కాంగ్రెస్ నేతగా శరద్ పవార్... విలీనం ఖాయం ?

మహారాష్ట్ర రాజకీయాలలో శరద్ పవార్ ది ఒక శకం. మరాఠా నేతగా వ్యూహ కర్తగా అపర చాణక్యుడిగా ఆయనకు ఒక చరిత్ర ఉంది.

Update: 2026-07-02 03:53 GMT

మహారాష్ట్ర రాజకీయాలలో శరద్ పవార్ ది ఒక శకం. మరాఠా నేతగా వ్యూహ కర్తగా అపర చాణక్యుడిగా ఆయనకు ఒక చరిత్ర ఉంది. కేవలం 38 ఏళ్ల వయసులో ఆయన మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇందిరాగాంధీ మెప్పు పొంది ఆయన కీలక స్థానానికి చేరుకున్నారు. ఆ తరువాత అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించారు. తనకంటూ సొంత బలం కలిగిన శరద్ పవార్ కాంగ్రెస్ లో ఉన్నా ప్రత్యేకంగా ఉండేవారు. ఆ పార్టీ నుంచి బయటకు వస్తూ మళ్లీ చేరుతూ ఆయన రాజకీయం సాగింది. అయితే 1999లో ఆయన సోనియా గాంధీ కాంగ్రెస్ నాయకత్వాన్ని ధిక్కరిస్తూ పార్టీ నుంచి విడిపోయారు. అలా ఎన్సీపీని స్థాపించారు. ఇప్పటికి మూడు దశాబ్దాల్గూఅ సొంతంగా పార్టీని నడిపిస్తూ తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు.

యూపీయేలో కేంద్ర మంత్రిగా :

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి వేరుపడినా యూపీయే ప్రభుత్వంలో ఆయన తరువాత కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక ఆయన పేరు ఒక దశలో ప్రధాని పదవికి కూడా చర్చకు వచ్చినా ఆయన రాజకీయ చాణక్యానికి జడిసే పక్కన పెట్టారని అంటారు. ఇక 2014 నుంచి శరద్ పవార్ పార్టీ విపక్షంలో ఉంటూ కేంద్రంలో మహారాష్ట్రలో రాజకీయ పోరాటం చేస్తూ వస్తోంది. ఇక 2023 నుంచి అసలైన కష్టాలు మొదలయ్యాయి. తన సొంత మేనల్లుడు, తన రాజకీయ వారసుడిగా భావించిన అజిత్ పవార్ పార్టీని చీల్చి ఎన్డీయేలో చేరిపోయారు. అలా రెండుగా చీలిన ఎన్సీపీకి నాటి నుంచి పెను సవాళ్ళు ఎదురయ్యాయి. అంతే కాదు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం పెద్ద సంఖ్యలో సీట్లు గెలిచి తమదే అసలైన పార్టీగా నిరూపించుకుంది. దాంతో శరద్ పవార్ పార్టీకి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో శరద్ పవార్ అజిత్ పవార్ కలుస్తారు అనుకుంటున్న క్రమంలో ఈ ఏడాది జనవరిలో అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. దాంతో పాటు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీని చీల్చడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలయ్యాయి. మొత్తం ఎనిమిది మంది ఎంపీలలో అయిదుగురు అజిత్ పవార్ ఎన్సీపీలోకి వెళ్తారు అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కాంగ్రెస్ కే ఓటు :

ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవడం కష్టరమైన నేపధ్యంలో కాంగ్రెస్ వైపు శరద్ పవార్ మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తారు అని అంటున్నారు. దీనికి సంబంధించిన్స్ కీలక సమాచారాన్ని విజయ్ వడెట్టవార్ అన్న కాంగ్రెస్ నాయకుడు జాతీయ మీడియాకు తెలిపారు. శరద్ పవార్ కాంగ్రెస్ లో చేరే విషయం ఆయన పార్టీ విలీనం వంటివి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. లౌకిక భావాలను గౌరవించే వ్యక్తిగా శరద్ పవార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని అన్నారు. దాంతో శరద్ పవార్ తన ఎంపీలు ఎమ్మెల్యేలతో కలసి తొందరలో కాంగ్రెస్ లో చేరిపవచ్చు అని టాక్ నడుస్తోంది.

రెండు వర్గాలుగానే :

అయితే శరద్ పవార్ పార్టీలోని ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య కూడా ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే ఎన్డీయేలో చేరితే బాగుంటుంది అని అంటున్నారు. అధికారంలో ఉంటే తమ పనులు చేసుకోవచ్చు అని ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి కూడా జరగదు అని ఒక వర్గం భావిస్తోంది. అజిత్ పవార్ ఉంటే ఈ పాటికి మొత్తం శరద్ పవార్ పార్టీ అంతా ఎన్డీయేలో ఉండేదని కూడా అంటున్నారు. అయితే శరద్ పవార్ దూర దృష్టితోనే చేరుతున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ లో చేరితే భవిష్యత్తులో తన కుమార్తె సుప్రియా సూలేకి కానీ మనవడుకి కానీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించే ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. 86 ఏళ్ళ శరద్ పవార్ కాంగ్రెస్ లో చేరితే ఒక దిగ్గజ నేత కాంగ్రెస్ కి అండగా ఉన్నట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News