రూల్స్ బ్రేక్ చేయడంలో ‘బాహుబలి’.. ఒకే బైక్‌పై ₹5.45 లక్షల చలాన్లు, 63 ఉల్లంఘనలు
గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై ఎప్పటిలాగే సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతలో మన ‘రికార్డ్ బ్రేకర్’ బైక్‌పై అటుగా వచ్చాడు.
మనదేశంలో ట్రాఫిక్ రూల్స్ అంటే చాలా మందికి ఒక రకమైన లోకువ. సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకెళ్లడం.. హెల్మెట్ ఇంట్లో పెట్టి స్టైల్‌గా బైక్ నడపడం మనవాళ్లకు అలవాటే. సాధారణంగా ఒకటి, రెండు చలాన్లు పడితేనే అమ్మో అనుకుంటూ తలపట్టుకుంటాం. కానీ హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ఒక ఘనాపాటి మాత్రం ట్రాఫిక్ పోలీసుల రికార్డులనే తిరగరాశాడు. ఏకంగా ఒకే ఒక్క బైక్‌పై 63 పెండింగ్ చలాన్లు సంపాదించి, వాటి మొత్తం విలువను ₹5,45,500 కు చేర్చాడు! అవును మీరు చదివింది నిజమే.. సెకండ్ హ్యాండ్ కార్ వచ్చే రేంజ్ లో చలాన్లు వెనకేసుకున్న ఆ మహానుభావుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
అసలు కథేంటంటే..?
గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై ఎప్పటిలాగే సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతలో మన ‘రికార్డ్ బ్రేకర్’ బైక్‌పై అటుగా వచ్చాడు. పోలీసులను చూసి కాస్త అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో సరే ఏదో తేడాగా ఉందని అతడిని ఆపారు. "బాబు.. కాస్త బైక్ డాక్యుమెంట్లు చూపించు" అని అడిగితే, మనోడు జేబులన్నీ వెతికి తెల్లమొహం వేశాడు.
సరే రూల్స్ ప్రకారం బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా ట్రాఫిక్ డేటాబేస్‌లో చెక్ చేద్దామని పోలీసులు సిస్టమ్‌లో ఎంటర్ చేశారు. అంతే ఆ సిస్టమ్ స్క్రీన్ చూసి పోలీసుల గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది. ఎందుకంటే అక్కడ ఒకటో రెండో కాదు.. ఏకంగా 63 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ మొత్తం జరిమానా విలువ అక్షరాలా ఐదు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు. ఆ బైక్ అసలు ధర కంటే ఈ చలాన్ల మొత్తమే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండటం విశేషం.
ఉల్లంఘనల ‘జాబితా’ ఒక రేంజ్‌లో ఉంది
ఆ బైకర్ చేసిన ఘనకార్యాల లిస్ట్ చూస్తే ట్రాఫిక్ రూల్స్ పుస్తకంలో ఉన్న అన్ని సెక్షన్లు గుర్తొస్తాయి. సిగ్నల్ పడితే ఆగడం మన డిక్షనరీలోనే లేదు అన్నట్లు దూసుకెళ్లడం... రోడ్డు రేసర్లకు పోటీగా బైక్ నడపడం... జుట్టు చెదిరిపోతుందనో ఏమో గానీ హెల్మెట్‌ను అస్సలు ముట్టుకోకపోవడం... రోడ్డుపై జిగ్‌జాగ్ కటింగ్‌లతో మిగతా వాహనదారుల ప్రాణాలు గుప్పిట్లో పెట్టడం... ఇలా ఒకటా రెండా.. పదే పదే అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతూ ట్రాఫిక్ కెమెరాలకు చిక్కాడు. బహుశా చలాన్ల రూపంలో డిజిటల్ ఇండియాకు తన వంతు భారీ విరాళం ఇవ్వాలనుకున్నాడో ఏమో.. ట్విస్ట్ ఏంటంటే ఇంత భారీ మొత్తంలో చలాన్లు పెండింగ్‌లో పెట్టుకుని కూడా, సదరు వాహనదారుడు ఏ భయం లేకుండా నగర రోడ్లపై దర్జాగా తిరిగేయడమే ఇక్కడ అసలైన హైలైట్.
బైక్ సీజ్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
ఈ ఘనకార్యం బయటపడటంతో పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బైక్‌ను తక్షణమే సీజ్ చేశారు. "ఇకపై ఇలాంటి ‘ఘనుల’ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం" అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తున్నారు: "ఆ చలాన్లు కట్టే బదులు.. బైక్‌ను పోలీసులకే గిఫ్ట్‌గా ఇచ్చేసి కొత్త బైక్ కొనుక్కోవడం బెటర్!" అని ఒకరంటే.. "మనోడు బైక్ నడపలేదు సార్.. చలాన్ల కలెక్షన్ గేమ్ ఆడాడు.. చివరికి అవుట్ అయ్యాడు" అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు.
చిన్న మొత్తంలో జరిమానా పడితేనే చాలామంది "తర్వాత కడదాంలే" అని లైట్ తీసుకుంటారు. కానీ అలా వదిలేస్తే చివరికి గురుగ్రామ్ బైకర్ లాగా బైక్ వదిలేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాహనదారులారా.. మీ వెహికల్స్‌పై ఏవైనా పెండింగ్ చలాన్లు ఉన్నాయేమో ఎప్పటికప్పుడు అఫీషియల్ పోర్టల్‌లో చెక్ చేసుకోండి. లేదంటే మీ బైక్ రేటు కంటే.. మీ చలాన్ల రేటే ఎక్కువైపోయే ప్రమాదం ఉంది. సురక్షితంగా ప్రయాణించండి.. అనవసరమైన ఆర్థిక భారం నుండి తప్పించుకోండి.