షాకింగ్: 38 కత్తిపోట్లతో ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్య!

అధికార పార్టీకి చెందిన యాక్టివ్ నేతలు దారుణహత్యకు గురి కావటం చాలా అరుదుగా జరుగుతుంటుంది.;

Update: 2025-04-23 07:08 GMT

అధికార పార్టీకి చెందిన యాక్టివ్ నేతలు దారుణహత్యకు గురి కావటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అదేం విచిత్రమో కానీ.. ఇటీవల కాలంలో ఏపీ అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న తెలుగుదేశానికి చెందిన నేతలు హత్యకు గురవుతున్నారు. తాజాగా ఒంగోలు పట్టణంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హత్య చేశారు. యాభై ఏళ్ల ఆయన టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. మద్యం సిండికేట్ వ్యాపారిగా ఆయనకు పేరుంది. ఆయన సతీమణి ప్రస్తుతం ఎంపీటీసీగా వ్యవహరిస్తున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు.

హైదరాబాద్ నుంచి వచ్చిన వీరయ్య ఆఫీసులో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అతడి ఒంటి మీద మొత్తం 38 కత్తిపోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఎంత కర్కశంగా చంపేశారన్న దానికి కత్తిపోట్లు నిదర్శనంగా చెబుతున్నారు. దారుణ హత్యకు గురైన వీరయ్య చౌదరి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు మేనల్లుడు అవుతారు. టూవీలర్ మీద ముఖానికి మాస్కులు కట్టుకొని వచ్చిన నలుగురు.. ఆఫీసులో ఉన్న వీరయ్యపై విచక్షణరహితంగా కత్తులతో దాడులు చేసి.. ప్రాణాలు తీశారు. వీరయ్య హత్య వార్త విన్నంతనే మేనమామ హరిబాబు గుండెపోటుకు గురై.. ఆసుపత్రిలో చేర్చారు. ఈ హత్య ఉదంతం ఒంగోలు పట్టణంలో తీవ్ర సంచలనానికి తెర తీసింది. హైదరాబాద్ నుంచి వచ్చిన కాసేపటికే ఈ దారుణ హత్య జరిగింది.

వీరయ్యపై దాడికి పాల్పడిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు.. తమతో తెచ్చుకున్న కత్తులతో వీరయ్య ఛాతీ.. గొంతు.. పొట్టపై 38 పోట్లు పొడిచినట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో ఆఫీసులో ఒక సహాయకుడు మాత్రమే ఉన్నారని.. వీరయ్య కేకలతో పక్క ఇంట్లో ఉన్న ఒక యువకుడు రాగా.. అతడ్ని హెచ్చరిస్తూ దుండగులు పారిపోయారు. ఈ ఉదంతం ఒంగోలు పట్టణంలో తీవ్ర సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున నేతలు.. పార్టీ శ్రేణులు తరలివచ్చాయి.

రాజకీయంగా పేరున్న వీరయ్య హత్యకు గురికావటం ఒంగోలులో సంచలనంగా మారింది. పార్టీ కార్యకలాపాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే వీరయ్య.. ఈ తరహాలో దారుణ హత్యకు గురి కావటం మింగుడుపడనిరీతిలో మారింది. సంతనూతలపాటు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నేతగా వీరయ్యకు మంచిపేరుంది. ఈ మధ్యన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం ఇంఛార్జిగా వ్యవహరించారు. ఎంతో చురుగ్గా పని చేయటం ద్వారా.. పార్టీకి భారీ మెజార్టీ సొంతమయ్యేలా చేయటంలో కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.

వీరయ్య హత్యపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రి లోకేశ్ లు తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో తనతో పాటు నడిచిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో కీలకంగా పని చేశారని.. అలాంటి నేతను దారుణంగా హత్య చేసిన వైనం తనను కలిచివేసినట్లుగా లోకేశ్ వెల్లడించారు. హంతకులపై కఠినచర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశించినట్లుగా లోకేశ్ వెల్లడించారు. ఇంతకూ హత్యకు కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్నకు.. లిక్కర్ సిండికేట్.. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమై ఉంటుందని చెబుతున్నారు. వీరయ్య కుటుంబానికి తాము అండగా ఉంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Tags:    

Similar News