జగన్ ని మరచిపోండబ్బా !

ఏపీలో టీడీపీ కూటమి రాజకీయ వ్యూహాలు ఏమిటో తెలియదు కానీ వైసీపీని అధినేత జగన్ ని విమర్శించకుండా పొద్దు పుచ్చడం లేదు.;

Update: 2025-06-26 03:59 GMT

ఏపీలో టీడీపీ కూటమి రాజకీయ వ్యూహాలు ఏమిటో తెలియదు కానీ వైసీపీని అధినేత జగన్ ని విమర్శించకుండా పొద్దు పుచ్చడం లేదు. ప్రతీ మాటకు ముందు జగన్ వెనక జగన్ అన్నట్లుగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రుల స్థాయి దాకా ఉపన్యాసాలు కానీ మీడియా మీటింగులు కానీ ఉంటున్నాయని అంటున్నారు.

నిజానికి ఏపీలో చూస్తే ఏడాది కాలంలో వైసీపీ విపక్షంగా పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని నివేదికలు ఉన్నాయి. వైసీపీ నేతలు అయితే ఎక్కడికి అక్కడ సైలెంట్ అయిపోయారు. మరో వైపు అయితే అధినేత జగన్ తిరిగింది కూడా చాలా తక్కువగా ఉంది. ఇక ఆయన అసెంబ్లీకే వెళ్ళడం లేదు. మొత్తానికి ప్రజలతో కానీ ప్రజా వేదికగా ఉన్న చట్టసభలలో కానీ కనిపించకుండా వైసీపీ అధినేత తనదైన వ్యూహంతో పార్టీని కొంత ఇబ్బందులో పడేశారు అని అంటున్నారు.

అదే సమయంలో ఆయన అప్పుడపుడు జనంలోకి వెళ్తే దాని మీద కూటమి నేతలు నానా యాగీ చేయడంతో విపరీతమైన పబ్లిసిటీ వస్తోంది అని అంటున్నారు. అంతే కాదు, ఆయన పర్యటనలకు పెడుతున్న ఆంక్షల వల్ల కూడా మరింత హైప్ క్రియేట్ అవుతోంది అని అంటున్నారు. పొదిలిలో జగన్ వెళ్తే అక్కడకు బ్యానర్లు పట్టుకుని టీడీపీ వారు వెళ్ళడం ద్వారా మీడియా అటెన్షన్ తెచ్చారని అంటున్నారు.

ఇక రెంటపాళ్ళ జగన్ టూర్లో సింగయ్య మరణం వెనక వైసీపీది ఎంత తప్పు ఉందో పోలీసుల వైఫల్యం కూడా గట్టిగా మాట్లాడుకుంటే కనిపిస్తోంది అని అంటున్నారు. మరో వైపు జగన్ ని విమర్శించేందుకు అధినాయకులే ముందుంటే అలా చేస్తేనే తమకు మేలు అని భావించిన మిగిలిన వారు అదే బాట అనుసరిస్తున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే జగన్ అన్న భూతాన్ని భూస్తాపితం చేస్తున్నామని చంద్రబాబు పదే పదే చెప్పడం వల్ల ఆయన ఏదో పవర్ ఫుల్ ఫ్యాక్టర్ అన్న సౌండ్ వేరే విధంగా వచ్చేలా ఉందని అంటున్నారు. జగన్ మాజీ సీఎం. ఆయనను చూసి పారిశ్రామికవేత్తలు రావడం లేదు అన్న నినాదం కానీ విమర్శ కానీ వ్యూహాత్మకంగా తప్పే అని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.

ఇక తాజాగా చూస్తే కనుక ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) జాతీయ కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, గత ఐదేళ్ల పాలన తాలూకు చేదు అనుభవాలను పెట్టుబడిదారులు మరిచిపోవాలని, ఇకపై అలాంటి భయాలకు తావులేదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. నిజానికి వారి మనసులో ఏమి ఉందో కానీ ఈ రకమైన ప్రకటనల వల్లనే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నారా అన్న చర్చ అయితే జన సామాన్యంలో కలిగే పరిస్థితి ఉంది అని అంటున్నారు.

ఇక్కడ ఒక చిత్రమైన విషయం చెప్పుకోవాలి. అసెంబ్లీలో వైసీపీని అసలు ప్రతిపక్షంగా గుర్తించమని కూటమి ప్రభుత్వం చెబుతోంది ఎందుకు అంటే కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. జనాలలో ఆదరణ లేదని అంటోంది. మరి అలాంటిది బయట మాత్రం ప్రతీ రోజూ వైసీపీ మీద విమర్శలు చేస్తూ తమకు అసలైన ప్రతిపక్షం ఆ పార్టీయే అని చెప్పకనే చెబుతోంది అంటున్నారు.

ఏది ఏమైనా రాజకీయాల్లో ప్రత్యర్ధులను ఎంత తలిస్తే వారి ఉనికి అంత బలంగా మారుతుంది. ఎంత మరిస్తే అంతలా వారు జనాల మెదళ్ళ నుంచి కూడా వెనక్కి నెట్టబడతారు అని అంటారు. అయితే కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే కాదు దేశంలో చాలా చోట్ల గత ప్రభుత్వాల మీద నిందలు తోసే క్రమంలో వారిని కావాలనే ముందుకు తెస్తూ కోరి గ్రాఫ్ పెంచుతున్నారు అని అంటున్నారు. మరి ఇది పరస్పర రాజకీయ సహకారమేమో అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.

Tags:    

Similar News