వారసులకు నో టికెట్ ?

ఇక జీవీఎంసీలో మేయర్ తో పాటు 120 వార్డులలో అత్యధిక శాతం పార్టీలో యువతకు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

Update: 2026-10-04 04:51 GMT

వారసులు అంటేనే అది ఒక అర్హతగా చాలా మంది ముందుకు వస్తున్నారు. దాంతో పార్టీలో ఏళ్ల తరబడి ఉన్న వారు, అవకాశాల కోసం వేచి చూస్తున్న వారు వెనకబడిపోతున్నారు. అదే సమయంలో పార్టీ కొందరికి మాత్రమే పరిమితం అవుతోంది అన్న చర్చకు కూడా ఆస్కారం ఉంటోంది. అందుకే వారసులకు టికెట్ విషయంలో టీడీపీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందని ప్రచారం సాగుతోంది. టీడీపీ మాత్రమే కాదు కూటమి పార్టీలకు కూడా ఇదే రూల్ వర్తించేలా ఉమ్మడి డెసిషన్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇపుడు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న వారసులకు ఈ నిర్ణయం అమలు అయితే మాత్రం నిరాశ తప్పదని అంటున్నారు.

మేయర్ చుట్టూనే :

విశాఖ మేయర్ చుట్టూ వారసులు పోటీ మామూలుగా లేదు, కేవలం ముగ్గురు నేతలు తప్పించి ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపుగా అంతా కూడా తమ వారి కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, అలాగే జనసేనకు చెందిన పెందుర్తి అనకాపల్లి ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, కొణతాల రామకృష్ణ మాత్రమే ఈ వారసులని తీసుకుని రావడం లేదు. వారి నుంచి మాత్రమే ఎలాంటి సిఫార్సులు లేవని అంటున్నారు. వీరు తప్పించి మిగిలిన వారు అంతా తమ కుటుంబాలలో సతీమణినో అన్న దమ్ములనో కుమారుడు లేదా కుమార్తెలనో మేయర్ కుర్చీ కోసం పోటీకి పెట్టాలని తపిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

అడ్డుకట్ట పడినట్లే :

కూటమి పార్టీలు కనుక ఉమ్మడిగా వారసులకు నో టికెట్ అన్న కీలక నిర్ణయం తీసుకుంటే మాత్రం వారికి అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. అంతే కాదు మేయర్ రేసులో ఉన్న వారిలో సగానికి సగం మంది పక్కకు తప్పుకున్నట్లు అవుతుందని అంటున్నారు. అసలు ఇలా ఎందుకు కూటమి పార్టీలు ఆలోచన చేస్తున్నాయంటే ఒకరి వారసులకు ఇస్తే మరో నేత తమ వారికి ఇవ్వలేదని అసంతృప్తి చెందే చాన్స్ ఉంటుంది. అది నాయకుల మధ్య పార్టీల మధ్య సమస్యగా మారుతుంది. అలాగే కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తి చెందుతారు. పార్టీ కోసం కష్టపడిన ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు కూడా అసహనానికి లోను అవుతారు. అందుకే వీటికి చెక్ చెప్పేందుకే ఈ డెసిషన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు.

కొత్త వారికే :

ఇక జీవీఎంసీలో మేయర్ తో పాటు 120 వార్డులలో అత్యధిక శాతం పార్టీలో యువతకు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాని వల్ల నాయకత్వం పెరగడమే కాకుండా జనంలోనూ సానుకూలత ఏర్పడుతుందని పార్టీల విజయానికి అది కారణం అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అలా బహుముఖీయమైన ప్రయోజనాలను ఆశించి వారసులకు చెక్ చెప్పబోతున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కేవలం విశాఖ మేయర్ కే కాకుండా రాష్ట్రంలో వీలైనంత మేర వారసులను దూరంగా పెట్టాలని కూడా కూటమి పార్టీలు ఆలోచన చేస్తున్నాయని అంటున్నారు. దీని వల్ల స్థానిక సంస్థలలో యువతకు మహిళలకు అలాగే సమర్ధ నేతలకు మరిన్ని అవకాశాలు దక్కుతాయని అంటున్నారు. ఒక విధంగా ఇది మంచి నిర్ణయం అని అంతా స్వాగతిస్తున్నారు. ఒక నాయకుడి ఇంటికే పదవులు అన్నీ వెళ్లడం కంటే అధికారం వికేంద్రీకరణ జరగడం అర్హులకు అందలాలు దక్కడమే అసలైన ప్రజాస్వామ్యం అని అంటున్నారు.

Tags:    

Similar News