మళ్లీ.. మళ్లీ ఏంటీ మాటలు.. బాబుపై రగిలిపోతున్న ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపట్ల కూటమి ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు నొచ్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.;
ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపట్ల కూటమి ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు నొచ్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీపై భయంతో ఎవరూ ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకపోయినా, తమ అంతర్గత సంభాషణల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అంటున్న మాటలతో తీవ్రంగా బాధపడుతున్నట్లు చెబుతున్నారు. తమ తప్పులు ఉంటే పిలిచి చెప్పాల్సిందిపోయి, తామేదో నేరం, ఘోరం చేసినట్లు పత్రికలకు లీక్ లిస్తూ అవమానిస్తున్నారని ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.
కేబినెట్ సమావేశం సందర్భంగా శుక్రవారం మరోసారి కూటమిలో కొందరు ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు కట్టుతప్పుతున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రులు బాధ్యత తీసుకుని తమ పరిధిలో ఉన్న శాసనసభ్యులు సరిగా నడుచుకునేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల కూటమికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఎమ్మెల్యేలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా చెప్పడంలో ఎవరికీ అభ్యంతరం లేకపోయినా, ఒకరిద్దరు చేసిన పనికి అందరినీ నిందించడం కరెక్టు కాదన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కూటమి తరఫున 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందరికీ మందలించే అధికారం చంద్రబాబుకు ఉందని అంటున్నారు. ఆయన పిలిచి మాట్లాడితే ఏ ఒక్కరు ఎదరు మాట్లాడే అవకాశమే లేదు. పైగా తమ విషయం ముఖ్యమంత్రి ద్రుష్టిలో ఉందని జాగ్రత్తగా నడుచుకునే అవకాశం కూడా ఉంది. కానీ, చంద్రబాబు ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా మంత్రులపై భారం వేసి వదిలేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలు పత్రికలలో పతాక శీర్షికల్లో వస్తుండటం వల్ల కూటమి ఎమ్మెల్యేలు అంతా ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు.
నిజానికి కూటమిలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారికంటే కొందరు ఎమ్మెల్యేలు చాలా సీనియర్లు. వారిని కంట్రోల్ లో పెట్టడం ఇన్చార్జి మంత్రుల తరం కాదని పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సుప్రీంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసిన తాము గెలిచిన తర్వాత స్వతంత్రంగా వ్యవహరించకుండా కట్టడి చేయడం ఎంతవరకు కరెక్టు అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. తాము ఎవరినైనా ఇబ్బంది పెడితే ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళతాయి కదా? అలాంటి ఫిర్యాదులు వస్తే పిలిచి నిలదీసే అవకాశం ఉండగా, ప్రతి పది హేను రోజులకు ఒకసారి జరిగే కేబినెట్ భేటీల్లోనూ, అసెంబ్లీ సమావేశాల ముందు, తర్వాత పరోక్షంగా క్లాసులు పీకడమేంటని ఆవేదన చెందుతున్నారని అంటున్నారు.
తండ్రి లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు తమను పిలిచి తిట్టినా తాము ఎవరమూ బాధపడమని కానీ, తామేదో క్షమించరాని నేరం చేసినట్లు పదేపదే పత్రికలకు ప్రధాన శీర్షిక వార్తలుగా మారడమే ఆవేదనకు గురిచేస్తోందని అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షం కూడా ముఖ్యమంత్రి మాటలను చిలవలు పలవులు చేస్తూ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు పరోక్షంగా ముఖ్యమంత్రి చెబుతున్నట్లు అవుతోందని, దీనివల్ల విపక్షానికి స్వయంగా అస్త్రాలిచ్చిన వారం అవుతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మార్చుకోవాల్సివుందని పార్టీ పెద్దలతో మొరపెట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో సుప్రీం కమాండర్ అయిన చంద్రబాబుతో చర్చించేందుకు ఎవరూ సాహసించకపోవడం వల్ల ఎమ్మెల్యేలు తరచూ మాటలు కాయాల్సివస్తోందని అంటున్నారు.