జిల్లాలకు కమిటీలు: తమ్ముళ్లకు ఫలితం దక్కేనా ..!
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జిల్లాలకు సంబంధించి కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.;
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జిల్లాలకు సంబంధించి కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే జాబితాలను రెడీ చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దీనికి సంబంధించిన నివేదికను కూడా రెడీ చేశారు. దీనిని పార్టీ అధినేత చంద్రబాబు పరిశీంచి ఓకే అంటే నియామకాలు జరగనున్నాయి. అయితే.. ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. ఈ కమిటీలను ఎంపిక చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించారు.
అయితే.. వారు టీడీపీలో సంస్థాగతంగా ఉన్న నాయకులకు ఏమేరకు న్యాయం చేస్తారన్నది ప్రశ్న. ఈ విషయాన్ని గతంలో చంద్రబాబు కూడా ప్రస్తావించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి విషయంలో ఉన్న శ్రద్ధ.. పాత వారికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో లేదని ఆయన బహిరంగంగా తమ్ముళ్లకు చెప్పారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి న్యాయం చేయాలని ఆయన పదే పదే ఆదేశించారు. ఇప్పటికే ఒకసారి వచ్చిన జాబితాను తిప్పిపంపించారు.
వైసీపీ నుంచి వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే.. దీనిని కొందరు ఎమ్మెల్యేలు సమర్థించుకున్నారు. అయినా.. మార్పులు చేయాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు కొత్త జాబితా రెడీ అయింది. ఇప్పుడు ఏం చేశారన్నది తెలియాల్సి వుంది. అయితే.. కొందరు క్షేత్రస్థాయి నాయకులు.. తమ పేర్లు లేవని.. అప్పుడే గళం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్న వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని.. అనంతపురం అర్బన్‌కు చెందిన ఇద్దరు నేతలు.. పార్టీకి ఫిర్యాదు చేయడం విశేషం.
ఇక, ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. పార్టీ పరంగా కార్యక్రమాల్లో పాల్గొ నే వారికి పాత నాయకులు మాత్రమేకనిపిస్తున్నారన్నది వాస్తవం. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు.. పింఛన్ల పంపిణీలో కానీ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ.. పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారికి జిల్లా స్థాయి పదవులు ఇస్తే.. అది మరో కొత్త వివాదంగా మారే అవకాశం ఉంటుందన్న చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా చంద్రబాబు ఆలోచన ఫలిస్తుందా.. పాత నేతల కష్టానికి గుర్తింపు దక్కుతుందా? అనేది చూడాలి.