అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యే.. టీడీపీ సభ్యులతో స్పెషల్ డిబేట్!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభకు విపక్షం వైసీపీ గైర్హాజరుతో సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయి.;

Update: 2026-02-19 09:52 GMT

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభకు విపక్షం వైసీపీ గైర్హాజరుతో సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. దీంతో ప్రజలు సైతం ఆ సమావేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కానీ, ఇదే సమయంలో మండలిలో చర్చలు ఆసక్తిరేపుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా విమర్శలు, ప్రతివిమర్శలతో మండలి హీటెక్కుతోంది. ప్రజలు కూడా మండలి చర్చలను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని అంటున్నారు. అయితే ఇటు మండలి, అటు అసెంబ్లీకి మించిన పరిణామం ఒకటి అసెంబ్లీ లాబీల్లో కనిపించింది. ఈ పరిణామం సభ లోపల, బయట హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ అసెంబ్లీని యథావిధిగా విపక్ష వైసీపీ బహిష్కరించింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంగా నిరసన వ్యక్తంచేస్తూ వాకౌట్ చేశారు. ఇక అప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వైపు చూడలేదు. దీంతో అసెంబ్లీ ఏకపక్షంగానే సాగిపోతోందని అంటున్నారు. అయితే ఏమైందో కానీ బుధవారం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆకస్మికంగా అసెంబ్లీకి వచ్చారు. సభ లోపలకు వెళ్లపోయినా లాబీల్లో తిరుగుతూ కనిపించారు. ఈ సమయంలో ఆయనతో ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎంఎస్ రాజు మాటలు కలిపారు.

వైసీపీ ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీ వైపు చూడకపోగా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ లాబీల్లో ప్రత్యక్షం అవడంపై అధికార పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభకు రావాల్సిందిగా మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ ను ఆహ్వానించారు. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పర్యటన ఖర్చులపై వైసీపీ విమర్శలు వారి మధ్య చర్చకు వచ్చాయని అంటున్నారు. అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిపోయి, బిల్ గేట్స్ కు పెట్టిన సమోసా, టీ ఖర్చులపై వైసీపీ ప్రశ్నించడం ఏంటంటూ? ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎంఎస్ రాజు విపక్ష ఎమ్మెల్యే చంద్రశేఖర్ ను అడిగినట్లు చెబుతున్నారు.

దీంతో వారి ప్రశ్నలపై ఎమ్మెల్యే తాటిపర్తి స్పందిస్తూ ‘మీకు అన్నీ తెలిసి నాతో అడుకుంటున్నారా’ అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేతో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడినా, వారి మధ్య చర్చకు వచ్చిన అంశం, వైసీపీ ఎమ్మెల్యే స్పందించిన విధానంపై అసెంబ్లీ లాబీల్లో పెద్ద చర్చే జరిగిందని అంటున్నారు. వైసీపీ అసెంబ్లీని బహిష్కరించినా, కొందరు ఎమ్మెల్యేలు సమావేశాలు జరుగుతున్న తీరును బయట నుంచి పరిశీలించేందుకు అసెంబ్లీ వద్దకు వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అధిష్టానం ఆదేశాలతో సభ లోపలకు వెళ్లలేకపోతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

వైసీపీకి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మాజీ సీఎం జగన్, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు అసెంబ్లీకి వెళ్లినా, వెళ్లకపోయినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని అంటున్నారు. వారి నియోజకవర్గాల్లో వీరు అసెంబ్లీకి హాజరయ్యారా? లేదా? అన్న అంశం అసలు ఏమాత్రం చర్చకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. కానీ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంతో లోలోన ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయం అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో గానీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీ లాబీల్లో తిరగడంపై పెద్ద చర్చే జరుగుతోంది.

Tags:    

Similar News