విజయ్ తో అజిత్ ఢీ...తమిళ రాజకీయాల్లో సంచలనం !

వెండి తెర నుంచి నేరుగా రాజకీయ తెర మీదకు వచ్చి సీఎం అయిపోయారు దళపతి విజయ్.

Update: 2026-05-17 23:30 GMT

వెండి తెర నుంచి నేరుగా రాజకీయ తెర మీదకు వచ్చి సీఎం అయిపోయారు దళపతి విజయ్. ఆయనది దాదాపుగా మూడు దశాబ్దాల సినీ జీవితం. ఇక సినీ ఇండస్ట్రీలో ఆయకు పోటీగా అజిత్ కుమార్ ఉన్నారు. ఈయన దళపతి అయితే ఆయన తలాగా ప్రసిద్ది పొందారు. ఈ ఇద్దరికీ మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పోటా పోటీగా ఈ ఇద్దరి సినిమాలు రిలీజ్ అయి తమిళనాడులో ఎన్నో సార్లు రికార్డుల మోత మోగించాయి. 1990 ప్రాంతంలో తెలుగులో ప్రేమ పుస్తకం సినిమాతో అజిత్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆయన తమిళనాడులో సూపర్ స్టార్ డం ని అనతికాలంలోనే సంపాదించారు. ఇక 1994లో సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్ తో అజిత్ కి దశాబ్దాల పాటు సినీ పోరు సాగింది. ఇద్దరి ఫ్యాన్స్ రెండుగా విడిపోయి తమ అభిమాన హీరో కోసం ఎంత దాకా అయినా వెళ్ళేలా కోలివుడ్ లో సీన్ క్రియేట్ అయింది. ఇవన్నీ పక్కన పెడిటే ఇపుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా సీఎం అయిపోయారు. మరి ఆయన సినీ ప్రత్యర్ధి అజిత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే దీని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

పద్మ భూషణ్ తో :

అజిత్ కుమార్ కి గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పౌర పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలా ఆయనను బీజేపీ కూడా ఒక ప్రత్యేక అభిమానంతో చూస్తోంది. విజయ్ కి కూడా పద్మ పురస్కారాలు రావాల్సి ఉన్నా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం బీజేపీకి యాంటీగా వ్యవహరించడం వంటి కారణాల వల్లనే ఆయనను పక్కన పెట్టి అజిత్ ని ప్రోత్సహించారు అన్న చర్చ కూడా ఆనాడు నడచింది. ఇదంతా ఎందుకు అంటే అజిత్ రాజకీయ ప్రవేశం మీద ప్రస్తుతం జరుగుతున్న చర్చ వెనక బీజేపీ ఏమైనా ఉందా అన్న డౌట్లు వస్తున్నందుకే అని అంటున్నారు. ఇంతకీ అజిత్ కుమార్ ఏ రాజకీయ పార్టీ తరఫున రంగంలోకి దిగుతారు అంటే అన్నా డీఎంకే నుంచి అని అంటున్నారు. ఆశ్చర్యకరంగా ఆయన కొత్త పార్టీ అయితే పెట్టరని ఈ ఊహాగానాలా సారాంశం అన్న మాట. అన్నా డీఎంకే బీజేపీ పొత్తులో ఉంది. దానిని బట్టి చూస్తేనే ఈ ప్రచారానికి అంత హైప్ వచ్చింది అని అనుకోవాల్సి ఉంది.

ఆనాడే పుకార్లుగా :

ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో అజిత్ కుమార్ కి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆమె అమ్మగా ఎంతో ఆప్యాయత కనబరచింది. జయలలితకు వారసుడు అజిత్ కుమార్ అని కూడా అప్పట్లో ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. ఇదంతా ఆమె జీవించి ఉన్నపుడే వచ్చిన ప్రచారం కావడం విశేషం. ఇక 2016లో జయలలిత మరణించిన తరువాత అన్నా డీఎంకే పగ్గాలను భారీ సినీ ఇమేజ్ ఉన్న అజిత్ కుమార్ చేపట్టాలని డిమాడ్లు కూడా వచ్చాయి. కానీ అజిత్ కుమార్ మాత్రం పెద్దగా స్పందించలేదు. మొత్తానికి పదేళ్ళ పాటు కిందా మీదా పడి అన్నా డీఎంకేని నెట్టుకుని వచ్చారు. తాజా ఎన్నికల్లో పూర్తిగా ఆ పార్టీ చతికిలపడింది. అంతే కాదు రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో అన్నా డీఎంకేలోని సీనియర్ నేతలు కొందరు పార్టీని కాపాడుకునే క్రమంలో అజిత్ కుమార్ నాయకత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు అని అంటున్నారు.

తిరుగులేని నేతగా :

ఎం జీఆర్ అన్నా డీఎంకేని స్థాపించినా కూడా మూడు దశాబ్దాల పాటు ఆ పార్టీని తిరుగులేని నేతగా మారి జయలలిత కొనసాగించారు. అత్యంత బలమైన పార్టీగా నిలిపారు. కరుణానిధి వంటి రాజకీయ చాణక్యుడిని సైతం అడ్డుకుని తాను నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక రెండు సార్లు వరుసగా అన్నా డీఎంకేని గెలిపించి ట్రాక్ రికార్డుని రివర్స్ చేశారు. అలాంటి అన్నా డీఎంకే దీనావస్థ ప్రస్తుతం చూసిన వారికే అయ్యో అనిపిస్తోంది. ఆ పార్టీలో దాదాపుగా అయిదున్నర దశాబ్దాల పాటు ఉన్న వారికి భవిష్యత్తు ఏమిటి అన్న చర్చ రావడం సాధారణం. అందుకే వారంతా అజిత్ కుమార్ రావాలని గట్టిగా కోరుకుంటున్నారు.

అజిత్ తోనే ఆశలు :

ఇపుడున్న పరిస్థితులలో అన్నా డీఎంకేకి అజిత్ కుమార్ ఒక బలమైన ఆశా కిరణంగా కనిపిస్తునారు అని అంటున్నారు. ఆయన వచ్చి పార్టీ పగ్గాలు అందుకుంటే కచ్చితంగా అన్నా డీఎంకే నిలిచి గెలుస్తుంది అని అంటున్నారు. అపుడు డీఎంకే మూడవ ప్లేస్ లోకి పడిపోయి అన్నా డీఎంకే వర్సెస్ టీవీకే అన్నట్లుగా తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అజిత్ కి ఉన్న సూపర్ మాస్ ఫాలోయింగ్ తో విజయ్ ని కట్టడి చేయడమే కాదు 2031 లో కచ్చితంగా అధికారంలోకి రాగలమన్న విశ్వాసాన్ని కూడా అన్నా డీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అజిత్ కి తమిళనాడు వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉందని గుర్తు చేస్తున్నారు.

అజిత్ ఆలోచనలేంటో :

అయితే అజిత్ కుమార్ దీనికి ఒప్పుకుంటారా అసలు ఆయనకు రాజకీయ ఆలోచనలు ఉన్నాయా అన్నదే అసలైన చర్చగా ఉంది. నిజానికి అజిత్ కుమార్ సినిమాలు లేకపోతే కార్ రేసింగ్, బైక్ రైడింగ్, గన్ షూటింగ్ వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. రాజకీయాలు అన్నవి ఆయన దగ్గరకు కూడా రావు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలిచి మరీ ఓటు వేశారు అంటేనే ఆయన సాధారణ జీవితం అర్ధమవుతుంది. ఇక అభిమానులు అంతా ఆయనను రాజకీయాల్లోకి రావాలని కోరినపుడుకూడా ఆయన నో చెప్పడమే కాదు తన అధికారిక ఫ్యాన్ క్లబ్స్ రద్దు చేసేసి షాక్ ఇచ్చారు. సినిమాలు అంటే కేవలం వినోదం మాత్రమే అని అజిత్ చెబుతారు. తనను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుతారు. అయితే తమిళనాడులో ఇపుడు రాజకీయం మారింది. అజిత్ సినీ ప్రత్యర్ధి విజయ్ సీఎం గా ఉన్నారు. దాంతో పాటుగా బీజేపీ లేదా అన్నా డీఎంకే వంటి పార్టీలు ఇపుడు గట్టిగా ఒత్తిడి తెస్తే అజిత్ రాజకీయ రంగ ప్రవేశం చేసే చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. అజిత్ కుమార్ కనుక పొలిటికల్ ఎంట్రీ ఇస్తే టీవీకేకి అది రాజకీయంగా భారీ షాక్ లాంటిదే అని అంటున్నారు. ఇద్దరికీ విశేషంగా అభిమాన గణం ఉంది. ఇది సమ వయస్కులే. ఇద్దరూ దూకుడుగానే ఉంటారు. దాంతో తమిళనాడులో కొత్త తరం రాజకీయాన్ని చూడొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News