విమర్శించాలంటే ఆధారాలు ఉండాల్సిందే !
ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గడచిన కొన్ని దశాబ్దాలుగా ఈ దురలవాటు కొనసాగుతోంది.
ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గడచిన కొన్ని దశాబ్దాలుగా ఈ దురలవాటు కొనసాగుతోంది. గత తరం రాజకీయ నేతలు అయితే సభ లోపలా బయట కూడా సహేతుకమైన విమర్శలు చేసేవారు. వ్యక్తిగత విమర్శలకు ఆనాడు చోటు ఎక్కడా లేదు. ఒకరి మీద విమర్శలు చేయాలి అంటే ఎంతో కసరత్తు చేసి సభకు కానీ మీడియా ముందుకు కానీ నేతలు వచ్చేవారు. ఇపుడు అలా లేదు, బురద జల్లేసి పోతున్నారు. కాదు అని చెప్పడం కడుక్కోవడం ప్రత్యర్ధుల వంతుగా మారింది. ఇది అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉంది. అంతే కాదు అనే వారు అన్నీ అంటూంటే పడే వారు పడాలా అన్నది కూడా ఒక ప్రశ్నగా ముందుకు వస్తోంది.
సోషల్ మీడియాలో అయితే :
ఇక టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా అన్నది అందుబాటులోకి వచ్చింది. ప్రతీ వారి జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం అయిపోయింది. అందువల్ల దానిని ఎవరూ కాదనలేని పరిస్థితి. అయితే సోషల్ మీడియా వేదికగా చేసుకుని చాలా మంది నయా అవతార్ ఎత్తేస్తున్నారు. తామే ఉద్ధాకులుగా మారిపోతున్నారు. ఎవరిని పడితే వారిని విమర్శిస్తూ తమ అతిని చూపిస్తున్నారు. అయితే ప్రతీ దానికీ ఎవరూ జవాబు చెప్పలేరు, అందరినీ పట్టి బంధించలేరు. అందుకే ఇపుడు సోషల్ మీడియాలో చాలా మందికి ఇది ఒక అవకాశంగా మారుతోంది. విచ్చలవిడిగా అనేక మంది సోషల్ మీడియా సాధనంగా రాజకీయ నేతల మీద సెలబ్రిటీల మీద ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. ఇవి హద్దులు మీరుతున్నాయి. దాంతో ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు.
పవన్ కీలక సందేశం :
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వ్యాఖ్యానాల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సందేశం ఇచ్చ్చారు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు మన రోజువారీ జీవితం లో ఒక భాగమైపోయిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒకరితో ఒకరు అనుసంధాన మవ్వడానికి అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సోషల్ మీడియా ఇది ఒక శక్తివంతమైన వేదిక అని పవన్ వ్యాఖ్యానించారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆయన గుర్తు చేశారు. అలా ఆ హక్కును తాను గౌరవిస్తానని పవన్ పేర్కొన్నారు. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవిస్తుందని చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు అని పవన్ ఇక్కడ చెప్పడం విశేషం. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అని వివరించారు. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
కళ్ళెం వేయాల్సిందే :
ఈ దిశగా పవన్ ఇచ్చిన సందేశం బాగుంది, ఆహ్వానించదగినది అని అంటున్నారు. అదే సమయంలో కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా మెయిన్ స్ట్రీం మీడియాలోనూ ఈ తరహా ఆధారాలు లేని కధనాలు వస్తున్నాయి, వాటికి కూడా కెల్లెం వేయాల్సిన అవసరం ఉంది, అంతే కాదు రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రత్యర్ధులను విమర్శించేటపుడు చాలా సందర్భాలలో హద్దులు దాటుతున్నారు. అది మంచి విధానం కాదని తెలిసినా కూడా హైప్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నారు. ఒకరి మీద విమర్శలు చేసినపుడు తగిన ఆధారాలు లేకపోతే అది నేరమే అవుతుంది. పౌరులు అయినా రాజకీయ నేత అయినా ఇదే నిబంధన ఉంటుంది. అందువల్ల ఎంతటి వారు అయినా విమర్శలు చేయడమే హక్కుగా భావించరాదు, ప్రభుత్వం అంటే అందరిదీ, నిర్మాణాత్మకమైన సూచనలు చేయవచ్చు, ప్రత్యర్ధులను విమర్శించేటపుడు వారి పనితీరు మీద విమర్శలు చేయవచ్చు, అంతకు మించి వ్యక్తిగత దూషణలు అసలు పనికి రావు, ఎందుకంటే వారు సమాజంలో తమ పని ద్వారా మాత్రమే బాధ్యులు అవుతున్నారు. అంతకు మించి వారి వ్యక్తిగతాలు అనవసరం. ఈ విషయంలో వీలుంటే కచ్చితమైన నిబంధనలు లేదా మరింత పదునైన చట్టాలని రూపొందించాల్సిన అవసరం ఉందనే భావన సర్వత్రా బలపడుతోంది.