బాబుకు హెడేక్: జగన్‌కు మైలేజీ పెంచుతున్న టీడీపీ నేతలు!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం లేదు. అంతేకాదు.. గత ఎన్నికల తర్వాత.. 16 నెలలు గడిచినా.. ఆయన ప్రజలకు మధ్యకు పెద్దగా వచ్చింది లేదు.;
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం లేదు. అంతేకాదు.. గత ఎన్నికల తర్వాత.. 16 నెలలు గడిచినా.. ఆయన ప్రజలకు మధ్యకు పెద్దగా వచ్చింది లేదు. ప్ర జాసమస్యలపై స్పందించింది కూడా లేదు. కేవలం తాడేపల్లి-బెంగళూరుమధ్య ట్రిప్పులకు పరిమితం అయ్యారు. మరోవైపు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కడంతో ఆయన ఆవేదన ఇంకా తీరలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా జగన్‌కు ప్రజల్లో పెద్దగా చర్చలేదు.
కానీ, టీడీపీ నాయకులు, అధికారులు మాత్రం.. జగన్ జోష్ తగ్గలేదని, ప్రజల్లో ఆయనకు బలమైన ఫాలో యింగ్ ఉందన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చిత్రం ఏంటంటే.. వైసీపీ నాయకలకు కూడా వీరి మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ''అరె మా నాయకుడిపై మాకే నమ్మకం సన్నగిల్లుతుంటే.. వీరేంటి ఇలా వ్యాఖ్యానిస్తున్నారు.'' అని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు అన్యాపగా అనేశారు కూడా!. మరి ఇలా.. టీడీపీ నాయకులే వైసీపీ జోష్ పెంచుతున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి.
తాజాగా విశాఖపట్నం పర్యటన పెట్టుకున్నారు జగన్. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన విశాఖ చేరుకుని.. అక్కడి నుంచి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి సొంత నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే.. మాకవరపాలెంకు వెళ్తారు. అయితే.. విశాఖ నుంచి మాకవరపాలెం వరకు రోడ్ షో చేస్తామని వైసీపీ నాయకులు కోరారు. దీనికి పోలీసులు అనుమతించలేదు. దీనికి సంబంధించి పలు కారణాలు చెప్పి ఉంటే బాగుండేది. కానీ, ఎస్పీ, కమిషనర్ స్థాయి అధికారులు.. జగన్ వస్తే.. జనం వస్తారు.. వారిని అదుపు చేయడం మావల్ల కాదని తేల్చి చెప్పారు.
అంతేకాదు.. తమిళనాడులోని కరూర్‌లో గత నెల 27న జరిగిన తొక్కిసలాంటి ఘటనలు కూడా జరిగే అవ కాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. అంటే.. దీనిని బట్టి.. జగన్ వస్తే.. ఇసుక కూడా రాలనంతగా జనం వచ్చేస్తారని.. ఎస్పీ తుహిన్ సిన్హా, విశాఖ కమిషనర్ శంకబ్రత బాగ్జీలు సర్టిఫికెట్లు ఇచ్చారు. సరే.. వారు ఎలా అన్నారో.. ఏమో.. ఆ విషయం పెద్దగా లెక్కలోకి రాదు. కానీ, దీనిని పట్టుకుని టీడీపీ నాయకులు కూడా ``ఔను.. జగన్ వస్తే.. జనాలు చుట్టుముట్టేస్తారు. అనుమతి ఇవ్వడానికి వీల్లేదు`` అంటూ సోషల్ మీడియా లో కామెంట్లు చేశారు.
వాస్తవానికి ఇది రాజకీయంగా టీడీపీకి మైనస్. ఎందుకంటే.. ప్రభుత్వంపై నమ్మకం ఉంటే ప్రతిపక్షం వైపు ప్రజలు చూడరు. ఇది చిన్న లాజిక్. కానీ.. దీనిని మరిచిపోయారో.. ఏమోటీడీపీ నాయకులే జగన్‌కు జోష్ తగ్గలేదన్న ప్రచారాన్ని భుజాన వేసుకుని వైసీపీకి మైలేజీ పెంచారన్న విమర్శలు వస్తున్నాయి.