అడ్డదిడ్డంగా బూతులు తిట్టేసి ఇవేం నీతులు ప్రశ్న రావణ్?

నరం లేని నాలుక నోటికి వచ్చినట్లు మాట్లాడుతుందని చెబుతారు. అయితే.. విచక్షణతో దాన్ని అదుపులోకి ఉంచుకోవాల్సిన అవసరం బాధ్యతతో వ్యవహరించే వారి సొంతం. అందుకు భిన్నంగా ఎజెండాతో ముందుకు సాగే వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Update: 2026-07-05 07:37 GMT

నరం లేని నాలుక నోటికి వచ్చినట్లు మాట్లాడుతుందని చెబుతారు. అయితే.. విచక్షణతో దాన్ని అదుపులోకి ఉంచుకోవాల్సిన అవసరం బాధ్యతతో వ్యవహరించే వారి సొంతం. అందుకు భిన్నంగా ఎజెండాతో ముందుకు సాగే వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి విషం అవసరం లేకుండా.. మాటల్నే విషంగా విరజిమ్మే వారిని ఏం చేయాలి? గతంలో మీడియా మాత్రమే ఉండేది. ఇప్పుడు దానికి జోడీగా ‘సోషల్ మీడియా’ ఒకటి వచ్చి చేరింది. ఇక్కడ ఎవరూ ఎవరిని సెన్సార్ చేయలేరు. ఇష్టం వచ్చినట్లుగా.. నోటికి ఉన్న దురద తీరేలా మాట్లాడేయొచ్చు. ఎవరైనా అభ్యంతరం చెప్పి.. చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ప్రపంచ వ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉంటుంది.

ఒకవేళ.. చట్టపరమైన చర్యలకు దిగితే.. వాక్ స్వాతంత్య్రం.. స్వేచ్ఛను సమాధి చేయటం.. చంపేయాలని ప్లాన్ చేశారు కదూ? లాంటి నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం ఈ మధ్యన ఎక్కువైంది. తాము అభిమానించే వారి కోసం ఎంతకైనా తెగించే తత్త్వం ఇటీవల ఎక్కువైంది. దానికి కులం.. మతం.. ప్రాంతం లాంటి భావోద్వేగాల్ని రెచ్చగొట్టే ముడిసరుకుగా మార్చేసి అమాయక ప్రజల మీదకు వదలటం ఈ మధ్యన ఎక్కువైంది.

ఈ తరహా ధోరణిని మర్యాదస్తులు డ్రాయింగ్ రూంలో కూర్చొని మదనపడుతూ.. ఇదేం పద్దతి.. ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న ఆందోళనకు గురవుతుంటే.. అందుకు భిన్నంగా ఇలాంటి వాటితో వివాదాల చలిమంటలు కాచుకునే వారు మాత్రం.. చెలరేగిపోతూ.. తమకు అందిన విషగుళికల్ని జీర్ణించుకొని.. మరింత విషపూరితంగా మారే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇక్కడ ఎవరిని జడ్జి చేయటం లేదు. కాకుంటే.. ఇటీవల పెరుగుతున్న ఈ పెడ పోకడల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచలకూరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సామాజిక అంశాల మీద విశ్లేషణలు చేసే యూట్యూబర్ గా ఆయనకు పేరుంది. కారణం ఏమైనా కానీ ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా..ఆయన కుమారుడు కం మంత్రి లోకేశ్ అన్నా.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా అస్సలు గిట్టదు. అందరు అందరికి నచ్చాలన్న నిబంధన లేదు. కానీ.. నచ్చనోళ్లను నోటికి వచ్చినట్లుగా తిట్టేయటం సరైనదేనా? అన్నది ప్రశ్న. ఇక్కడే మరో సమాధానం కొందరి వద్ద సిద్ధంగా ఉంటుంది. అదేమంటే.. మీరు ప్రస్తావించిన చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ లు ఉత్తమ పురుషులా? వాళ్లేం తప్పులు చేయలేదా? నోటికి వచ్చినట్లుగా మాట్లాడలేదా? రెచ్చగొట్టేలా వ్యవహరించలేదా? అని ప్రశ్నించొచ్చు.

ఒకవేళ.. సదరు గొంతులు ప్రశ్నించేలా వ్యవహరించే ఉండి ఉంటే.. చట్టబద్ధంగా.. న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. ఒకరు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే.. వారికి మించిన బరితెగింపును ప్రదర్శించాలా? అదే సమస్యకు పరిష్కారం అవుతుందా? అన్నది అసలు ప్రశ్న. కారణం ఏమైనా కానీ.. ఇటీవల ఏలూరులో దళిత క్రైస్తవ మహాసభ జరిగింది. అందులో పాల్గొన్న ప్రశ్న రావణ్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. హిందూ దేవేళ్లు.. వ్యవస్థల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శలకు పరిమితంగా కాకుండా వ్యక్తుల నమ్మకాలను దెబ్బ తీసేలా హిందూ దేవుళ్లు.. దేవతల మీదా ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే.. ఆయన వ్యాఖ్యల్ని ఇక్కడ రాయలేని పరిస్థితి.

ప్రశ్న రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ప్రశ్న రావణ్ ను అరెస్టు చేశారు. ఆయన్ను ఏపీకి తరలించి కోర్టుకు హాజరు పర్చగా.. అక్కడ ఆయనకు బెయిల్ లభించింది. అయితే.. మరో కేసులో వేరే స్టేషన్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కూడా రావణ్ కు బెయిల్ లభించింది. కాసేపటికే మరో కేసులో అరెస్టు చేశారు. ఇలా పలు స్టేషన్లలో పెట్టిన కేసుల్లో అరెస్టు చేయటం.. నాలుగు కోర్టుల్లో ఆయనకు బెయిల్ మంజూరు కావటంతో.. ఏపీ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఒకటి ఉంది. అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. సమాజంలో అనవసర ఉద్రిక్తతలకు కారణమయ్యారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసే క్రమంలో.. దానికి సంబంధించి పక్కా హోంవర్కు చేసి అదుపులోకి తీసుకుంటే సరిపోతుంది. అందుకు భిన్నంగా.. కోర్టుకు హాజరుపర్చినంతనే బెయిల్ వచ్చేలా వ్యవహరించటం పోలీసుల వైఫల్యం అవుతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరోసారి అరెస్టు చేయటం.. ఇంకో కోర్టుకు తీసుకెళ్లటం లాంటి చర్యలు.. నోటికి వచ్చినట్లు మాట్లాడిన ప్రశ్న రావణ్ లాంటి వాళ్ల మీద సానుభూతి వ్యక్తం అయ్యేలా చేస్తోంది. అలాంటి వారికి స్వయంప్రకాశిత మేధావి ప్రకాశ్ రాజ్ లాంటి వారి అండ ఉండనే ఉంటుంది.

తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడేలా చేయటంలో పోలీసులు ఫెయిల్ కావటం ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పాలి. ఇలాంటి తీరుతో.. తప్పులు చేసే వారికి మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ మాటకు వస్తే.. తాము తప్పే చేయలేదని.. తమను లక్ష్యంగా చేసుకొని హింసకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు చేయొచ్చు. పనిలో పని తన మీద మరింత సానుభూతి వచ్చేలా మాట్లాడొచ్చు. ఇందుకు తాజాగా ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. విషయం ఇటటే అర్థమవుతుంది.

ఒక కేసులో బెయిల్ వచ్చిన సందర్భంగా ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం తన గొంతు నొక్కుతోందని.. తనను చంపితే తాను ఒక్కడినే చచ్చిపోతాను కానీ.. ప్రశ్నించే వారు చావరని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు రావణ్ ను మాత్రమే చంపగలరు. ప్రశ్నను చంపలేరు. ప్రతిరోజూ 500 మంది పోలీసులు ప్రజా సమస్యల్ని వదిలేసి నా కోసం పని చేస్తున్నారు. ఇంత భయపడుతున్నారా? ఎస్పీ క్యాడర్ నుంచి కానిస్టేబుల్ వరకు అంతా నా కోసమే పని చేస్తున్నారు. ఇదా ఏపీలో పరిస్థితి’’ అంటూ ఎలా మాట్లాడితే అందరి కంట్లో పడతారో.. అలానే మాట్లాడారు.

ఇలాంటప్పుడే పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతాయి. నిజంగానే రావణ్ తప్పుడు మాటలు మాట్లాడి.. ఉద్రిక్త పరిస్థితులకు కారణమైతే.. వాటిని నిరూపించే బలమైన సాక్ష్యాల్ని సేకరించి.. కోర్టుకు సమర్పించలేని పోలీసులను ఏమనాలి? చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా అడ్డుకునే మాస్టర్ మైండ్ లను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనా పొలీసులు సరిగా హోంవర్కు చేయకుంటే పరిస్థితులు మరింత దారుణంగా మారతాయన్నది మర్చిపోకూడదు. అదే సమయంలో నోటికి వచ్చినట్లుగా రాయలేని బూతులు మాట్లాడేసి.. నీతులు చెప్పే వారు మరింత బలపడేలా వ్యవస్థలు వ్యవహరిస్తే.. భవిష్యత్తు మరింత భయానంగా మారుతుంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ కావొచ్చు. సర్లే అని సరిపెట్టుకుంటే.. రాబోయే రోజుల్లో వంద మంది ప్రశ్న రావణ్ లు రావొచ్చు. అదే జరిగితే ఏపీలో పరిణామాలు ఎలా ఉంటాయి? అన్న ప్రశ్నే మరింత భయానికి గురయ్యేలా చేస్తుంది. నోటికి వచ్చినట్లుగా బూతులు మాట్లాడేవారు ఎవరైనా సరే ఉపేక్షించటం మానేసి.. కఠిన చర్యలు తీసుకోనేలా వ్యవహరించకుంటే తెలుగు రాష్ట్రాల్లో అరాచకమే అధికారానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతుందన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News