విజయ్ సర్కారు కూల్చేందుకు రూ.180 కోట్లు.. బయటకొచ్చిన షాకింగ్ నిజం!
సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి పోలీసుల విచారణలో పలువురు నిందితులు షాకింగ్ నిజాల్ని వెల్లడించటంతో పలువురు డీఎంకే నేతలకు.. వారికి దన్నుగా నిలిచిన వ్యాపార సంస్థల యజమానులకు గడ్డు రోజులు మొదలైనట్లేనని చెప్పక తప్పదు.
ప్రజాతీర్పును ధనబలంతో దెబ్బ తీయాలని ప్రయత్నిస్తే.. మొదటికే మోసం వస్తుంది. అధికారంలోకి వచ్చి.. సీఎం కుర్చీలో కూర్చున్నారో లేదో.. విజయ్ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందన్న మాజీ సీఎం స్టాలిన్ మాటలకు తగ్గట్లే.. ఆయన పార్టీకి చెందిన నేతలు వేసిన కుట్ర బద్ధలైంది. రూ.180 కోట్ల బడ్జెట్ తో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే దుర్మార్గమైన ప్లాన్ బెడిసికొట్టింది. ఇందుకు కారణమైన కొందరు ఇప్పటికే జైలుఊచలు లెక్కిస్తుంటే..మరికొందరు పరారీలో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో విపక్ష డీఎంకేకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా భావిస్తున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి పోలీసుల విచారణలో పలువురు నిందితులు షాకింగ్ నిజాల్ని వెల్లడించటంతో పలువురు డీఎంకే నేతలకు.. వారికి దన్నుగా నిలిచిన వ్యాపార సంస్థల యజమానులకు గడ్డు రోజులు మొదలైనట్లేనని చెప్పక తప్పదు.
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయన పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేలాచేసి.. విశ్వాస పరీక్షలో క్రాస్ ఓటింగ్ ద్వారా దొంగ దెబ్బ తీయాలని ప్లాన్ చేయటం.. అందుకు తగ్గట్లే రూ.180 కోట్ల భారీ మొత్తాన్ని సిద్ధం చేసిన దుర్మార్గం తాజాగా వెలుగు చూసింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఎనిమిది మంది నిందితులను విచారించిన నేపథ్యంలో వారు షాకింగ్ అంశాల్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.
క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగరై ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజాకు ఫోన్ చేసిన కొందరు..ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార టీవీకేకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతూ ఓటు వేయాలని.. అలా చేస్తే రూ.35 కోట్ల భారీ నజరానా ఇచ్చేందుకు సిద్ధమన్న ఆఫర్ ను అందుకున్నారు. అందుకు నో చెప్పిన ఎమ్మెల్యేకు బెదిరింపులు మొదలు కావటంతో ఆయన చెన్నై పోలీస్ కమిషన్ ను సంప్రదించి తనను బెదిరింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రభుత్వాన్ని పడేసేందుకు జరుగుతున్న కుట్ర కేసును నమోదు చేసి విచారించగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పొలిటికల్ సర్వే సంస్థను నిర్వహిస్తున్న తిరునావుక్కరసు.. త్యాగరాజన్ తో సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వారు వెల్లడించిన సమాచారానికి అనుగుణంగా డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ.. ఆయన సోదరుడు అశోక్ కుమార్ పాత్ర ఉన్నట్లు తేల్చారు. దీంతో..వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేయగా.. వారు పరారీలో ఉన్నట్లు తేలింది. అదే సమయంలో మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తించారు.
ఈ కుట్ర ఉదంతంలో మరికొందరు డీఎంకే.. అన్నాడీఎంకేకు చెందిన నేతల పేర్లు బయటకు వచ్చే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ.. ఆయన సోదరుడు సూచనలతోనే తాము ఈ పనికి పాల్పడినట్లుగా నిందితులు ఒప్పుకోవటం ఒక ఎత్తు అయితే.. ఇంత భారీ మొత్తాన్ని సిద్ధం చేసేందుకు కొందరు వ్యాపారవేత్తలు దన్నుగా ఉంటామని చెప్పిన వైనం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ ఉదంతానికి సంబంధించి మరిన్ని సంచలన అంశాలు వెలుగు చూడటం ఖాయమని చెప్పక తప్పదు.