ప్రయాణికుల కోసం ప్రాణాల ఫణంగా పెట్టిన పైలట్.. స్మిత్ మచ్చర్ ధైర్యానికి ప్రణమిల్లిన దుబాయ్ ప్రిన్స్
అయితే ఈ విజయం వెనుక ఒక నిశ్శబ్ద పోరాటం ఉంది. ప్రపంచం ఒక వ్యక్తిని 'హీరో'గా ప్రశంసిస్తున్న వేళ ఆ వ్యక్తి క్షేమం కోసం కంటిమీద కునుకు లేకుండా నిరీక్షించే ఒక కుటుంబం ఉంది.
ఆకాశంలో వేలాది అడుగుల ఎత్తున విమానం ప్రమాదంలో పడినప్పుడు.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే ధైర్యం అందరికీ ఉండదు. కానీ ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన అసాధారణ తెగువ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం అబుధాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
స్మిత్ మచ్చర్ చూపిన ధైర్యసాహసాలకు యూఏఈ ఉప ప్రధాని, దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ అల్ మక్తూమ్ తీవ్రంగా చలించిపోయారు. స్వయంగా ఆసుపత్రికి వెళ్లి స్మిత్‌ను పరామర్శించిన ఆయన.. ప్రయాణికుల ప్రాణాల కోసం పైలట్ చూపిన తెగువను కొనియాడారు. స్మిత్ తమ దేశ చరిత్రలోనే ఒక భాగమని.. ఆయన ధైర్యానికి గర్విస్తున్నామని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజలు, అధికారులు ఆయన త్వరగా కోలుకోవాలని నిరంతరం ప్రార్థిస్తున్నారు.
అయితే ఈ విజయం వెనుక ఒక నిశ్శబ్ద పోరాటం ఉంది. ప్రపంచం ఒక వ్యక్తిని 'హీరో'గా ప్రశంసిస్తున్న వేళ ఆ వ్యక్తి క్షేమం కోసం కంటిమీద కునుకు లేకుండా నిరీక్షించే ఒక కుటుంబం ఉంది. అదే స్మిత్ భార్య సోనల్ చూపిన అసమాన స్థైర్యం.. భర్త తీవ్రంగా గాయపడి ఆసుపత్రి బెడ్‌పై ఉన్నాడన్న వార్త వినగానే ఏ భార్య అయినా తీవ్ర భయాందోళనలకు గురవుతుంది. కానీ సోనల్ మాత్రం అత్యంత సంయమనంతో ధైర్యంతో ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు.
వారి సొసైటీలో నివసించే వైద్యురాలు ఆర్తీ శర్మ సోషల్ మీడియాలో పంచుకున్న విషయాలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. సహాయం చేయడానికి ముందుకొచ్చిన పొరుగువారికి ధన్యవాదాలు తెలుపుతూ "నా భర్త క్షేమంగానే ఉన్నారు, త్వరలోనే కోలుకుంటారు" అని సోనల్ చూపిన ఆశాభావం, హుందాతనం ప్రతి ఒక్కరినీ ముగ్ధులను చేశాయి. గుండెల్లో ఆందోళనను దిగమింగుకుని, పెదవులపై నవ్వుతో భర్త పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న ఆమె స్థైర్యం తక్కువేమీ కాదు.
విమానం కాక్‌పిట్‌లో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు స్మిత్ చేసిన పోరాటం ఒక ఎత్తైతే.. ఆసుపత్రి బయట భర్త ఆరోగ్యం కోసం ఆందోళనను జయించి నిలబడిన సోనల్ ధైర్యం మరో ఎత్తు. అందుకే కెప్టెన్ స్మిత్ మచ్చర్ కథ కేవలం ఒక పైలట్ అద్భుత సాహసగాథ మాత్రమే కాదు.. అది ఒక కుటుంబం చూపిన అపారమైన నమ్మకం, భావోద్వేగ బలానికి సజీవ ప్రతీక.