పార్టీలో కార్యకర్తలను చేర్చుకునేందుకు రంగం రెడీ చేసింది. అత్యంత సైలెంట్‌గా సాగిపోతున్న ఈ వ్యవహారం.. తాజాగా 48 మంది ఎంపిక చేసిన కార్యకర్తలు/నాయకుల కు శిక్షణ ఇవ్వడంతో వెలుగు చూసింది. తెనాలి నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన 48 మందికి శిక్షణ ప్రారంభించారు. ఈ శిక్షణ సుమారు మూడు మాసాలపాటు ఉంటుందని నాయకులు తెలిపారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారని సీనియర్ నాయకులు చెబుతున్నారు. సుశిక్షితులైన నాయకులను తయారు చేయడం ద్వారా భవిష్యత్తులో పార్టీకి ఎదురులేని విజయందక్కించుకోవాలన్నది ప్రధాన ఉద్దేశంగా ఉందన్నారు. అంతేకాదు.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. పార్టీ గీత దాటకుండా పనిచేయగల నాయకులను ఎంచుకుంటున్నట్టు తెలిపారు. తద్వారా పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని నిర్ణయించారు.
ఎలా ఎంచుకుంటారు..?
వాస్తవానికి టీడీపీకి చాలా మంది కేడర్ ఉంది. అయితే.. వీరిలో అనేక మందిని అనేక విధాలుగా వినియోగించుకుంటున్నారు. కానీ, ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్నవారు.. ఎన్నికల సమయంలో జోరుగా గ్రామ గ్రామానికి వెళ్లి.. అవసరమైతే.. కిలో మీటర్ల దూరం కూడా నడిచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసేవారిని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీపై పూర్తిస్థాయి అంకిత భావం ప్రదర్శించేవారిని ఏరికోరి ఎంచుకుంటున్నారు. వీరి కుటుంబాలకు అయ్యే సాధారణ ఖర్చులను పార్టీనే భరిస్తుంది. ఒకసారి వారు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత.. వారిని పూర్తిస్థాయి కార్యకర్తలుగా, నాయకులుగా తీసుకుంటారు.
ఎక్కడెక్కడ నుంచి
పార్టీకి పూర్తిస్థాయి కార్యకర్తల కోసం కొత్తగా ఎంపిక చేసుకుంటున్నవారిని.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి బలమైన పట్టున్న నియోజ కవర్గాల నుంచి తీసుకుంటున్నారు. అది కూడా వారి వయసు, సామాజిక వర్గం, ఎన్నేళ్లుగా రాజకీయాలకు అనుబంధంగా పనిచేస్తున్నారు? అనే కీలక విషయాలనుపరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తున్నారు. ఐదు జోన్లలో ఒక్కొక్క నియోజకవర్గా న్ని ఎంపిక చేసుకుని.. ఆ నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన 40-50 మందికి బ్యాచ్‌ల వారిగా శిక్షణ ఇస్తారు. వీరికి పార్టీ సిద్ధాంతాలు.. పూర్వ వైభవం.. భవిష్యత్తు లక్ష్యాలు.. వంటివి సంపూర్ణంగా వివరిస్తారు. తద్వారా వారిని పార్టీకి ఎడాప్ట్ అయ్యేలా చేస్తారు.