ఏపీ కూటమి సర్కారుకు అదే 'అభయం'!
ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. నిజానికి ఈ తీరే కూటమి సర్కారుకు శ్రీరామరక్షగా చెప్పాలి.
అన్ని కాంబినేషన్లు సూపర్ హిట్ కావు. సినిమాల సంగతి ఎలా ఉన్నా రాజకీయాలు అందుకు పూర్తి భిన్నం. రెండు రాజకీయ పార్టీలు కలిసి భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని నడపటం అంత తేలికైన విషయం కాదు. ఏపీలో అయితే ఏకంగా మూడు పార్టీలు. అది కూడా మిగిలిన మూడు భిన్నమైన పార్టీ. నిజానికి ఈ పార్టీల మధ్య పొత్తే ఒక విచిత్రం. ఎందుకంటే భావసారూప్యతల సంగతి పక్కన పెడితే.. ఈ మూడు పార్టీల అధినేతలు మినహాయించి.. నేతలు.. క్యాడర్.. చివరకు ఈ పార్టీల మద్దతుదారులు.. సానుభూతిపరుల మధ్య కూడా కలిసిమెలిసి ఉన్నట్లుగా కనిపించదు. మూడు పార్టీల అగ్రనేతలు మినహాయించి.. మిగిలిన వారి మధ్యన అభిప్రాయభేదాలకు కొదవ లేదు. ఈ కారణంగానే.. తమ మధ్య ఉన్న దూరాన్ని అధినేతలకు అపాదించే క్రమం కనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడే ఏపీ కూటమి పార్టీ మధ్య ఒక ఆసక్తికర మేజిక్ కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ప్రతి మూడు నెలలకు ఒక ప్యాట్రన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. మీడియా.. సోషల్ మీడియా.. వాట్సప్ గ్రూపుల్లో కూటమి పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం -జనసేన మధ్య పొరపొచ్చాలు మొదలయ్యాయని.. టీడీపీ అధినాయకత్వం తీరు మీద జనసేనాని గుర్రుగా ఉన్నారని చెబుతూ.. దానికి రెండు మూడు అంశాల్ని సాక్ష్యంగా చూపిస్తూ చర్చలు మొదలు పెడతారు.
అది అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది. కొద్ది రోజులకు అదేమీ లేదన్నట్లుగా ఏదో ఒక కార్యక్రమంలోనూ.. మరే సందర్భంలోనో చంద్రబాబు, పవన్ మధ్య ఆత్మీయ అనుబంధం అలానే కొనసాగుతుందన్నది స్పష్టమవుతుంది. అంతేకాదు.. పవన్.. లోకేశ్ మధ్య కూడా వేలెత్తి చూపించేలా వ్యవహారశైలికి సంబంధించిన సాక్ష్యాలు ఉండకపోవటం.. జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా వారిద్దరూ ఆత్మీయంగా కలిసి ఉండటం కనిపిస్తుంది. కూటమి సర్కారులో సూపర్ పవర్ గా పేర్కొనే లోకేశ్.. జనసేనానితో మాత్రం ఒదిగి ఉంటారు. నిజంగానే అన్న ఉంటే.. తమ్ముడు ఎలా బిహేవ్ చేస్తాడో.. అలానే పవన్ ముందు లోకేశ్ తీరు ఉంటుంది.
ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. నిజానికి ఈ తీరే కూటమి సర్కారుకు శ్రీరామరక్షగా చెప్పాలి. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ మధ్య బంధం కూడా ఎంతో మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. కొన్ని అంశాల విషయంలో చంద్రబాబు పాలన మీద పవన్ కు విభేదాలు ఉన్నా.. వాటిని బయటకు రానివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అదేసమయంలో పవన్ కల్యాణ్ మనసుకు నొచ్చుకునేలా వ్యవహరించేందుకు చంద్రబాబు సుతారం ఇష్టపడని తత్త్వం కనిపిస్తుంది. అందుకే ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తారు.
కూటమి సర్కారులో పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యత తగ్గుతుందన్న మాట తరచూ వినిపించే క్రమాన్ని వెంటనే గుర్తించటం.. దానికి పుల్ స్టాప్ పెట్టేలా చంద్రబాబు చేతల్లో చూపించటం కనిపిస్తుంది. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. గతంలోనూ పలు పార్టీల భాగస్వామ్యంతో పని చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లోనూ తనకున్న బలాన్ని ప్రదర్శించేందుకు చంద్రబాబు వెనుకాడేవారుకాదు. కానీ.. కూటమి సర్కారులో అలా కాదు. తనకున్న బలం కంటే కూడా పవన్ తో ఉన్న బంధానికే అధిక ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది.
పవన్ సైతం తనకున్న బలం.. తన పార్టీకి ఉన్న శక్తిసామర్థ్యాలు.. తన ప్రత్యర్థికి, తనకు ఉన్న తేడాను గుర్తించే విషయంలో ప్రాక్టికల్ గా ఉండటం కూడా కూటమి సర్కారు సాఫీగా సాగేందుకు సాయం చేస్తుందని చెప్పాలి. చేతి వేళ్లు ఒకేలా ఉండవన్న విషయాన్ని చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. లోకేశ్ లు పూర్తిగా ఏకీభవించటమే కాదు.. అలా లేకపోవటం లోపం కాదు.. అదో సానుకూలాంశమన్న విషయాన్ని బలంగా నమ్ముతారు. వేళ్లన్ని ఒకేలా ఉండకపోవటమే అసలుసిసలు బలమన్నట్లుగా.. కూటమిలోని భిన్నత్వమే వారిని ఏకం చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. కూటమి సర్కారులోని భాగస్వామ్య పక్షాలన్నికూడా తమ బలాలు.. బలహీనతలు మాత్రమే కాదు.. తామంతా కలవటానికి కారణమైన అంశాల్ని మర్చిపోకపోవటమే అసలుసిసలు మేజిక్ గా చెప్పాలి.