ఢిల్లీ రాష్ట్రమంత దేశం.. స్టాక్ మార్కెట్ లో భారత్ ను దాటేసింది
మన దేశంలో ఢిల్లీ.. హర్యానా.. పంజాబ్ రాష్ట్రాల్లో ఉండే జనాభాకు దాదాపు దగ్గరగా ఉండే తైవాన్ తాజాగా అనూహ్య రికార్డును సొంతం చేసుకుంది.
మన దేశంలో ఢిల్లీ.. హర్యానా.. పంజాబ్ రాష్ట్రాల్లో ఉండే జనాభాకు దాదాపు దగ్గరగా ఉండే తైవాన్ తాజాగా అనూహ్య రికార్డును సొంతం చేసుకుంది. ఒక చిట్టి దేశం.. తనకే సొంతమైన చిట్టి చిప్ తో గడిచిన కొంతకాలంగా అదరగొట్టటమే కాదు.. ఆర్థికంగా దూసుకెళుతోంది. తాజాగా భారత స్టాక్ మార్కెట్ ను వెనక్కి నెట్టి.. తాను ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంతకూ ఆ దేశం మరేదో కాదు.. చిట్టి తైవాన్. తిప్పి తిప్పి కొడితే రెండున్నర కోట్ల మంది కూడా ఉండని జనాభా ఉన్న దేశం.. ఈ రోజున ప్రపంచంలో అత్యంత విలువైన స్టాక్ మార్కెట్ అన్న ట్యాగ్ ను సొంతం చేసుకోవటమే కాదు.. అందులో తన స్థానాన్ని ఐదుగా ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు ఆ ఐదో స్థానంలో ఉన్న భారత్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఆరో స్థానానికి దిగిపోయింది.
బుధవారం తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెయిటెడ్ ఇండెక్స్ 1.68 శాతానికి పెరగటంతో ఈ మేజిక్ సాధ్యమైంది. దీంతో స్టాక్ మార్కెట్ లోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరువైంది. అదే సమయంలో మన దేశ స్టాక్ మార్కెట్ లో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.92 లక్షల కోట్ల డాలర్లకే పరిమితం కావటంతో.. భారత్ ఆరో స్థానానికి జారిపోతే.. తైవాన్ ఐదో స్థానానికి ఎగబాకింది. ఇక్కడో ఆసక్తికరమై.. ఆశ్చర్యకరమైన అంశాన్ని ప్రస్తావించాలి. భారత స్ఠాక్ మార్కెట్ లోని రెండు స్టాక్ ఎక్స్ఛేంజ్ లు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
అందులో ఒకటి బీఎస్ఈ అయితే రెండోది ఎన్ ఎస్ఈ. ఈ రెండింటిలోనూ పలు కెంపెనీలు లిస్ట్ అయి ఉంటాయన్న సంగతి తెలిసిందే. బీఎస్ఈలో 5936 కెంపెనీలు లిస్టు అయితే.. ఎన్ఎస్ఈలో 2867 కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. మొత్తంగా ఆరేడువేల కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయని భావిస్తే.. తైవాన్ ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారిక సమాచారం ప్రకారం కేవలం 1066 కంపెనీలు మాత్రమే లిస్ట్ అయ్యాయి. అందులో 978 తైవాన్ కంపెనీలు అయితే..88 విదేశీ కంపెనీలు. అంటే.. తైవాన్ కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ కంపెనీలు స్టాక్ మార్కెట్ లో లిస్టు అయిన కంపెనీలు భారత్ లో ఉన్నప్పటికీ.. ఈ రోజు స్టాక్ మార్కెట్ విలువ అంత భారీగా ఉండటానికి కారణం.. ప్రపంచ చిప్ రంగాన్ని శాసిస్తున్న టీఎస్ఎంసీ (తైవాన్ సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ).
ఈ కంపెనీ అలాంటిది ఇలాంటిది కాదు. ప్రపంచంలోనే తోపు కంపెనీలుగా చెప్పే ఎన్ విడియా, యాపిల్, ఏఎండీ.. క్వాల్ కామ్ సహా పలు అమెరికన్.. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలకు అవసరమైన అత్యాధునిక ఏఐ చిప్ లను తయారు చేసి పెడుతోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లు 130 శాతానికి పైనే పుంజుకోగా.. ఆదేశ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ ఈ ఏడాదిలో 52 శాతం పెరిగింది. దీంతో తైవాన్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది. అదే సమయంలో భారత స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే పశ్చిమాసియా సంక్షోభం.. విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెద్ద ఎత్తున ఉప సంహరణ లాంటి ఒత్తిళ్లతో స్టాక్ మార్కెట్ మీదా.. దాని క్యాపిటలైజేషన్ మీదా ప్రభావాన్ని చూపుతూ.. తిరోగమన బాటలో పయనిస్తున్న దుస్థితి.
ఈ ఏడాది సెన్సెక్స్.. నిఫ్టీ 8 శాతానికి పైనే నష్టపోయాయి. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఈ కంపెనీలో ఏ ఒక్క వ్యక్తికి లేదంటే ప్రైవేటు సంస్థకూ పూర్తి యాజమాన్య హక్కులు లేవు. ఇందులో మెజార్టీ వాటా కూడా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలదే కావటం విశేషం. ఈ కంపెనీలు అత్యధికంగా తైవాన్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెవలప్ మెంట్ ఫండ్ కు 6.38 శాతం వాటా ఉంది. ఇదే ఈ సంస్థలో అత్యధిక వాటా ఉన్న వాటాదారు. ఈ లెక్కన చూస్తే.. దీని తర్వాత బ్లాక్ రాక్ 5.1 శాతం.. వాన్ గార్డ్ 3.9 శాతం.. సింగపూర్ ప్రభుత్వ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ కు 3.2 శాతం వాటాలు ఉన్నాయి. మొత్తంగా ఒక కంపెనీ తైవాన్ ఆర్థిక పరిస్థితిని మాత్రమే కాదు.. ఒక విధంగా ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పక తప్పదు.