తండ్రి బీజేపీ ఎమ్మెల్యే.. కొడుకు టీడీపీ ఇన్ చార్జి
గత ఎన్నికల ముందు బీజేపీ, జనసేనతో కూటమి కట్టిన టీడీపీ.. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ తరఫున ఇన్ చార్జిలను నియమించాలని చూస్తోంది.;
ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం పార్టీ మారిన టీడీపీ నేతలు.. సాంకేతికంగా బీజేపీ, జనసేనలో కొనసాగుతున్నప్పటికీ తమ మాతృ పార్టీతో బంధాన్ని తెంచుకోలేకపోతున్నారు. దీంతో తమ స్థానంలో వారసులను ప్రోత్సహించాలని టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. తాము ఇతర పార్టీలో ఉన్నా టీడీపీ వ్యవహారాలన్నీ తమ కంట్రోల్ లోనే ఉండేట్లు చూసుకుంటున్నారు. టీడీపీ అధిష్టానం కూడా మిత్రపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీపై దృష్టి పెట్టాలని నిర్ణయించడంతో రాష్ట్రంలోని 31 నియోజకవర్గాల్లో కొత్తగా ఇన్ చార్జిలను నియమించే అవకాశం కనిపిస్తోంది.
గత ఎన్నికల ముందు బీజేపీ, జనసేనతో కూటమి కట్టిన టీడీపీ.. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ తరఫున ఇన్ చార్జిలను నియమించాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీజేపీకి కేటాయించిన 10, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న 21 చోట్ల కొత్తగా టీడీపీ నేతలకు బాధ్యతలు అప్పగించాలని కసరత్తు జరుగుతోంది. రెండు మిత్రపక్షాలకు మొత్తం 31 సీట్లు కేటాయించగా, 29 స్థానాల్లో ఆ రెండు పార్టీలు గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, పార్టీ పరంగా కార్యకర్తలకు అండగా ఉండాలనే ఆలోచనతో నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించాలని టీడీపీ నిర్ణయించింది.
ఇందులో భాగంగా అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జిగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ ను నియమించాలని భావించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తండ్రి బీజేపీ ఎమ్మెల్యేగా ఉండగా, కుమారుడిని ఇన్చార్జిగా నియమించడంపై బీజేపీ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ముందు అనపర్తిని బీజేపీకి కేటాయించగా, అప్పట్లో టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే నల్లమిల్లి తిరుగుబాటు చేశారు. దీంతో నల్లమిల్లిని టీడీపీ నుంచి బీజేపీలోకి పంపి ఆ పార్టీ తరపున పోటీకి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
అయితే సాంకేతికంగా బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ నల్లమిల్లి మాత్రం టీడీపీతో సంబంధాలు వదులుకోలేకపోతున్నారు. ఎప్పుడైనా తనకు టీడీపీయే శాశ్వతమన్న భావనలో ఉన్న నల్లమిల్లి తనకు ప్రత్యామ్నాయంగా మరో నాయకుడికి అనపర్తి టీడీపీ పగ్గాలు అప్పగించకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారని అంటున్నారు. దీంతో ప్రస్తుతం కొత్త ఇన్ చార్జి అన్వేషణను టీడీపీ ప్రారంభించగానే, తన కుమారుడు మనోజ్ ను రంగంలోకి దించారు ఎమ్మెల్యే నల్లమిల్లి. ప్రస్తుతం కూటమిలో ఐకమత్యం దెబ్బతినకుండా తాను తెరవెనుక ఉండి తన కుమారుడిని టీడీపీలో యాక్టివ్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. పార్టీలో యువతరాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ కూడా మనోజ్ కు అనపర్తి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. దీంతో తండ్రి కమలం పార్టీ అయినా కుమారుడు పచ్చ కండువా కప్పుకుని నియోజకవర్గంలో చక్రం తిప్పాలని చూస్తున్నారని అంటున్నారు.