నివాళి: సుస్వర గళం.. 'సురవరం': నేటి తరం నేర్చుకోవాల్సిందే!
తదుపరి సంవత్సరం.. 1972లో ఏఐవైఎఫ్(అఖిల భారత యువజన సంఘం) జాతీయ అధ్యక్షుడిని చేశారు.;
1971, కేరళలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది ఉద్ధండులు హాజరయ్యారు. వారి మధ్య ఓ యువకుడు చాలా చురుగ్గా.. తిరుగుతూ.. చేతిలో పెన్ను.. పేపరు పట్టుకుని కీలక నాయకుల ప్రసంగాలను రాసుకుంటున్నారు. అప్పట్లో.. ఇప్పటి మాదిరిగా రికార్డు చేసే అవకాశం లేదు. అనంతరం.. ఈ యువకుడికి కూడా.. విద్యార్థి సంఘం విభాగం కింద.. మాట్లాడే అవకాశం వచ్చింది. మైకు అందుకున్నాడు..
``నేతలు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం.. వారి హక్కులు శాశ్వతం. పేదల హక్కుల కోసం పోరాడే స్ఫూర్తి మరింత శాశ్వతం. ఈ స్ఫూర్తి రగులుతున్నన్నాళ్లూ.. దేశంలో కమ్యూనిజానికి నష్టం.. బూర్జువాలకు లాభం అనేదే ఉండదు. ఈ దీప శిఖ.. నిర్జనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యువతగా మాపై ఎంతో ఉంది. దీనికి కంకణబద్ధులమై.. వ్యవహరిస్తామని నిబద్ధతతో ప్రతిజ్ఞ చేసేందుకు యువత తరలి రావాలి.`` అని ఎలుగెత్తాడు ఆ యువకుడు. మరుక్షణం ఆయనను పెద్ద నేతలు అక్కున చేర్చుకున్నారు.
తదుపరి సంవత్సరం.. 1972లో ఏఐవైఎఫ్(అఖిల భారత యువజన సంఘం) జాతీయ అధ్యక్షుడిని చేశారు. ఆయనే.. రాజకీయాల్లో మచ్చలేని నేత.. ప్రజలకు చేరువైన కమ్యూనిస్టు.. సుస్వర గళం వినిపించిన సురవరం సుధాకర్‌రెడ్డి. భౌతికంగా ఆయన కమ్యూనిస్టులను వదిలి వెళ్లొచ్చు. కానీ, వ్యక్తిత్వ పరంగా.. రాజకీయంగా కూడా ఆయన వేసిన అడుగులు అసామాన్యం. రాజకీయ దుగ్ధ, పదవీ లాలస అనే మాటలకు తన డిక్షనరీలోనే చోటు పెట్టని నాయకుడు కూడా సురవరమే.
``ఇదో..రెడ్డన్నా.. రేపు నువ్వు పార్టీలో చేరు. నా మాటిను. నీకు కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తా`` అంటూ.. కాం గ్రెస్‌కు చెందిన ఓ మాజీ దివంగత ముఖ్యమంత్రి ఆఫర్ చేసినప్పుడు.. ``మీరు పేదల పక్షపాతి అంటు న్నారు కదా.. ఆరోగ్య శ్రీవంటి పథకాలను కూడా ప్రవేశ పెట్టారు కదా. నామాటినండి.. మీరే మాలోకి వచ్చే స్తే.. జాతీయస్థాయిలో మీ సేవలను ప్రజలకు చేరువ చేద్దాం. పేదల కోసం పాటు పడదాం.`` అని తన భావాన్ని.. సందర్భాన్ని ఎక్కడా చెడకుండా.. దీటైన సమాధానం చెప్పి.. నిఖార్సయిన ఉద్యమ నేతకు పర్యాయపదంగా నిలిచారు సురవరం.
సంపాయించుకునే నాయకులు ఉన్నారు. కానీ, తన తండ్రి వెంకట్రామిరెడ్డి నుంచి వచ్చిన కొంత పొలా న్ని కూడా భూపరిమితి చట్టం వస్తున్న క్రమంలో పేదలకుపంచేసిన సురవరం.. ఆసాంతం.. అల్ప సంతోషిగానే జీవించారు. ఇక, ఆయన ప్రసంగాలకు వచ్చేసరికి.. ఇవి రికార్డు సృష్టించాయి. బీబీసీ వారు ఓ ఇంటర్వ్యూలో సురవరం గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ప్రసంగాలను ప్రత్యేకంగా కొనియాడారు. ఎక్కడా విమర్శలు ఉండవు. ప్రత్యర్థి పార్టీలపై బూతులతో విరుచుకుపడే లక్షణమూ లేదు.
``ఆయన నోటి నుంచి ఏది వచ్చినా.. అక్షర తుల్యం. తదుపరి తరానికి ఒక దిక్సూచి. దటీజ్ సురవరం.`` అని ముక్తాయించే బీబీసీ కథనం నేటికీ ఎంతో మందికి ఆదర్శమనే చెప్పాలి. అయితే.. ఆయన నడిచిన బాట.. కలిసి పనిచేసిన చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మోటూరు హనుమంతరావు, మాకినేని బసవ పున్నయ్య వంటి కీలక నేతల ప్రభావం ఆయనపై స్పష్టంగా కనిపిస్తుంది.