చంద్రబాబు సర్కారుకు బీజేపీ నేతల షాకులు.. 2018 రిపీట్ చేస్తున్నారా?
బీజేపీ నేత లంకా దినకర్ ప్రస్తుతం ఏపీలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ నేతల వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ కీలక భాగస్వామి. అదే సమయంలో చంద్రబాబు పార్టీ టీడీపీ మద్దతుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నడుపుతోంది. పొత్తులు ఇరు పార్టీలకు ఎంతో ప్రధానమైనప్పటికీ చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రకరకాల అనుమానాలకు కారణమవుతున్నాయి. ఏపీలో బీజేపీ కోటాలో నామినేటెడ్ పదవి దక్కించుకున్న లంకా దినకర్, తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ మహిళా నేత మాధవీలత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు బీజేపీ నేతలు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అవసరమా? అన్న ప్రశ్నలను సంధించడంతో టీడీపీతో ఎక్కడో సంధి చెడిందా? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ నేత లంకా దినకర్ ప్రస్తుతం ఏపీలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. ఇక మాధవీలత తెలంగాణలో కీలక బీజేపీ నేత. ఈ ఇద్దరు ఇటీవల వేర్వేరు సందర్భాల్లో ఉచిత పథకాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయనే టాక్ వినిపిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఆమె పక్క రాష్ట్రానికి చెందిన నాయకురాలు అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ‘స్త్రీశక్తి’ పథకాన్ని అమలు చేసిన నాలుగు రోజులకు మాధవీలత ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాధవీలత విమర్శలు చేశారని పార్టీ వెనకేసుకు వస్తున్నా, అక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చి 20 నెలలు గడుస్తోందని, ఆమె ఇప్పుడు విమర్శలు చేయడమేంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదే సమయంలో బీజేపీ నేత, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కూడా రచ్చ రేపారని అంటున్నారు. మితిమీరిన ఉచిత పథకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలంటూ లంకా దినకర్ సూచించారు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తరహాలో ఆచరణీయమైన పథకాలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు దినకర్. ఈ విషయమై ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇస్తానని ఆయన చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘స్త్రీశక్తి’ పథకంపై మిత్రపక్షం నుంచి ఇటువంటి విమర్శలు వినిపించడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది గమనిస్తే బీజేపీ ఏమైనా రహస్య అజెండా అమలుకు రెడీ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీతో టీడీపీ పొత్తు ఇప్పటిది కాదు. 2014-18 మధ్య కూడా రెండు పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని నడిపాయి. అయితే అప్పట్లో బీజేపీ సహకరించకపోవడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి మధ్యలో వైదొలగింది. దీనికి ప్రతిగా బీజేపీ కూడా టీడీపీతో కటీఫ్ చెప్పేసింది. అప్పట్లో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నప్పటికీ నాటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా తీవ్ర విమర్శలు చేసేవారు. విపక్షాలకు అస్త్రాలను అందించేవారన్న అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు కూడా నాటి ఘటనలను మళ్లీ గుర్తు చేస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలే ఏడాది ఆలస్యంగా హామీలు అమలు చేస్తున్నారని, ప్రభుత్వానికి ఏడాదిపాటు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం బాకీ పడ్డారని వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో విపక్షానికి మద్దతు పలికేలా బీజేపీ నేతలు వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీలో కొందరు నేతలు భావిస్తున్నారు. మొత్తానికి మాధవీలత, లంకా దినకర్ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.