'తిరిగి'.. వెళ్తున్నారు.. బాబు ఆశయానికి తూట్లు.. !
పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆశయం ఒకటైతే.. తమ్ముళ్ల ఆశయం మరొకటి అన్నట్టుగా క్షేత్రస్థాయి లో టీడీపీ రాజకీయాలు సాగుతున్నాయి.;
పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆశయం ఒకటైతే.. తమ్ముళ్ల ఆశయం మరొకటి అన్నట్టుగా క్షేత్రస్థాయి లో టీడీపీ రాజకీయాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మంచిని ప్రజలకు వివరించాలని.. సంక్షేమ పథకాలపై వారిలో చైతన్యం కలిగించాలని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు.. వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమమే గొప్ప అని ఆ పార్టీ చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీ చేసిన సంక్షేమానికి.. ఇప్పుడు జరుగుతున్న సంక్షేమానికి కూడా పోలిక పెట్టి ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు.
మరి క్షేత్రస్థాయిలో నాయకులు ఈ పని చేస్తున్నారా? అంటే.. సందేహమే. ఎందుకంటే.. 60 నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు కానీ.. నాయకులు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని.. పార్టీ అధిష్టానానికి తెలిసింది. ఇంటింటికి తీరుగుతున్నారా? అంటే.. తిరుగుతున్నారు. కానీ, ముఖ స్థుతి కోసం.. ఇలా రోడ్డుపైనే నడుస్తూ.. నమస్కారాలు పెడుతూ.. ముందుకు సాగుతున్నారు. పట్టుమని పది గడపల ముందు కూడా.. నిలబడి.. గత ప్రభుత్వం ఇలా చేసింది.. మేం ఇప్పుడు ఇలా చేస్తున్నాం.. అని వివరించే నాయకులు పది మంది కూడా లేరన్నది తేలిన వాస్తవం.
నిజానికి ఇంటింటికీ తిరగమని చెప్పడం వెనుక ఉద్దేశం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేస్తాయని కాదు... వైసీపీ వ్యూహాత్మకంగా తమ హయాంలోనే ఎక్కువగా మేలు జరిగిందని చేస్తున్న ప్రచారం కనుక.. బల పడితే.. అది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇబ్బందికి దారితీస్తుందన్న ముందస్తు అంచనాలతోనే చంద్ర బాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ.. ఈ క్రమంలో సదరు ఉద్దేశాన్ని విస్మరిస్తున్న నాయకులు.. ఈ విషయాన్ని గ్రహించలేక పోతున్నారు. దీంతో ''ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం'' అన్నట్టుగా మారిపోతున్నారు.
కొందరు.. మీడియా ముందు అతి చేస్తున్నారన్నది కూడా. పార్టీ వరకు చేరింది. అంటే.. మీడియా మిత్రుల ను వెంటేసుకుని నాలుగు ఇళ్లకు వెళ్లి.. మమ అనిపించి వెనుదిరుగుతున్నారు. ఏదో చంద్రబాబు సంతృప్తి చెందితే చాలన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. కానీ.. వాస్తవానికి ప్రజల సంతృప్తి కోసమే ఈ కార్యక్ర మాన్ని చేపట్టాలన్న స్పృహ కూడా చాలా మంది మరిచిపోతున్నారు. కొందరు ప్రజలను కలుస్తూనే సొంత వ్యవహారాలను ఫోన్లలో చక్కబెట్టుకుంటున్నారు. ''ఓ గంటలో అక్కడుంటా'' అంటూ.. ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు.. వైరల్ కూడా అయ్యాయి. దీనిని బట్టి వారు ఎంత నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది.