తెలుగు సినీ పరిశ్రమలో భావోద్వేగాల ప్రతీక: నంది అవార్డుల పునరుద్ధరణ
ఇటీవల సెప్టెంబర్ 24న ఏ.పి. ఎఫ్‌డీసీకి తాము సమర్పించిన లేఖలోని అభ్యర్థనను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించిందని కౌన్సిల్ వెల్లడించింది.
అవార్డులు కేవలం గుర్తింపు మాత్రమే కావు.. అవి ప్రతి కళాకారుడి శ్రమకు, సినీ పరిశ్రమ భావోద్వేగాలకు నిలువెత్తు రూపాలు. ఈ నేపథ్యంలో 2017 నుంచి 2024 సంవత్సరాల మధ్య కాలంలో నిలిచిపోయిన ప్రఖ్యాత `నంది ఫిల్మ్ అవార్డుల`ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడం టాలీవుడ్‌లో సర్వత్రా హర్షం నింపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.
ప్రభుత్వ పెద్దలకు కౌన్సిల్ ధన్యవాదాలు:
నంది అవార్డుల పునరుద్ధరణ కోసం చొరవ చూపిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ .., సినిమాటోగ్రఫీ మంత్రి కె. దుర్గేష్ లకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. అలాగే గౌరవ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ .. ఏ.పి. రాష్ట్ర ఫిల్మ్, టీవీ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ పి. భరత్ భూషణ్.. మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ లకు తమ ప్రత్యేక ధన్యవాదాలను వెల్లడించింది.
మూడు కేటగిరీలలో నంది అవార్డులు..
ఇటీవల సెప్టెంబర్ 24న ఏ.పి. ఎఫ్‌డీసీకి తాము సమర్పించిన లేఖలోని అభ్యర్థనను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించిందని కౌన్సిల్ వెల్లడించింది. ఇందులో భాగంగా బంగారు నంది, వెండి నంది , కాంస్య నంది (గోల్డెన్, సిల్వర్ & బ్రాంజ్ నంది) అనే మూడు ప్రధాన కేటగిరీలలో నంది అవార్డులను పునరుద్ధరించడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా 2017-2024 సంవత్సరాలకు గాను ప్రసిద్ధ `ఎన్.టి.ఆర్. జాతీయ ఫిల్మ్ అవార్డు`ను పునరుద్ధరించడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
తెలుగు సంస్కృతికి, కళాకారుల ప్రతిభకు దక్కిన గౌరవం..
1964 సంవత్సరం నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న నంది ఫిల్మ్ అవార్డులు అనేది కేవలం బహుమతులు మాత్రమే కావు.. అవి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు .. తెలుగు ప్రజల సంస్కృతికి ఒక భావోద్వేగంతో ముడిపడిన అమూల్యమైన విషయం. మన సంస్కృతిని, కళలను గౌరవించడం ద్వారా సమాజంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని.. ఇది రాష్ట్రాల సాంస్కృతిక అభివృద్ధికి కూడా ఎంతగానో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.
పరిశ్రమ శ్రేయస్సుకు ప్రభుత్వం అండదండలు..
నంది ఫిల్మ్ అవార్డుల ద్వారా తెలుగు చిత్రసీమలోని నటీనటులను, సాంకేతిక నిపుణులను సత్కరించడాన్ని పరిశ్రమ ప్రముఖులందరూ స్వాగతిస్తున్నారు. భవిష్యత్‌లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, కళాకారులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- కూటమి పార్టీలు ఇలాంటి సహకారాలు అందించాలని వారు హృదయపూర్వకంగా అభ్యర్థించారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు సి. కళ్యాణ్, గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, వై.వి.ఎస్. చౌదరి ఈ విషయాలను ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.