రంకెలు వేస్తే అంకెలు మారవు.. అదిరేలా హరీశ్ పంచ్

సరైన టైమింగ్.. తనకు తగ్గ సబ్జెక్టు చేతికి రావాలే కానీ.. అధికారపక్షాన్ని అదరగొట్టేలా మాట్లాడే సత్తా ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో హరీశ్ రావు ఒకరు.

Update: 2026-07-05 07:34 GMT

బ్యాట్ తో మైదానంలోకి అడుగు పెట్టినంతనే సిక్సులు.. ఫోర్లతో చితక్కొట్టేసే బ్యాట్స్ మెన్.. నిప్పులు చెరిగేలా బంతులు విసురుతూ బ్యాట్స్ మెన్ కు పరుగు తీయటమే కష్టంగా మారేలా మేజిక్ బంతులు వేసే బౌలర్ ఫామ్ తప్పితే ఎలా ఉంటుంది? పదేళ్ల విరామం తర్వాత అధికారపక్షం నుంచి విపక్షంలోకి అడుగు పెట్టిన హరీశ్ పరిస్థితి అలానే ఉందని చెప్పాలి. సరైన టైమింగ్.. తనకు తగ్గ సబ్జెక్టు చేతికి రావాలే కానీ.. అధికారపక్షాన్ని అదరగొట్టేలా మాట్లాడే సత్తా ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో హరీశ్ రావు ఒకరు.

రేవంత్ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన తరచూ ఏదో అంశాన్ని టేకప్ చేయటం.. అవన్నీ ఆయనకు బ్యాక్ ఫైర్ మాదిరి కావటం.. ఒకప్పటి హరీశేనా ఇలా మాట్లాడుతుందన్న భావన సొంత పార్టీ వారికే కాదు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల నోట ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తున్న పరిస్థితి. సమయం.. సందర్భం చూసుకొని గళం సవరించుకోవాల్సిన హరీశ్.. అవసరం లేని అంశాలకు స్పందిస్తూ తనకున్న ఇమేజ్ ను తానే స్వయంగా చెడగొట్టుకుంటున్నారన్న మాట పలు సందర్భాల్లో వినిపిస్తున్న పరిస్థితి.

అందుకు భిన్నంగా గడిచిన రెండు.. మూడు రోజులుగా ఆయన పాత హరీశ్ ను గుర్తుకు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఎంతలా నెట్ ప్రాక్టీస్ చేసినప్పటికి.. గ్రౌండ్ లోకి దిగేసరికి మాత్రం సింగిల్ డిజిట్ కే ఔటయ్యే స్టార్ బ్యాట్స్ మెన్ తరహాలో హరీశ్ పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని రీతిలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో చేసిన అప్పులంటూ అధికారపార్టీ చేస్తున్న వ్యాఖ్యలపై తాజాగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు బాగా పట్టున్న లెక్కల అంశం తెర మీదకు వచ్చేసరికి ఆయన చెలరేగిపోయారు.

అంకెలతో వచ్చే సమస్య ఏమంటే.. తెలివిగా వాదన వినిపించేలా కానీ.. అంకెల్ని తమ తగ్గట్లుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే వాదన వినిపించేవారు ఎవరూ కూడా అసలు విషయాన్ని పక్కన పెట్టి.. తాము చెబుతున్న వాదనకు అనుగుణంగా చెప్పేస్తుంటారు. ఇక.. హరీశ్ విషయానికి వస్తే.. ఇటీవల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పు రూ.8.21లక్షల కోట్లుగా చెప్పారని.. కానీ అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య అందరిని ఆకర్షిస్తోంది. రంకెలు చేసినంత మాత్రాన అంకెలు మారవన్న హరీశ్.. తన వాదనకు తగ్గట్లే గణాంకాలతో లెక్కలు చెప్పుకొచ్చారు.

హరీశ్ చెప్పిన లెక్కల్ని ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘విలేకరుల సమావేశంలో భట్టి చెప్పిన లెక్కల్నే చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత (2023 డిసెంబరు 7 నుంచి 2024 మార్చి 31 వరకు) తీసుకున్న ఎఫ్ఆర్ బీఎం రుణాలు రూ.15,118 కోట్లు. ఈ మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పుతో కలిపి చూపించారు. అంటే రూ.84,268 కోట్లకు రూ.15,118 కోట్లను కూడితే రూ.99,386 కోట్లు. ఈ మొత్తాన్ని 2023 డిసెంబరు 7 నాటికి ప్రభుత్వంపై ఉన్న రుణ బకాయిలు రూ.5,16,881 కోట్ల నుంచి తీసేస్తే.. రూ.4,17,495 కోట్లు అవుతుంది. భట్టి లెక్కల ప్రకారం ఎన్ని కలిపినా కాంగ్రెస్ వాళ్లు చెప్పిన రూ.8,21,651 కోట్లకు రావట్లేదు. అందులో ఏమేం కలిపారో వారే చూసుకోవాలి’’అంటూ చురకలు అంటించారు.

బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు దాటలేదన్న మాటకు తాను కట్టుబడి ఉంటానని చెప్పిన హరీశ్.. దీనికి సంబంధించిన చర్చకు తానెప్పుడైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.6,71,757 కోట్లుగా చెప్పారు. ఇందులో కూడా తమకు సంబంధం లేనివి కలిపి చెప్పారంటూ అంకెల లెక్కల్ని వరుసగా చెబుతూ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశారు. మొత్తంగా చూస్తే.. ఈ ఎపిసోడ్ లో హరీశ్ తీరు చూస్తే.. అధికారపక్షం అదిరేలా ఆయన కంబ్యాక్ ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి రేవంత్ సర్కారు ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News