ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకరరావు అరెస్టు?

అయితే రిటైర్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకరరావు బెయిలు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.;

Update: 2025-12-11 13:57 GMT

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకరరావు బెయిలు రక్షణను సుప్రీం సస్పెండ్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 11 గంటల లోగా దర్యాప్తు అధికారి ఎదుట ప్రభాకరరావు లొంగిపోవాలని తేల్చిచెప్పింది. ప్రభాకర్ రావు కస్టోడియల్ దర్యాప్తునకు సిట్ కు అనుమతినిచ్చిన ధర్మాసనం.. ఆయనకు భౌతికంగా ఎటువంటి ఇబ్బంది తలపెట్టొద్దని పోలీసులకు సూచించింది. ఈ మేరకు సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహాదేవన్ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావు ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనపై అభియోగాలు మోపుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే తన పరిస్థితిని ఊహించిన ప్రభాకరరావు అమెరికా వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన తర్వాత ముందస్తు బెయిలు ఇస్తేనే తిరిగి రాష్ట్రానికి వస్తానని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు గతంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించింది.

అయితే రిటైర్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకరరావు బెయిలు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ఈ పిటిషన్ పలుమార్లు విచారణకు రాగా, ప్రభాకర్ రావు తరఫు న్యాయవాదులు వాయిదాలు వేయిస్తూ వచ్చారు. ఇక అంతిమంగా గురువారం విచారణ జరగడంతో ప్రభాకర్ రావును జుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. గురువారం దర్యాప్తు అధికారి ఎదుట ఆయన లొంగిపోవాలని ఆదేశించిన న్యాయస్థానం, పోలీసులకు పలు షరతులు విధించింది.

కస్టడీ సమయంలో ప్రభాకరరావుకు ఇంటి భోజనం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో 14 రోజుల పాటు సిట్ కస్టడీలో ప్రభాకరరావుకు విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను ప్రభాకర్రావు ధ్వంసం చేశారని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. డిజిటల్ ఎక్విప్మెంట్, పాస్ వర్డ్ ఇవ్వకుండా విసిగించడంతోపాటు విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఐక్లౌడ్ పాస్ వర్డులను రీసెట్చేసి అందులో వివరాలను దర్యాప్తు అధికారులకు చూపించాలని గతంలో కోర్టు చెప్పినప్పటికీ ప్రభాకరరావు సహకరించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

Tags:    

Similar News