ఎన్డీయేకి విజయ్ దెబ్బేసారా ?
గతంలో కంటే సీట్లు పదో ఇరవయ్యో తగ్గినా కూడా డీఎంకేదే అధికార పీఠం అని ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా బల్ల గుద్ది చెబుతున్నాయి.;
తమిళనాడులో మరోసారి స్టాలిన్ అధికారంలోకి వస్తారు అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గతంలో కంటే సీట్లు పదో ఇరవయ్యో తగ్గినా కూడా డీఎంకేదే అధికార పీఠం అని ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా బల్ల గుద్ది చెబుతున్నాయి. ఒక్క దాంట్లో కూడా ఎన్డీయే గెలుస్తుందని చెప్పలేదు పైగా గతంలో అన్నా డీఎంకే ప్లస్ బీజేపీకి వచ్చిన 70 కి పైగా సీట్లలో ఈసారి కోత పడుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో ఓటు షేర్ కూడా భారీగా తగ్గుతోంది. దీనికి కారణం ఏమిటి అంటే కొత్తగా వచ్చిన టీవీకే ఎన్డీయే అధికార ఆశలకు గండి పెడుతోంది అని ఎగ్జిట్ పోల్స్ ని బట్టి విశ్లేషించాల్సి వస్తోంది.
భారీగా చీలిక :
ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే ఈజీగా అధికారం మరోసారి పవర్ లో ఉన్న వారికి దక్కుతుంది అది రాజకీయ లెక్కలలో ప్రధమ సూత్రం. దేశంలో అనేక సార్లు అది రుజువు అయిన సత్యం. ఎగ్జిట్ పోల్స్ ని బట్టి చూస్తే తమిళనాడులో అదే జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. విజయ్ పార్టీ కి సింగిల్ డిజిట్ ఓటు షేర్ వస్తుందని అనుకుంటే ఈ 18 నుంచి 20 శాతం దాకా ఓటు షేర్ దక్కుతుందని అనేక సర్వే సంస్థలు చెప్పుకొచ్చాయి. ఇక సీట్ల విషయం చూస్తే 10 నుంచి 15 దాకా వస్తాయని చెబుతున్నాయి. వీటిని బట్టి చూస్తే టీవీకే తాను సొంతంగా అధికారంలోకి రాకపోయినా భారీ ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చిందని అంటున్నారు. అలాగే ద్రవిడ వాదంతో పోటీకి దిగిన టీవీకే డీఎంకే ఓట్లకు కూడా కోత పెట్టిందని ఎగ్జిట్ పోల్స్ ని బట్టి చూస్తే అవగతం అవుతోంది.
బలమైన పార్టీగా :
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే రేపటి రోజున అసలైన ఫలితాలుగా వస్తే మాత్రం తమిళనాడు రాజకీయాలలో బలమైన ఫోర్స్ గా టీవీకే అవతరించడం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో అన్నా డీఎంకేకి ఇది దాదాపుగా చివరి చాన్స్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఎందుకంటే 2021లో ఓటమి చెందినా 70 సీట్లతో బలమైన ఏకైక ఆల్టర్నేషన్ గా ప్రతిపక్షంలో అన్నా డీఎంకే ఉంది. ఇపుడు కొత్త పార్టీగా టీవీకే అవతరించి విపక్షంలో అన్నా డీఎంకేతో పోటీ పడితే ఎసరు వచ్చేది పాత పార్టీకే అని అంటున్నారు. అధికారంలో ఉన్న స్టాలిన్ డీఎంకేకి పోయేది పెద్దగా ఉండదు, కానీ తక్షణ ప్రమాదం మాత్రం అన్నా డీఎంకేకి ఉండొచ్చు అని అంటున్నారు. ఈసారి బలంగా ప్రతిపక్షంలో టీవీకే ఉంటే అయిదేళ్ల పాటు తన సత్తా చాటుకుంటే అన్నా డీఎంకే ఓటు బ్యాంక్ కూడా టర్న్ అయి 2031 ఎన్నికల నాటికి అది టీవీకేకి లాభిస్తుందని ఈ రకమైన పోలరైజేషన్ లో అన్నా డీఎంకేకి దాని మిత్ర పక్షం బీజేపీకి దెబ్బ పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వేలే ఇవి అసలైన ఫలితాలు ఇలాగే ఉంటే ఇంకా మరిన్ని విషయాలు వీటి మీద చర్చించుకోవాల్సి ఉందని అంటున్నారు.