తప్పదు.. రేవంత్ రంగంలోకి దిగాల్సిందేనా?
31 నెలలుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ సర్కారుకు చిన్ని చిన్న ఇబ్బందులు.. ఇరుకున పడిన సందర్భాలు ఉన్నప్పటికి.. తాజాగా రెండు అంశాల మీద ఆయన ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందన్న భావన అంతకంతకూ పెరుగుతోంది.
31 నెలలుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ సర్కారుకు చిన్ని చిన్న ఇబ్బందులు.. ఇరుకున పడిన సందర్భాలు ఉన్నప్పటికి.. తాజాగా రెండు అంశాల మీద ఆయన ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందన్న భావన అంతకంతకూ పెరుగుతోంది. అయితే.. ఈ రెండు అంశాల్ని ముఖ్యమంత్రి రేవంత్ కాకుండా..ఆయన మంత్రివర్గంలోని ముఖ్యమైన నేతలు టేకప్ చేయటం గమనార్హం. ఆసక్తికర అంశం ఏమంటే.. వారం వ్యవధిలోనే ఒకటికి మూడు అంశాలకు సంబంధించి విపక్షం సంధిస్తున్న అస్త్రాలకు సరైన రీతిలో సమాధానాలు చెప్పే పరిస్థితి లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.
గురుకులాల టెండర్లకు సంబంధించి.. అందులో జరిగినట్లుగా బీఆర్ఎస్ అగ్రనేతలు ఆరోపిస్తున్న భారీ స్కాం అంశం రేవంత్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ అంశంపై బహిరంగ చర్చకు సవాలు విసరటం.. అందుకు స్పందించిన హరీశ్.. తనకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకొని చర్చకు సిద్ధం కావటం.. ఈ దూకుడును అంచనా వేయటంలో జూపల్లి అండ్ కో ఫెయిల్ కావటంతో.. తదుపరి అడుగు ఎలా వేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్న వేళలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలు.. వంద రోజుల్లో హామీల పూర్తి.. హైడ్రా.. రైతు రుణమాఫీ.. రైతు భరోసా.. ఇలా పలు అంశాలకు సంబంధించి చికాకులు ఎదురైనప్పటికి.. అవేమీ ప్రభుత్వాన్ని అంతగా ఇరుకున పెట్టింది లేదు. అందుకు భిన్నంగా గడిచిన వారంలో తెర మీదకు వచ్చిన గురుకుల పాఠశాలల టెండర్లలో చోటు చేసుకుందని చెబుతున్న భారీ కుంభకోణం.. రాష్ట్ర అప్పుల వివాదం విషయంలో మాత్రం ఆయా మంత్రుల కారణంగా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్లుగా చెబుతున్నారు. రెండున్నరేళ్లలో ఎప్పుడూ లేనంత స్పష్టంగా అధికారపక్షంపైన విపక్షం అధిక్యను ప్రదర్శించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇది గులాబీ దళానికి కొత్త ఊపును ఇస్తే.. రేవంత్ ప్రభుత్వం కొత్త తరహా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
అన్ని బాగున్నప్పుడు.. అంతా తమ ప్రతిభేనంటూ ఎవరికివారు గొప్పలు చెప్పుకోవటం.. జబ్బలు చరుచుకుకోవటం మామూలే. అదే సమస్య ఎదురైనప్పుడు.. ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటిని సరిదిద్ది అధిక్యతను ప్రదర్శించటం అంత తేలికైన విషయం కాదు. గురుకులాలు.. రాష్ట్ర అప్పుల విషయంలో హరీశ్ అండ్ కో లేవనెత్తిన అంశాలకు బలమైన కౌంటర్ ఇచ్చే విషయంలో మంత్రులు నీళ్లు నములుతూ.. బిక్కముఖాలు వేసిన వేళ.. సీఎం రేవంత్ అవసరం ఎంతన్న విషయం కాంగ్రెస్ వర్గాలకు అర్థమైనట్లుగా చెబుతున్నారు.
ఇప్పటివరకు సింగిల్ హ్యాండ్ తో కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ లకు కౌంటర్లు ఇస్తుంటే.. సీఎం విలువ కాంగ్రెస్ మంత్రులకు అర్థం కాలేదని.. తాజా పరిణామాలతో విషయం అందరికి అవగతమవుతోందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యలో చేజారిన అధిక్యతను తిరిగి నిలబెట్టుకోవటానికి ఈ రెండు అంశాలను సీఎం రేవంత్ టేకప్ చేయనున్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. అనుకున్నట్లే.. ఈ రెండు అంశాల్ని టేకప్ చేసి.. విపక్షాన్ని తన వాదనతో ఉతికి ఆరేస్తే మాత్రం.. రేవంత్ సత్తా మరోసారి నిరూపితమవుతుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.