తెలుగు తమ్ముళ్లు కారు విజిల్ బ్లోయర్స్

ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చర్యలు తీసుకోకున్నా.. కనీసం రాజకీయ ప్రత్యర్థులకు కాస్తంత భయం.. భక్తి కలిగేలా వ్యవహరించటంలో చంద్రబాబు అడ్డంగా ఫెయిల్ అయ్యారన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది.;

Update: 2025-10-02 06:30 GMT

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాట్సాప్ మెసేజ్ ను ఫార్వర్డ్ చేసినా కేసులు కట్టి.. అరెస్టులు చేసి చుక్కలు చూపించిన పోలీసులు.. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వేళలోనూ వైసీపీ నేతలకు..ఆ పార్టీకి దన్నుగా నిలిచే వారికి చట్టంగా పోలీసులు వ్యవహరించటం ఏమిటి? అన్నది తెలుగుతమ్ముళ్ల ఆవేదన. టీడీపీకి అన్నీ తానై వ్యవహరించే చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలనను పక్కన పెడితే.. రాజకీయ ప్రత్యర్థులకు సరైన పాఠాలు నేర్పించే విషయంలో మాటలే తప్పించి.. చేతల వరకు వచ్చేసరికి ఆయన పెద్దమనిషిలా వ్యవహరిస్తారే తప్పించి.. అంతకు మించి మరింకేమీ ఉండదన్న పరిస్థితి.

అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతల్ని.. క్యాడర్ ను పట్టించుకోని ఆయన.. పవర్ లేని వేళలో మాత్రం తాను చేసిన తప్పుల్ని గుర్తించానని.. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు.. సానుభూతిపరులకు పెద్ద పీట వేస్తానని.. పార్టీకి అండ మీరేనంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చంద్రబాబు.. ఎప్పటిలానే ఈసారి అధికారంలోకి వచ్చినా పాత తీరునే ప్రదర్శించటం తెలుగు తమ్ముళ్లకు ఒళ్లు మండేలా చేస్తోంది.

ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చర్యలు తీసుకోకున్నా.. కనీసం రాజకీయ ప్రత్యర్థులకు కాస్తంత భయం.. భక్తి కలిగేలా వ్యవహరించటంలో చంద్రబాబు అడ్డంగా ఫెయిల్ అయ్యారన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఈ కారణంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి సర్కారులో ప్రత్యర్థుల విషయంలో టీడీపీ చేసే తప్పుల్ని.. పార్టీ వర్గీయులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. కూటమి సర్కారు తాట తీస్తున్నారు.

విజిల్ బ్లోయర్స్ అంటే.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు.. అనైతిక.. అక్రమ.. మోసపూరిత అంశాలను హైలెట్ చేస్తూ.. ప్రభుత్వ సంస్థల్లో చోటు చేసుకునే తప్పుల్నిఎత్తి చూపేవారిని విజిల్ బ్లోయర్లుగా చెప్పాలి. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ఇదే తీరులో వ్యవహరిస్తున్నారు. తాము అమితంగా ఆరాధించే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. పార్టీకి చేటు కలిగేలా.. పార్టీ లైన్ కు భిన్నంగా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా టీడీపీ అధినాయకత్వం పట్టించుకోని దుస్థితి.

తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లేలా జరుగుతున్న పరిణామాలపై కూటమి సర్కారులో చలనం లేని తీరును తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా మండిపడుతున్నారు. జరిగిన తప్పుల్ని సోషల్ మీడియా ద్వారా ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా విజిల్ బ్లోయర్లుగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వాన్ని.. పార్టీని ఎప్పటికప్పుడు అలెర్టు చేస్తున్నారు. నిజానికి ఇలాంటివన్నీ అధికార పార్టీకి చెందిన ముఖ్యులు చూసుకోవాల్సిన అంశాలు. అందుకు భిన్నంగా సగటు కార్యకర్తలు.. సానుభూతిపరులు పార్టీకి జరిగే నష్టాన్ని ఓపెన్ గా ప్రశ్నిస్తూ.. ఎప్పటికప్పుడు అలెర్టు చేస్తున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నూటికి నూరు శాతం పార్టీ అంటే కమిట్ మెంట్ ఉన్న తెలుగుతమ్ముళ్లు లేకుంటే తెలుగుదేశం పరిస్థితేమంటారు?

Tags:    

Similar News