నెల్లూరులో టీడీపీ మహానాడు.. పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం
టీడీపీ పెద్ద పండుగ మహానాడు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. చమురు సంక్షోభం నేపథ్యంలో మహానాడు నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
టీడీపీ పెద్ద పండుగ మహానాడు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. చమురు సంక్షోభం నేపథ్యంలో మహానాడు నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడం నైతికంగా కరెక్టేనా? అన్న చర్చ జరిగింది. అయితే ఆనవాయితీ ప్రకారం మహానాడు నిర్వహణకే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపారు. అయితే మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన మహా వేడుకను రెండు రోజులకు కుదించారు. దీంతో మహానాడు షెడ్యూల్ లో మార్పులు చోటుచేసుకున్నాయి.
టీడీపీ శ్రేణులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసిన మహానాడు షెడ్యూల్ పై అధిష్టానం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహణకు టీడీపీ గతంలో నిర్ణయించింది. నెల్లూరు నగర శివార్లలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనడం, ఆర్థిక మాంధ్యం ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పొదుపు చర్యలకు పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కేంద్ర సూచనలు తూ,చ. తప్పక పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమమైన మహానాడు నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు.
అయితే, పార్టీ ఆవిర్భావం నుంచి ఆనవాయితీగా వస్తున్న మహానాడును వాయిదా వేసే విషయంలో టీడీపీ అధిష్టానం తీవ్ర తర్జనభర్జనలకు గురైందని అంటున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనే మహానాడును వాయిదా వేసిన టీడీపీ అధిష్టానం ఇప్పుడు కూడా ఆ దిశగా చర్చలు కొనసాగించింది. అయితే పరిస్థితులు అంత తీవ్రంగా లేవని, పొదుపు చేయమన్నారు కానీ, కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని కేంద్రం చెప్పలేదన్న ఆలోచనతో మహానాడు నిర్వహణకే టీడీపీ సీనియర్లు మొగ్గు చూపారని అంటున్నారు. దీంతో యథావిధిగా కార్యక్రమాన్ని నిర్వహిద్దామని నిర్ణయానికి వచ్చిన టీడీపీ, మూడు రోజుల కార్యక్రమాలను రెండు రోజులకు కుదించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువనేత నారా లోకేశ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడును వాయిదా వేసే విషయంలో టీడీపీ సెంటిమెంటుగా భావించిందని అంటున్నారు. లోకేశ్ కి పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత భారీ ఎత్తున జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనకు ఎక్కువ మంది నేతలు మొగ్గుచూపినట్లు చెబుతున్నారు. దీంతోనే రెండు రోజుల పాటు కార్యక్రమాల నిర్వహణకు అధిష్టానం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే ఈ రెండు రోజులపాటు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనే విషయమై ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ పసుపు పండుగకు అధిష్టానం సిద్ధం కావడంతో పార్టీ శ్రేణులలో గందరగోళం తొలగిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.