మహానాడు రోజే జగన్ వ్యూహరచన
ఏపీలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల కీలక సమావేశాలు ఈ నెల 27న జరగనున్నాయి.
ఏపీలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల కీలక సమావేశాలు ఈ నెల 27న జరగనున్నాయి. దాంతో ఒకేసారి జరుగుతున్న ఈ భేటీల మీదన అందరి దృష్టి ఉంది. సహజంగానే టీడీపీ మహనాడు ప్రతీ ఏటా జరుగుతుంది. అది ఏకంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. 27న ప్రారంభమై 28న ఎన్టీఆర్ జయంతి రోజున పార్టీ అధ్యక్షుడి ప్రసంగం దిశా నిర్దేశంతో సమావేశాలు ముగుస్తాయి. ఈసారి మహానాడుని వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. దేశమంతా పొదుపు మంత్రం పాటిస్తున్న నేపథ్యంలో మహానాడు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో ఎక్కడి వారు అక్కడే ఉంటూ తమ ప్రాంతం నుంచి వర్చువల్ గా మహానాడు జరుపుకోవడం ఒక ముఖ్యమైన పరిణామంగానే చూస్తున్నారు.
జగన్ సైతం రెడీ :
ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ నెల 27వ తేదీనే ముహూర్తంగా చేసుకున్నారు. నిజానికి ఇది కాకతాళీయమే అని చెప్పాలి. అయితే మహానాడులోనూ రాజకీయ వ్యూహాలు రానున్న కాలంలో పార్టీ చేయాల్సిన కార్యాచరణ వంటి వాటి మీద చర్చిస్తారు. జగన్ కూడా తన పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన సమావేశాన్ని సరిగ్గా అదే రోజున నిర్వహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీకి సంబంధించి చాలా కాలం తరువాత నిర్వహిస్తున్న అతి ముఖ్యమైన మీటింగుగా చూడాలి. ఈ సమావేశానికి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు,అసెంబ్లీ కోఆర్డినేటర్లు హాజరవుతున్నారు.
ప్రధానంగా అదే :
వైసీపీ ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చిస్తుంది అని అంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో స్థానిక ఎన్నికల నగారా మోగుతుంది. ముందుగా మున్సిపల్ కార్పోరేషన్లు, అలాగే మున్సిపాలిటీలతో మొదలై ఆ మీదట జిల్లా పరిషత్తులు, మండలాలకు ఎన్నికలు ఉంటాయి. చివరిగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే పట్టణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతం వైపుగా స్థానిక సమరాన్ని నడపాలని కూటమి వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఇక మూడు పార్టీలతో దూకుడు మీద ఉన్న కూటమి ఈసారి స్థానిక సమరంలో నూరు శాతం స్ట్రైక్ రేట్ ని సాధించాలని చూస్తోంది అని అంటున్నారు. గతంలో వైసీపీ స్థానిక ఎన్నికల్లో చేసిన దాని కన్నా కూటమి మరింత దూకుడుగా చేస్తుంది అని అంటున్నారు. దాంతో వైసీపీ స్థానిక ఎన్నికల గురించి ఏ విధంగా సమాయత్తం కావాలి అన్నది ఒక సవాల్ గా తీసుకుని ఈ సమావేశంలో చర్చిస్తుంది అని అంటున్నారు.
జగన్ దిశా నిర్దేశం :
ఇక వైసీపీ పార్టీ నిర్మాణం అన్నది బూత్ లెవెల్ దాకా తీసుకుని వెళ్ళాలని చూస్తోంది. అయితే ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా చాలా చోట్ల ఈ నిర్మాణం అన్నది మందకొడిగానే సాగుతోంది. దాంతో ఈసారి జగన్ దీని మీద సీరియస్ గానే ఫోకస్ పెడతారు అని అంటున్నారు. ఎక్కడ వెనకబడి ఉన్నారో తెలుసుకొని వారికి తగిన సందేశం వినిపిస్తారు అని చెబుతున్నారు. పార్టీని ప్రతీ నియోజకవర్గంలో గ్రాస్ రూట్ లెవెల్ దాకా బలోపేతం చేసుకోవాలని జగన్ ఇచ్చిన ఆదేశం ఎన్ని చోట్ల అమలు అవుతోంది అన్నది కూడా సమగ్రమైన సమీక్ష చేపడతారు అని అంటున్నారు. మరి పార్టీ నిర్మాణం ఎంతవరకూ వచ్చింది అన్నది ఈ మీటింగ్ ద్వారా తెలుస్తుంది అని అంటున్నారు.
సర్ మీద సీరియస్ :
ఇక వైసీపీ సర్ విషయంలో వెరీ సీరియస్ అన్నట్లుగానే ఉంది. ఎక్కడికక్కడ ప్రతీ నియోజకవర్గంలో మీటింగులు పెట్టి మరీ బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు. వైసీపీ ఓటు ఒక్కటి కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. దాని మీద జగన్ పార్టీకి కీలక సూచనలు ఇస్తారని అంటున్నారు. ఇక చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు ప్రజా సమస్యలపైన కూడా జగన్ చర్చిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏ కేలక నిర్ణయాలను తీసుకుంటుంది అన్నది అయితే ఆసక్తిగానే ఉంది.