టీసీఎస్ లో ఏంటీ పరిస్థితి?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో జరుగుతున్న లేఆఫ్స్‌పై ఉద్యోగుల మధ్య ఆగ్రహం పెరుగుతోంది.;
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో జరుగుతున్న లేఆఫ్స్‌పై ఉద్యోగుల మధ్య ఆగ్రహం పెరుగుతోంది. ఆటోమేషన్, కొత్త సాంకేతికతలు, క్లయింట్ ప్రెషర్ వంటి కారణాలతో సంస్థ సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికే పలు నగరాల్లో నిరసనలు, సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు కనిపిస్తున్నాయి.
14 ఏళ్ల సీనియర్ మేనేజర్‌కు అన్యాయం
టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఒక 14 ఏళ్ల సీనియర్ మేనేజర్ బలయ్యారని ఓ ఉద్యోగి చేసిన రెడ్డిట్ పోస్ట్ సంచలనం సృష్టించింది. ఆ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం... అతని మేనేజర్ ఒక అమెరికన్ క్లయింట్ ప్రాజెక్ట్‌లో పనిచేశారు. అందులో భాగంగా, ఐబీఎం పాత సిస్టమ్స్ ఆధారంగా 15 కొత్త అప్లికేషన్లు రూపొందించాల్సి వచ్చింది. అయితే ఆ సిస్టమ్స్‌ను ఆధునీకరించడం సాధ్యం కాకపోవడంతో ప్రాజెక్ట్ అనుకున్న వేగంతో సాగలేదు. ఈ పరిస్థితి యాజమాన్యానికి తెలిసినా, ఒక్క నెలలో 15 అప్లికేషన్లను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. ప్రాజెక్ట్ బిల్లింగ్ సరిగ్గా లేకపోవడంతో యాజమాన్యం ఆ మేనేజర్‌ను "పేలవమైన పనితీరు" పేరుతో టెర్మినేట్ చేసింది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఎలాంటి సెవరెన్స్ పే లేకుండానే తక్షణమే రాజీనామా చేయాలని అతనిపై ఒత్తిడి తెచ్చారు.
-"రాజీనామా చేస్తారా? లేక టెర్మినేట్ చేయమంటారా?"
సాధారణంగా టీసీఎస్‌లో ఉద్యోగులు రాజీనామా చేయాలనుకుంటే 3 నెలల నోటీసు పీరియడ్ ఉంటుంది. కానీ ఆ మేనేజర్‌కు ఎటువంటి పరిహారం ఇవ్వకుండా, వెంటనే రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు. "మీరు రాజీనామా చేస్తారా లేక మేమే టెర్మినేట్ చేస్తామా?" అంటూ హెచ్‌ఆర్ బెదిరించిందని ఆ ఉద్యోగి పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒకసారి కంపెనీ ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేస్తే, మరో ఉద్యోగం పొందడం కష్టమని హెచ్‌ఆర్ బెదిరించిందని, అందుకే ఆయన బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు.
- ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన
ఈ సంఘటన టీసీఎస్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని, భయాన్ని కలిగించింది. ఒకవైపు కంపెనీ తమ ఉద్యోగులకు భరోసా ఇస్తున్నా, మరోవైపు అనుభవజ్ఞులైన ఉద్యోగులను ఇలా అవమానించడం అన్యాయమని వారు భావిస్తున్నారు. "కంపెనీ లాభాల కోసం మేము బలవంతపు బలులు కావాలా?" అని సోషల్ మీడియాలో చాలామంది ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో టీసీఎస్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.