'సత్యాగ్రహ'- ఇప్పుడు ఇదే జోరు.. ఏంటిది?
కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ `సత్యాగ్రహ` పేరుతో పోర్టల్‌ను ప్రారంభించారు. ఇది కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారం.
`సత్యాగ్రహ` పోర్టల్.. ప్రస్తుతం దీని చుట్టూనే యువత ఎక్కువగా ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. దీనిని ప్రారంభించిన కొన్ని గంటల్లోనే లక్ష మంది ఈ ప్లాట్ ఫాంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తమ సమస్యలను కూడా వినిపించారు. గతంలో `కాక్రోచ్ జనతా పార్టీ` పోర్టల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటివాటిని ఏర్పాటు చేసినప్పుడు ఎలా అయితే.. యువత కనెక్ట్ అయ్యారో.. తాజాగా ఈ పోర్టల్ కు కూడా అలానే కనెక్ట్ అవుతున్నారు. దీంతో సత్యాగ్రహ పోర్టల్ పై భారీ సంఖ్యలో సెర్చ్ చేస్తున్నారు.
ఏంటిది?
కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ `సత్యాగ్రహ` పేరుతో పోర్టల్‌ను ప్రారంభించారు. ఇది కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారం. దేశవ్యాప్తంగా వివిధ ప్రజా సమస్యలపై జరుగుతున్న నిరసనలు, ప్రజా పోరాటాల వివరాలను ఒకే చోట చేర్చి, వాటిని ఒక ఇంటరాక్టివ్ మ్యాప్ ద్వారా ప్రదర్శిస్తారు. ముఖ్‌యంగా సమస్యల ఏకీకరణకు ప్రాధాన్యం ఇస్తారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై పలు అంశాలతో విభేదిస్తున్న కాంగ్రెస్.. తాజాగా సత్యాగ్రహను తీసుకువచ్చింది.
ప్రధాన సమస్యల ప్రస్తావన..
సత్యాగ్రహ పోర్టల్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళల భద్రత, దళితులు, గిరిజనుల హక్కుల కోసం దేశంలో జరుగుతున్న నిరసనల వివరాలను నమోదు చేయొచ్చు. దీనికి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అంటే.. ఎవరైనా ఫొటోలు, సమాచారం, వీడియోలను కూడా ఈ పోర్టల్ పంచుకునే అవకాశం ఉంది. అలానే.. యువకులు, ప్రజలు తాము ఎదుర్కొంటున్న అన్యాయాలను, వాటిపై తాము చేస్తున్న పోరాటాలను కూడా ఈ పోర్టల్‌లో నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు.
ఇక, దేశంలో ఒకే రకమైన సమస్యలపై.. ఉదాహరణకు నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై పోరాడుతున్న విభిన్న సమూహాలు.. ఒకరినొకరు కనెక్ట్ అవ్వడానికి, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ పోర్టల్‌లో నమోదైన నిరసనకారులకు, నిర్వాహకులకు కాంగ్రెస్ పార్టీ తరపున అవసరమైన మద్దతు, సహాయం అందిస్తారు. ఆయా అంశాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. మొత్తంగా దీని లక్ష్యం.. కేంద్రంపై పోరాడడమే!.