అటు యువత పోరు...ఇటు తొలి అడుగు

ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఒకే రోజున రెండు అంశాల మీద రెండు పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.;

Update: 2025-06-23 03:32 GMT

ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఒకే రోజున రెండు అంశాల మీద రెండు పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వాన ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపధ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో భారీ సభను 23న వెలగపూడిలోని సచివాలయం వెనక ఉన్న భారీ మైదానంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ సభకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు మొత్తం మంత్రులు అంతా హాజరవుతున్నారు. ఈ సభ ఏడాదిలో కూటమి సాధించిన విజయాలను సవివరంగా జనాలకు తెలియచేస్తుంది. అంతే కాదు ఏడాది పాలనలో ప్రజల కోసం ఇచ్చిన హామీల గురించి కూడా వెల్లడిస్తుంది.

ఈ హామీలను తాము అత్యధిక శాతం నెరవేర్చామని కూడా తెలియచేయనుంది. ఇక చంద్రబాబు పవన్ లోకేష్ ప్రసంగాలు ఈ సభకు హైలెట్ గా నిలవనున్నాయి. ఏపీలో సుపరిపాలన అంటే ఎలా సాగిందో ఈ ముగ్గురూ జనాలకు పూర్తిగా తెలియచేస్తారు. అంతే కాదు పవర్ పాయింట్ ప్రజంటేషన్ వంటివి కూడా ఉంటాయని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఏపీలో కూటమి పాలన మొదటి ఏడాది సంబరాలను అంబరాన్ని తాకే విధంగా జరుపుకోవాలని చూస్తున్నారు. పెద్ద ఎత్తున జనాలు కూడా ఈ సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నభూతో నభవిష్యత్తు అనేలా ఈ సభ ఉంటుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే కనుక ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించలేదని అదే సమయంలో నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని తొలి ఏడాది ముగిసిందని ప్రతీ ఇంటికీ నిరుద్యోగ భృతి కింద ఏకంగా 36 వేల రూపాయలను బాకీ పడ్డారని వైసీపీ అంటోంది.

అలాగే చదువుకునే విద్యార్ధులకు ఫీజు రీ ఇంబర్స్ మెంట్ ఇవ్వకుండా చేయడంతో చివరి సంవత్సరం విద్యార్ధులకు సర్టిఫికేట్లు కూడా దక్కడం లేదని వారంతా భవిష్యత్తు తెలియక ఇబ్బంది పడుతున్నారని అంటోంది. యువతను ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొంటూ వైసీపీ యువత పోరుతో భారీ ఆందోళనను 23న నిర్వహిస్తోంది.

అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగనుంది. అంటే ఒక వైపు ఏడాది కూటమి పాలన విజయాల గురించి ప్రభుత్వం చెబుతూంటే మరో వైపు వైఫల్యాలు ఇవే అంటూ వైసీపీ విడమరచి చెప్పబోతోంది అన్న మాట. అధికార కూటమి వర్సెస్ విపక్ష వైసీపీల మధ్య ఈ రాజకీయ సంఘర్షణలతో ఏపీలో మరోసారి రాజకీయం గట్టిగా రాజుకుంటోంది.

Tags:    

Similar News