ఏపీ సీఎంవో కార్యదర్శి వర్సెస్ ఎంపీ శబరి.. అసలేం జరిగింది?

ఢిల్లీ వేదికగా జరిగిన ఒక ఉదంతం ఏపీ అధికార పక్షంలో హాట్ టాపిక్ గా మారింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వివాదం.. అంతకంతకూ ముదురుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది.;

Update: 2025-09-16 03:56 GMT

ఢిల్లీ వేదికగా జరిగిన ఒక ఉదంతం ఏపీ అధికార పక్షంలో హాట్ టాపిక్ గా మారింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వివాదం.. అంతకంతకూ ముదురుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు సైతం ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇద్దరూ కీలకమైన వ్యక్తులు కావటంతో పార్టీ అధినాయకత్వానికి ఇప్పుడో తలనొప్పిగా మారిందంటున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లటం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన బస చేసిన దగ్గరకు టీడీపీ మహిళా ఎంపీ శబరి వెళ్లారు. ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని ఎంపీ శబరికి ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా చెప్పి అడ్డుకున్నారు. దీంతో.. ఆమె చాలాసేపు ముఖ్యమంత్రిని కలిసేందుకు అక్కడే ఉండిపోయారు.

ఆ తర్వాత కూడా ఆమెను ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించకపోవటంతో ఎంపీ శబరి అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను ఒక ఎంపీనని.. ఎంతసేపు వెయిట్ చేసినా అనుమతించని తీరును ప్రశ్నించారు. దీంతో.. ఆమెకు కాస్తంత కఠినంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆమె అసహనానికి గురయ్యారు. దీనికి ఐఏఎస్ కార్తికేయ మిశ్రా స్పందిస్తూ.. ‘‘నీలా ఎవరూ నాతో ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేదు’’ అంటూ గట్టిగా బదులిచ్చినట్లు తెలుస్తోంది. తనన ఏకవచనం పిలుపుతో ఆగ్రహానికి గురైన శబరి.. తనతో మర్యాదగా ప్రవర్తించాలని వార్నింగ్ ఇచ్చారు.

ఓవైపు ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రటరీ.. ఇంకోవైపు సొంత పార్టీకి చెందిన మహిళా ఎంపీ కావటం.. ఇరువురు గట్టిగా మాట్లాడుకోవటంతో.. అక్కడున్న కొందరు కలుగుజేసుకొని ఎంపీ శబరిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కార్తికేయ మిశ్రా తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తనను ట్రీట్ చేసిన పద్దతి ఏమాత్రం బాగోలేదంటూ మంత్రి నారా లోకేశ్ కు ఆమె కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను ఎంపిక చేసిందే లోకేశ్. ఆయనకెంతో సన్నిహితుడన్న పేరున్న అధికారిపై మహిళా ఎంపీ కంప్లైంట్ చేయటంతో.. ఈ పంచాయితీ ఎలా తీరుస్తారన్నది పార్టీలో చర్చగా మారింది.

అధికారులు ఎవరైనా.. పార్టీ ప్రజాప్రతినిధుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్న వాదనను వినిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాటం ప్రదర్శించే అధికారులు.. అధికారం చేజారిన తర్వాత కనిపించకుండా పోతారని.. అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీకి పట్టు నేతలే అన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎంపీ వెయిట్ చేసినప్పుడు.. వారికి గౌరవం కల్పించాల్సిన అవసరం సీఎంవో అధికారుల మీద ఉంటుందని చెబుతున్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే.. పార్టీకే నష్టమన్న విషయాన్ని లోకేశ్ గుర్తించాలంటున్నారు. మరి.. ఈ ఎపిసోడ్ లో లోకేశ్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News