తలసాని హ్యాట్రిక్ పై చర్చ... తెరపైకి కీలక విషయాలు!

అవును... హైదరాబాద్ లోని కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ వరుసగా రెండుసార్లు గెలుపొందారు.

Update: 2023-12-02 04:44 GMT

అత్యంత హోరా హోరీగా సాగిన తెలంగాణ శాసన సభ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ లో కనిపిస్తుండగా.. బీఆరెస్స్ శ్రేణుల్లో ఆందోళనలు నెలకొన్నాయని తెలుస్తుంది. అయినప్పటికీ గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిటీలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన సనత్ నగర్ లో గెలుపు ఎవరిది అనేది ఆసక్తిగా మారింది.

అవును... హైదరాబాద్ లోని కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో టీడీపీ నుంచి పోటీచేసిన ఆయన.. అనంతరం కారెక్కారు. ఇక 2018 ఎన్నికల్లో నేరుగా కారు గుర్తుపైనే పోటీ చేసిన తలసాని 30,651 మెజారిటీతో గెలుపొందారు. దీంతో... ఈసారి తలసాని హ్యాట్రిక్ కొడతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

ఈదఫా ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి సుమారు 16మంది అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు. ఇందులో ప్రధానంగా బీఆరెస్స్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ నుంచి కోట నీలిమ, బీజేపీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, బీఎస్పీ నుంచి గున్నెబోయ్యిన అఖిలేష్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీకి దిగారు.

ఈ నేపథ్యంలో... సనత్‌ నగర్ నియోజకవర్గంలోని ఓటర్లు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనే విషయంపై ఇటు హైదరబాద్ తో పాటు అటు రాష్ట్రవ్యాప్తంగా కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పినా అతిశయోక్తి కాదేమో! ఈ క్రమంలో... అభివృద్ధి మంత్రాన్నే నమ్ముకుని సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆరెస్ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బరిలోకి దిగుతుండగా... మార్పు కోరుతూ కాంగ్రెస్ నుంచి కోట నీలిమ బరిలో నిలిచారు.

Read more!

ఇదే క్రమంలో డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యం అంటూ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి బరిలో నిలిచారు. అయితే ఈ నియోజకవర్గం విషయానికొస్తే... పోలింగ్ సరళిని బట్టి బీఆరెస్స్ - బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నియోజవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమకు మైనార్టీలు, సెటిలర్స్ అనుకూలంగా ఓట్లు పడ్డాయని.. బీజేపీకి గుజరాతి, మార్వాడి, రాజస్థాన్‌ ల నుంచి వచ్చినవారి ఓట్లు పడ్డాయని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో... నియోజకవర్గంలో కాలనీలు, మురికివాడల ప్రజలు మంత్రి తలసానికి ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఐటీ సెక్టార్ కూడా ఇక్కడ బీఆరెస్స్ కు అనుకూలంగా పనిచేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం... ఓటింగ్ సరళిని బట్టి చూస్తే స్వల్ప మెజారీతో అయినా తలసాని బయటపడే అవకాశాలున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News