'మ‌హానాడు'.. తెర‌వెనుక క‌ష్టం తెలుసా ..!

ఎందుకంటే.. పార్టీ అధినేత నుంచి రెండు రోజుల‌కు ఒక‌సారి జిల్లా బాధ్యుల‌కు ఫోన్లు వ‌స్తాయి.;

Update: 2025-05-25 11:26 GMT

మ‌హానాడు.. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వేచి చూసే మ‌హా పండుగ‌. మూడు రోజులు మాత్ర‌మే జ‌రిగినా.. దీనికి సంబంధించి న స‌న్నాహాలు మాత్రం 30 రోజుల ముందుగానే మొద‌ల‌వుతాయి. 30 రోజుల ముందుగానే పార్టీలో దీనిపై చ‌ర్చిస్తారు. ఎక్క‌డ నిర్వ‌హించాల‌నే విష‌యంపై పెద్ద ఎత్తున క‌స‌రత్తు చేస్తారు. అలా ఒక‌టి రెండు రోజ‌లు అయిపోయిన త‌ర్వాత‌.. 27 -28 రోజుల ముందు.. వేదిక‌ను ఖ‌రారు చేస్తారు. ఇక‌, అప్ప‌టి నుంచి రోజుకోర‌కంగా.. మ‌హానాడుపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉంటాయి. ఇక‌, ప్ర‌ధానంగా ఏ జిల్లాలో అయితే.. నిర్వ‌హించాలని అనుకుంటారో.. ఆ జిల్లాలో నాయ‌కుల‌కు కార్య‌క్ర‌మం ముగిసే వ‌ర‌కు కంటిపై నిద్ర ఉండ‌దు. నిద్ర ప‌ట్ట‌దు కూడా!.

ఎందుకంటే.. పార్టీ అధినేత నుంచి రెండు రోజుల‌కు ఒక‌సారి జిల్లా బాధ్యుల‌కు ఫోన్లు వ‌స్తాయి. ఇక‌, ఈ మ‌హానాడు క్ర‌తువును కీల‌కంగా భుజాల‌కు ఎత్తుకునేందుకు ఎంపిక చేసిన నాయ‌కుల నుంచి గంట‌కోసారి ఫోన్లు సంబంధిత నియోజ‌క‌వ‌ర్గం, స‌హా జిల్లా పార్టీ నాయ‌కులకు ఫోన్లు వ‌స్తూనే ఉంటాయి. అంతేకాదు.. నాయ‌కుల ప‌ర్య‌వేక్ష‌ణ కూడా పెరుగుతుంది. స్థ‌లం ఎంపిక మ‌హా క‌స‌ర‌త్తు అనే చెప్పాలి. దీనికి కూడా ప్ర‌త్యేకంగా ఒక క‌మిటీ ఉంటుంది. దీనిలోనూ ఎక్స్‌ప‌ర్ట్స్ ఉంటారు. అంటే.. గ‌తంలో మ‌హానాడులు నిర్వ‌హించిన అనుభ‌వం ఉన్న‌వారిని నియ‌మిస్తారు.

వారు ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంత స్థ‌లం కావాలి? ఎంత మేర‌కు వాహ‌నాల పార్కింగ్ కావాలి.. ఎక్క‌డెక్కడ భోజ‌న శాల‌లు ఏర్పాటు చేయాలి? ఇలా.. అనేక విష‌యాల‌ను సంబంధిత ఇంజ‌నీరింగ్ విభాగానికి చెందిన వారితో చ‌ర్చిస్తారు. ఇక‌, స్థ‌లం ఎంపిక అయ్యాక‌.. దానిని వీడియోల రూపంలో పార్టీ అధినేత చంద్ర‌బాబుకు చేర‌వేస్తారు. ఆయ‌న కూడా చూసి సంతృప్తి చెందితే ఓకే.. లేక‌పోతే.. మ‌ళ్లీ మొద‌టి నుంచి ప‌నులు ప్రారంభం. ఇలా.. స్థ‌లం ఎంపికే కీల‌క ఘ‌ట్టం. ఎందుకంటే.. ఎలాంటి తొక్కిస‌లాటలు.. ఇబ్బందులు.. లేకుండా మ‌హానాడును నిర్వ‌హించాల‌న్న ల‌క్ష్యం ఉండ‌డ‌మే. అందుకే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్ని మ‌హానాడులు నిర్వ‌హించినా..ఎక్క‌డా చిన్న పొర‌పాటు కూడా రాలేదు. చిన్న ఇబ్బంది కూడా రాలేదు.

ఇక‌, స్థ‌లం ఎంపిక అయ్యాక‌.. వేదిక నిర్మాణం మ‌రో ఘ‌ట్టం. పార్టీ నుంచి ముందుగానే ఎంత మంది వేదిక‌పై కూర్చుంటార‌నే లెక్క తీసుకుంటారు. దానికి డ‌బుల్ లెక్క వేసి.. ఆ మేర‌కు వేదిక‌ను ఏర్పాటు చేస్తారు. ఇక‌, ప్రాంగణంలో పార్టీ వీఐపీ, వీవీఐపీలు అంటూ.. కొంద‌రికి కుష‌న్ కుర్చీలు ఏర్పాటు చేస్తారు. మిగిలిన వారికి సాధార‌ణ చైర్లు వేస్తారు. తాగునీరు, మ‌జ్జిగ స‌హా.. ఇత‌ర టీ, కాఫీ ఏర్పాట్లు చేయ‌డం మ‌రో కీల‌క ఘ‌ట్టం. ఇవ‌న్నీ చెప్పుకొన్నంత ఈజీకాదు.. రాసుకున్నంత సుఖ‌మూ కాదు. అయినా.. నాయ‌కుల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు అంద‌రూ క‌లిసి క‌ష్ట‌ప‌డి.. పార్టీ కోసం ప‌నిచేయ‌డం మ‌హానాడుకు ఉన్న ఏకైక ప్ర‌త్యేక‌త‌.

Tags:    

Similar News