చింత పిక్క అని చులకనగా చూడొద్దు.. లెక్క తెలిస్తే అవాక్కే

కాలంతో పాటు చింత గింజల డిమాండ్ పెరగటమే కాదు.. ధర కూడా అంతకంతకూ పెరుగుతోంది.;

Update: 2025-06-09 09:30 GMT

కొన్ని విషయాల్ని పెద్దగా పట్టించుకోం. ఆ మాటకు వస్తే పెద్దగా విలువ కూడా ఇవ్వం. కానీ.. అలాంటి వాటికి సంబంధించిన అంశాల్ని తరచి చూస్తే అవాక్కు అయ్యే సమాచారం బయటకు వస్తుంది. చింతపండులో చింత పిక్కను ఎంత చులకగా చూస్తామో తెలిసిందే. చింతపండులో చింత పిక్క వస్తే.. చిరాకు పడిపోతాం. చింతపండు క్వాలిటీ లేదని విసుక్కుంటాం. కానీ.. అదే చింతపిక్కతో కోట్లాది రూపాయిల వ్యాపారం జరుగుతుందన్న విషయం చాలా మందికి తెలీదు.

చులకనగా చూసే చింతపిక్క పొడితో కీళ్ల నొప్పులు.. మోకాళ్ల నొప్పులకు మంచి ఔషధమన్న విషయం చాలామందికి తెలీదు.మన దేశంలోనే కాదు.. పొరుగు దేశాల్లోని ఫార్మా కంపెనీలు.. రంగుల కంపెనీలు.. పట్టువస్త్రాల్ని తయారు చేసే వారికి చింతపిక్క పొడి చాలా అవసరం. దాని కోసం ఉండే డిమాండ్ మామూలుగా ఉండదు. పెద్దగా ఫోకస్ పెట్టని వ్యాపారాల్లో చింత పిక్కల యాపారం ఒకటి. సౌత్ ఇండియాలో చింతపిక్కకు ఏడాది పొడుగున డిమాండ్ ఉంటుందన్న విషయం చాలామందికి తెలీదు.

కాలంతో పాటు చింత గింజల డిమాండ్ పెరగటమే కాదు.. ధర కూడా అంతకంతకూ పెరుగుతోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ వ్యాపారం ఎక్కువగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురంలో సాగుతుంది. గతంలో కేజీ చింతపిక్కలు రూ.30- 35 మధ్య ఉంటే.. ఇప్పుడు అవి కాస్తా రూ.40 - రూ.44 మధ్య పలుకుతున్నాయి. తమిళనాడు.. కేరళ.. కర్ణాటక.. ఏపీ నుంచి ఈ చింత గింజల్నిదిగుమతి చేసుకొని పుంగనూరులో పొట్టు తీస్తారు.

చింతపిక్క మీద ఉన్న పొట్టు తీసే మిషన్లు అధికంగా ఉండేది పుంగనూరులోనే. ఈ గింజల్ని హిందూపురం.. మధురై.. గుజరాత్.. సూరత్.. అహ్మదాబాద్.. వాపి. చెన్నై.. బెంగళూరులో పొడి చేస్తారు. ఒక్క పుంగనూరులోనే 12 మిషన్లతో రోజుకు 200 టన్నులు (ఒక టన్ను వెయ్యి కేజీలు) చింత గింజలు పొట్టు తీసి ఎగుమతి చేస్తారు. ఎన్నో పరిశ్రమలకు చింత గింజల పొడిని ఉపయోగిస్తారు.

చింత గింజల పొడిని వినియోగించే పరిశ్రమలు

- ఫార్మా

- రంగుల తయారీ

- పట్టు వస్త్రాలకు గంజి పెట్టేందుకు

- దోమల చక్రాలు (మస్కట్ కాయిల్స్)

- పేపర్

- ఫ్లైవుడ్

- ప్లాస్టిక్

- జూట్ పరిశ్రమలోనూ చింత గింజల పొడిని వినియోగిస్తారు.

Tags:    

Similar News