టీసీఎస్ మెగా డేటా సెంటర్ : విశాఖకు మరో లక్ష కోట్ల పెట్టుబడి!!

తాజాగా దేశీయ దిగ్గజ ఐజీ సంస్థ టీసీఎస్ కూడా విశాఖలో మెగా డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.;

Update: 2025-10-11 04:54 GMT

ఆసియాలోనే అతిపెద్ద డేటా హబ్ గా విశాఖపట్నం నిలవనుంది. ఇప్పటికే గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫో రూ.87,520 కోట్లతో ఒక గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయగా, తాజాగా దేశీయ దిగ్గజ ఐజీ సంస్థ టీసీఎస్ కూడా విశాఖలో మెగా డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదించిన టీసీఎస్ ప్రతినిధులు త్వరలో ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీసీఎస్ విశాఖలో నెలకొల్పనున్న డేటా సెంటర్ కోసం సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

లక్ష కోట్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీసీఎస్.. వచ్చేనెలలో విశాఖలోనే ప్రారంభించనున్న డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నగరం అభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్నట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ నగరం ఏపీ ఐటీ రాజధానిగా ఆవిర్భవించిందని కూడా అంటున్నారు. రాబోయే రెండేళ్లలో విశాఖలో సుమారు రూ.2.60 లక్షల విలువైన డేటా సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక డేటా సెంటర్ల వల్ల విశాఖ అమెరికాతో అనుసంధానం కాబోతోందని చెబుతున్నారు. అమిత వేగంతో డేటా బదిలీ చేయడానికి అవసరమైన సముద్రగర్భ కేబుల్ పనులు ఇప్పటికే ఊపందుకుంటున్నాయి. ఇక్కడ ఏర్పాటు అవుతున్న డేటా సెంటర్లతో ఆ కేబుళ్లను అనుసంధానించడానికి సిఫీ టెన్నాలజీస్ సిద్ధమైంది. గూగుల్ సంస్థ బ్లూరామన్ పేరుతో సబ్ మెరైన్ కేబుళ్లను విశాఖపట్నం తీసుకువస్తుంది. వీటిని డేటా సెంటరుతో అనుసంధానం చేయడానికి సిఫీ ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా మెటా సంస్థ కూడా అమెరికా నుంచి బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు 50వేల కి.మీ. పొడవైన సబ్ మెరైన్ కేబుల్ వేయడానికి ఒప్పందాలు చేసుకుంది.

భారత్ లో ముంబై, విశాఖ నగరాలను ల్యాండింగ్ సెంటర్లుగా ఎంపిక చేసింది మెటా. ఇక ఈ సంస్థ తీసుకువస్తున్న సబ్ మెరైన్ కేబుల్ ను డేటా సెంటర్లకు అనుసంధానించే బాధ్యతను కూడా సిఫీనే తీసుకుంది. విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్లను కేబుల్ తో అనుసంధానం చేసే సిఫీ టెక్నాలజీస్ కు ఏపీ ప్రభుత్వం విశాఖ సమీపంలోని ఓజోన్ వ్యాలీలో 25 ఎకరాలను కేటాయించింది. దీనికి ఆదివారం రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ భూమి పూజ చేయనున్నారు.

Tags:    

Similar News