H1B ఏంటీ బోడి.. కృషి, పట్టుదలతో అంతకుమించి కొట్టిన బెంగళూరు టెకీ

అమెరికాలో పనిచేయాలనే కల ఉన్న ఎంతోమంది భారతీయులకు H1B వీసా ఒక ప్రధాన మార్గం.;

Update: 2025-09-24 12:30 GMT

బెంగళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనూశ్ శరణార్థి అనే యువకుడు మూడు సార్లు H1B వీసా లాటరీలో విఫలమైనప్పటికీ నిరుత్సాహపడకుండా తన కృషి, పట్టుదలతో అసాధారణమైన O-1 వీసాను సాధించి విజయం సాధించారు. ఆయన కథ అనేకమంది యువతకు ప్రేరణగా నిలుస్తోంది.

నిరాశను పట్టుదలగా మార్చుకున్న తనూశ్

అమెరికాలో పనిచేయాలనే కల ఉన్న ఎంతోమంది భారతీయులకు H1B వీసా ఒక ప్రధాన మార్గం. అయితే ఇది లాటరీ పద్ధతిలో ఇవ్వడం వల్ల అందరికీ సులభంగా దక్కదు. బెంగళూరుకు చెందిన తనూశ్ శరణార్థి కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. వరుసగా మూడు సార్లు H1B వీసా లాటరీలో ఎంపిక కాలేకపోయారు. ఈ వైఫల్యం ఆయనలో నిరాశను కలిగించినప్పటికీ, ఆయన వెనక్కి తగ్గకుండా మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నారు.

AIలో నైపుణ్యం, O-1 వీసా విజయం

H1B రాకపోవడంతో తనూశ్ తన శక్తిని, సమయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వినియోగించారు. రాత్రింబవళ్లు కష్టపడి AIలో అసాధారణ ప్రతిభను సాధించారు. ఆయన కృషికి తగిన ఫలితం లభించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన O-1 వీసా అప్రూవల్ అయిందని ఆయన సంతోషంగా తెలిపారు.

O-1 వీసా అంటే ఏమిటి?

O-1 వీసాను సాధారణంగా 'ఐన్‌స్టీన్ వీసా' అని పిలుస్తారు. ఇది సాధారణ వీసా కాదు. ఇది విజ్ఞాన శాస్త్రం, కళలు, విద్య, వ్యాపారం లేదా క్రీడలు వంటి రంగాలలో అసాధారణ నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే మంజూరు చేయబడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ వీసాను పొందాలంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఆ రంగంలో గణనీయమైన విజయాలు సాధించి ఉండాలి. తనూశ్ తన AI నైపుణ్యంతో ఈ అసాధారణ అర్హతను సాధించారు.

తనూశ్ సాధించిన ఈ విజయం యువతకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు, మరో మార్గం తప్పకుండా ఉంటుంది. పట్టుదల, కృషి ఉంటే అసాధ్యమనిపించే వాటిని కూడా సాధించవచ్చని ఆయన జీవితం నిరూపించింది. ఆయన కథ ఎందరికో స్ఫూర్తినిస్తుంది.

Tags:    

Similar News