3 కి.మీ. ఎత్తులో విమానం.. కిందపడిన యువతి సేఫ్.. ఇది తెలుసా?

అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో 242 మందిలోనూ ఒకే ఒక్క వ్యక్తి గాయాలతో బ్రతికి బయటపడిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-16 02:45 GMT

అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో 242 మందిలోనూ ఒకే ఒక్క వ్యక్తి గాయాలతో బ్రతికి బయటపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఏ11 సీటులో ఉన్న తాను ఎగిరి బయటపడి బ్రతికినట్లు అతడు తెలిపాడు. దీంతో.. సుమారు 27 ఏళ్ల క్రితం థాయ్ ఎయిర్ వేస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూలిపోయిన ఘటన తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా.. ఈ ఘటనలో అందులో ఉన్న 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారని.. 45 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని.. వారిలో 11ఏ సీటులో కూర్చున్న తాను మాత్రం ఎలాంటి తీవ్ర గాయాలు లేకుండా తప్పించుకున్నట్లు 48 ఏళ్ల థాయి నటుడు రువాంగ్ సక్ లాయ్ చూజాక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందినా.. సుమారు మూడు కిలోమీటర్ల ఎత్తు నుంచి కింద పడి బ్రతికిన మహిళ కథ తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆమె పేరు జూలియన్ కోప్కే కాగా.. ఆ ఘటన ఆమె 17ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1971 డిసెంబర్ 24న వారు ప్రయాణిస్తున్న విమానం అమెజాన్ ఫారెస్ట్ పైనుంచి వెళ్తున్నప్పుడు జరిగింది.

అవును... జూలియన్ కోప్కే తన తల్లి మరియా కోప్కేతో కలిసి విమానంలో ప్రయాణిస్తోంది. ఆ విమానం పెరులోని లిమా నుంచి పుకల్పాకు వెళ్తోంది. జూలియన్ తండ్రి హోన్స్ విల్ హెల్మ్ హోప్కే.. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని పంగువానా రీసెర్చ్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. ఆయన్ను కలవడానికి వారిద్దరూ విమానంలో వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ తుఫాన్ వచ్చింది.

మరో గంటలోపు గమ్యస్థానానికి చేరుకుంటారనగా భయంకరమైన తుఫానులో వీరు ప్రయాణిస్తున్న విమానం చిక్కుకుంది. ఈ సమయంలో బలమైన మెరుపు వీరు ప్రయాణిస్తున్న విమానం రెక్కను తాకింది. దీంతో.. విమానం గాల్లోనే ముక్కలై.. అమెజాన్ అడవిలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 92 మంది ఉండగా.. వారిలో జూలియన్ ఒక్కరే బ్రతికారు.

దానికి కారణం ఆమె తల్లి. విమానంలో ఆమె తల్లి జూలియన్ కు సీటు బెల్ట్ తగిలించింది. ప్రమాదం జరిగినప్పుడు జూలియన్ సీటుకి అత్తుకుపోయి, సుమారు 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి అమెజాన్ అడవిలో పడిపోయింది. ఆ అడవిలో దట్టమైన కొమ్మలు, ఆకులు ఆమె వేగాన్ని నియంత్రించి.. మెళ్లగా కింద పడేలా చేశాయి. దీంతో.. ఆమె సజీవంగా బయటపడింది.

ఆ పరిస్థితుల్లో ఆమె తన తల్లిని వెతకడం ప్రారంభించింది. తల్లి కనిపించకపోయినా.. ఆమెను వెతుక్కుంటూ, ఆ దట్టమైన భయంకరమైన అడవిలో అలాగే తిరగసాగింది. ఈ క్రమంలో సుమారు 11 రోజుల పాటు ధైర్యంగా, ఒంటరిగా, సాహసోపేతంగా బతుకుతూ నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఓ నీటి ప్రవాహం ఆమెకు కనిపించింది.

దీంతో.. ఆ నీటి ప్రవాహం పక్కనే నడవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఓ చిన్న గుడిసె దగ్గరకు చేరింది. అప్పుడు స్థానిక రైతులు ఆమెను చూసి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో.. ఆయన వెంటనే ఆస్పత్రికి వచ్చి కుతుర్ని కలుసుకున్నారు. ఇక్కడ మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఆమె పూర్తిగా కోలుకోకుండానే విమాన శిథిలాలను కనుక్కునే విషయంలో సహాయం చేసింది.

Tags:    

Similar News