గడబిడ లేదు.. బాబు - పవన్‌లది ఒక్కటే మాట.. !
గతంలో వైసీపీ అధినేత కూడా 30 ఏళ్లపాటు తామే అధికారంలో ఉంటామని చెప్పకొచ్చారు. కానీ, ఇది ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడంలో విఫలమయ్యారు.;
ఎలాంటి డౌటు లేదు. ఎలాంటి గడబిడా లేదు. కూటమిలోని కీలక నాయకులకు ఉన్న ఏకైక లక్ష్యం.. వినిపిస్తున్న ఏకైక మాట.. కూడా ఒక్కటే. అదే.. మరో 15 ఏళ్లపాటు అధికారం!. ఈ విషయంలో ప్రధాన కూటమి పక్షాలైన.. టీడీపీ, జనసేనలు ఒకే మాట మీద ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. `వైకుంఠ పాళి` ఇకవద్దు.. అంటూ చంద్రబాబు చెప్పినా.. రాష్ట్రంలో 15 ఏళ్లపాటు కలిసి ఉంటామని పవన్ కల్యాణ్ చెప్పినా.. ఇద్దరికీ ఒక్కటే లక్ష్యంగా ఉంది. సో.. ఈ విషయాన్ని అర్ధం చేసుకునేవారిలోనే లోపం ఉంది తప్ప.. వారిలో మాత్రం స్పష్టత ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక లక్ష్యం నిర్దేశించుకునే సమయంలో క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ వీరి మధ్య స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ అధికారం కోల్పోరాదన్నది పట్టుదలతో వినిపిస్తున్న మాట. వాస్తవానికి గతంలో వైసీపీ కూడా ఇలానే 30 ఏళ్లపాటు తమదే ప్రభుత్వమని అంచనా వేసింది. ఇదే ప్రకటించింది. కానీ, ప్రకటనలకు కార్యాచరణకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రధాన పార్టీని నడిపించేవారిలో లోపాలు రాకుండా లేకుండా చేసుకుంటున్నారు. ఇదేమంత తేలికకాదు. అనేక ఒత్తిడులు.. అనే ఇబ్బందులను కూడా తట్టుకుంటున్నారు. సో.. దీనికి కారణం ఏకైక లక్ష్యం ఉండడమే.
గతంలో వైసీపీ అధినేత కూడా 30 ఏళ్లపాటు తామే అధికారంలో ఉంటామని చెప్పకొచ్చారు. కానీ, ఇది ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడంలో విఫలమయ్యారు. ఎన్నికలకు ఏడాది ముందే ఆయన ఈ ప్రయోగం దిశగా అడుగులు వేశారు. ఇక,అప్పటికే సీఎంగా జగన్‌పైనా.. నాయకులుగా వైసీపీ ఎమ్మెల్యేలపైనాప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. మరోవైపు బలమైన కూటమి ప్రభావం కూడా పడింది. ఇన్ని వ్యతిరేకతల మధ్య జగన్ చేసిన ప్రకటన ఫలించలేదు. అంతేకాదు..ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సొంత పార్టీలోనే వ్యతిరేకత పెల్లుబికింది. ఈ పరిణామాలను అధ్యయనం చేసిన కూటమి నాయకులు.. ఇప్పటి నుంచే సుదీర్ఘ లక్ష్యంపై దృష్టి పెట్టాయి.
తద్వారా ప్రజల మనసుల్లో బలమైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏదైనా మొక్క దశ నుంచే మందు వేయాలన్నట్టు గా ఆది నుంచి కూడా ప్రజల మనసులను తమవైపు మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తే.. లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడం పెద్ద కష్టం కాదన్నది మేధావులు చెబుతున్న మాట. ఇదే సూత్రాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు అనుసరిస్తున్నారు. ఎక్కడ ఏ వేదిక లభించినా.. వారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతోపాటు.. సుదీర్ఘ కూటమి కలయికను కూడా ప్రస్తావిస్తున్నారు. అదేసమయంలో అభివృద్ధి మంత్రాన్ని కూడా పఠిస్తున్నారు. ఫలితంగా.. గడబిడ లేదు.. బాబు-పవన్‌లది ఒక్కటే మాట అనే టాక్ వినిపిస్తుండడంగమనార్హం.