ఆ ఎమ్మెల్యేకి గట్టి షాక్ ...పసుపు సమాజానికి ఇస్తున్న సందేశం, ?

ఇక ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ భేటీలు వేసింది అధినాయకత్వం. అంతే కాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పిలిచి మాట్లాడింది.;

Update: 2025-09-15 23:30 GMT

తెలుగుదేశం పార్టీకి అపరిమితమైన మెజారిటీ సొంతంగానే ఉంది. మొత్తం 144 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే తొమ్మిది తప్పించి మిగిలిన అన్ని సీట్లను టీడీపీ గెలుచుకుంది. అలా 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. వీరిలో పలువురు కొత్త వారు కూడా ఉన్నారు. కొత్త నీరు కోసం వారిని ప్రోత్సహించి టికెట్లు ఇస్తే అనేక మంది తొలిసారి అసెంబ్లీ ముఖం చూశారు. సీనియర్ల విషయం పక్కన పెడితే గత పదిహేను నెలలుగా కొత్త ఎమ్మెల్యేలతోనే కొన్ని రకాలైన విమర్శలను పార్టీ ఎదుర్కొంటోంది అని అంటున్నారు.

హైలెట్ కావాలనేనా :

మొదటి సారి నెగ్గిన వారిలో హుషారు ఉంటుంది దాంతో వారు చేసిన దూకుడు పాజిటివ్ గా ఉంటే పార్టీకి ప్రభుత్వానికి ఫర్వాలేదు కానీ అది అతి అయిపోతేనే అసలైన సమస్యలు వస్తాయి. తమకు ఎవరూ లెక్కే లేనట్లుగా కొంతమంది వ్యవహరిస్తూంటే మరికొంత మంది తానే తమ నియోజకవర్గానికి సామంతరాజులు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. దాంతో పాటు స్థానికంగా దందాలు పెరిగాయన్న ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయని అంటున్నారు.

ఎన్ని సార్లు చెప్పినా :

ఇక ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ భేటీలు వేసింది అధినాయకత్వం. అంతే కాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పిలిచి మాట్లాడింది. అయినా సరే చాలా మందిలో మార్పు రావడం లేదు. ఇక మరి కొందరు అతి ఉత్సాహం చూపించి తమ సొంత రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ వచ్చారు ఆ జాబితాలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎపిసోడ్ ఇటీవల పార్టీలో ప్రభుత్వంలో ఎంత అలజడి రేపిందో అంతా చూశారు. ఆయన జూనియర్ మీద అనుచితంగా మాట్లాడారు అన్నది కాస్తా వీడియో రూపంలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహించి ఆందోళనలు కూడా చేశారు. ఆయనను పిలిచి మరీ అధినాయకత్వం మందలించింది అని ప్రచారం కూడా సాగింది.

దూరం పెట్టేసిన వైనం :

ఈ నెల 10న అనంతపురం పట్టణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో భారీ సభను టీడీపీ కూటమి నిర్వహించింది. ఈ భారీ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. అయితే టీడీపీకే చెందిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ఎక్కడా కనిపించలేదు. ఆయన రాలేదు అనే కంటే దూరం పెట్టారు అన్నదే ప్రచారంలో ఉన్న మాటగా ఉంది. ఇక తన సొంత నియోజకవర్గంలో జరిగిన అతి పెద్ద సభకు అధికార పార్టీ ఎమ్మెల్యే కనిపించకపోవడం ఇపుడు చర్చనీయాంశం అయింది. టీడీపీలో కూడా ఆ ఎమ్మెల్యే మీద హాట్ టాపిక్ గా చర్చ సాగుతోంది. కావాలనే హై కమాండ్ ఆయనకు ఇలా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది అని అంటున్నారు.

అలా మొదలెట్టి మరీ :

ఇది ఒక్క దగ్గుబాటితో కాదని ఆయనతో మొదలెట్టి పార్టీకి చెడ్డ పేరు తెస్తూ నిత్యం వివాదాలలో ఉండే ఎమ్మెల్యేలకు ఒక పదునైన హెచ్చరికగా చెబుతున్నారు. ఎవరైతే పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తారో ఇక వారు దూరమే అన్న సందేశం ఉందని అంటున్నారు. దాంతో దగ్గుబాటిని ముందు పెట్టి మిగిలిన వారిని దారికి తేవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఒకవేళ అలా జరగకపోతే వారికి కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుందని చెబుతున్నారు. దగ్గుబాటి విషయం వస్తే తన నియోజకవర్గంలో సభ జరుగుతూంటే ఆయన ఆ సభ సన్నాహక కార్యక్రమాలలో సైతం పాల్గొనలేకుండా దూరం పెట్టారని అంటున్నారు. మంత్రులు సీనియర్ నాయకులు అంతా ఆ సభా వ్యవహారం చూశారని అంటున్నారు. దాంతో ఫస్ట్ టైం గెలిచిన ఈ ఎమ్మెల్యేకు ఇది ఒక విధంగా గట్టి షాక్ గానే చూస్తున్నారు. మరి ఆయన తీరు మార్చుకుంటే దగ్గరకు తీస్తారా లేక వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News