కూటమి చెడితే ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..?
రాష్ట్రంలో కూటమిగా ముందుకు సాగుతున్న టీడీపీ-జనసేన-బీజేపీలపై ఆ పార్టీ నాయకులకు చాలానే ఆశలు ఉన్నాయి.;
రాష్ట్రంలో కూటమిగా ముందుకు సాగుతున్న టీడీపీ-జనసేన-బీజేపీలపై ఆ పార్టీ నాయకులకు చాలానే ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీకి చాలా ఆకాంక్షలు కూడా ఉన్నాయి. అయితే.. గత కొన్నాళ్లుగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వివాదాలకు దారితీసి.. పెద్దవి అవుతున్నాయి. ఆయా విషయాల్లో పార్టీ అధిష్టానాలు కొంత మౌనంగా ఉన్నా.. ఎక్కడో తేడా కొడుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఈ పరిణామాలే.. కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తే?.. ఎవరికి నష్టం? ఎవరికి లాభం అనేది చర్చ.
బీజేపీ విషయానికి వస్తే..
పెద్దగా బలం లేని బీజేపీ కూటమి కట్టిన ప్రతిసారీ.. బలం పుంజుకుంటోంది. 2014-19 మధ్య నలుగురు, 2024లో 8 మంది ఎమ్మెల్యేలు కమలం పార్టీ తరఫున విజయం దక్కించుకున్నారు. ఇది కూటమితోనే సాధ్యమైంది. అలాకాకుండా.. ఒంటరి పోరుకు రెడీ అయిన ప్రతిసారీ బీజేపీ నాయకులు డిపాజిట్లు కూడా కోల్పోయారు. సో.. కూటమిగా ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. అయితే.. అది టీడీపీతోనే కాదు.. జనసేనతో అయినా ఫర్వాలేదన్న ధోరణి ఈ పార్టీలో కనిపిస్తోంది. ప్రస్తుత వివాదాల్లో బీజేపీ పాత్ర చాలా తక్కువే. అయినా.. ఏదైనా తేడా వస్తే.. మార్పుదిశగా అడుగులు వేస్తుందన్న చర్చ సాగుతోంది.
జనసేన విషయం ఇదీ..
జనసేన విషయానికి వస్తే.. కూటమిగా ఉంటేనే ఈ పార్టీ కూడా పుంజుకుంటుందని విశ్లేషకులు చెబుతు న్నారు. ఒంటరి పోరాటం చేసిన 2019లో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. అదేవిధంగా 143 మంది అభ్యర్థులను నిలబెట్టి కేవలం ఒకే ఒక్కస్థానంలో విజయం దక్కించుకున్నారు. అయితే.. అప్పటి ఇప్పటికీ కొంత మేరకు పార్టీ పుంజుకున్నా.. కూటమిగా లేకపోతే.. కష్టమన్న వాదన ఉంది. కాబట్టి.. ఈ పార్టీ కూడా కూటమిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి.
టీడీపీ పరిస్థితి ఏంటి?
కూటమికి టీడీపీ కూడా భిన్నంకాదు. 2019లో పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం మరిచిపోరాదు. అంతేకాదు.. కూటమిగా ఉంటేనే ఇతర సామాజిక వర్గాలు కూడా టీడీపీని గెలిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 134 స్థానాల్లో విజయం దక్కించుకున్నామని.. కాబట్టి తమకు కూటమి అవసరం లేదని తమ్ముళ్లు భావిస్తే.. అంతకన్నా.. తెలివి మాలిన వ్యవహారం ఉండదు. కాబట్టి మూడు పార్టీలకూ.. కూటమిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరూ ఈవిషయంలో తీసేయడానికి లేదు. సో.. దీనిని గుర్తు పెట్టుకుంటే.. నాయకుల మధ్య కలివిడి ఉంటుంది. లేకపోతే.. వారికే నష్టం చేకూరుతుందని అంటున్నారు పరిశీలకులు.