టీడీపీ ఎమ్మెల్యేకు కార్యకర్తల నుంచి నిరసన సెగ... అసలేం జరిగింది?
వివరాళ్లోకి వెళ్తే... టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.;
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించని ఓ సంఘటన తాజాగా నెల్లూరు జిల్లాలో కనిపించింది. ఇందులో భాగంగా... టీడీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంతపార్టీ కార్యకర్తలే నినాదాలు చేసిన ఘటన కావలి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పైగా ఈ ఘటన ఏపీ టీడీపీ అధ్యక్షుడి సమక్షంలోనే జరగడం గమనార్హం.
అవును... టీడీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున నినాదాలు చేసిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... 'ఎమ్మెల్యే గో బ్యాక్' అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎదుటే తమ్ముళ్లు బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. కార్యకర్తల ఆగ్రహానికి కారణం ఏమిటనే చర్చ తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో... గురువారం మాలేపాటి స్వస్థలం దగదర్తిలో ఉత్తర క్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెళ్లారు.
ఈ సమయంలో అక్కడ ఎమ్మెల్యే కావ్యను చూడగానే మాలేపాటి వర్గీయులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కనీసం అంత్యక్రియలకు కూడా ఎమ్మెల్యే హాజరు కాలేదని విమర్శించారు. దీంతోపాటు.. అసలు సుబ్బానాయుడు మరణానికి ఓ రకంగా ఎమ్మెల్యేనే కారణం అని.. మానసికంగా హింసించడంతోనే ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ప్రాణాలు కోల్పోయారని అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు!
ఈ క్రమంలో... మాలేపాటి నివాసం వద్ద ఎమ్మెల్యేను కారు దిగనివ్వకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో... పల్లా శ్రీనివాసరావుతో పాటు బీద రవిచంద్ర తదితర నాయకులు నచ్చ చెప్పినా వారు ఏమాత్రం వినిపించుకోలేదు. చివరికి కారు దిగకుండానే అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి!:
నెల్లూరు జిల్లా దగదర్తిలోని మాలేపాటి స్వగృహానికి వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మంత్రి పొంగూరు నారాయణ ఈ నెల 24నే వెళ్లి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... మాలేపాటి సుబ్బానాయుడు, మాలేపాటి భాను చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ... దగదర్తి మండల అధ్యక్షుడిగా, కావలి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుబ్బానాయుడు ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. సుబ్బానాయుడు మరణం టీడీపీకి తీరనిలోటని మంత్రి నారాయణ తెలిపారు.