సొంత వైద్యం చేస్తున్నారా? డేంజర్ పొంచి ఉంది బాస్
ఇంతకూ సూపర్ బగ్స్ అంటే ఏమిటి? దానితో ఎంత అపాయం అన్న విషయంలోకి వెళితే..;
జలుబు కావొచ్చు. జ్వరం కావొచ్చు. ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ వద్దకు వెళ్లకుండా సొంత వైద్యం చేసే వాళ్లు మనలో చాలామందే ఉంటారు. మిగిలిన మెడిసిన్స్ వినియోగాన్ని పక్కన పెడితే.. యాంటీ బయాటిక్స్ వాడే విషయంలోనూ సొంత తెలివిని వాడి.. కష్టాల్ని కొని తెచ్చుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇది డేంజర్ పరిస్థితులకు కారణమవుతోంది. మందుల్ని వాడినా ఒక పట్టాన జబ్బులు తగ్గని పరిస్థితికి తీసుకెళ్లేలా చేసుకుంటున్న వైనాలు పెరుగుతున్నాయి. దీంతో మెడిసిన్స్ కు లొంగని సూపర్ బగ్స్ సంఖ్య పెరుగుతోంది.
ఇంతకూ సూపర్ బగ్స్ అంటే ఏమిటి? దానితో ఎంత అపాయం అన్న విషయంలోకి వెళితే.. సాధారణంగా మనకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తే వైద్యులు యాంటీ బయాటిక్ మందులు రాస్తారు. కోర్సు ప్రకారం మందులు వాడితే.. జ్వరం తగ్గుతుంది. కొంతమంది మాత్రం వైద్యులు చెప్పినట్లు కాకుండా పూర్తి కోర్సు వాడకుండా.. తమకు జ్వరం తగ్గగానే యాంటీబయాటిక్ మందుల్ని వాడటం మానేస్తారు.
ఉదాహరణకు ఒకరికి వారం రోజుల పాటు మందులు వాడాలని చెబితే.. నాలుగు రోజులకే తగ్గిపోయిన కారణంగా మందులు వేసుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా సొంత తెలివితో నిర్ణయాలు తీసుకుంటారు. అలా సగంలో మందుల్ని ఆపేయటం వల్ల శరీరంలో బ్యాక్టీరియా పూర్తిగా చావదు సరికదా.. మనం అరకొరగా వేసుకున్న యాంటీ బయాటిక్ ఔషధాలను నిరోధించే శక్తిని సొంతం చేసుకుంటుంది. అదే సమయంలో కొందరు అవసరం ఉన్నా.. లేకున్నాచీటికి మాటికి మందులు వేసుకోవటం చూస్తుంటాం. ఇలాంటి వారిలోనూ మందులు పని చేయని పరిస్థితికి వెళుతుంటారు. ఈ దశనే సూపర్ బగ్ గా చెబుతారు.
సూపర్ బగ్ గా మారిన బ్యాక్టీరియా వేరే వారికి సోకితే వారికి నాలుగైదు రకాల యాంటీబయాటిక్స్ ఔషధాలు ఇచ్చినా పని చేయవు. వేరే యాంటీ బయాటిక్స్ ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. యాంటీ వైరల్..యాంటీ ఫంగల్ ఔషధాలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. మనుషులకే కాదు వ్యవసాయం.. పశువులకు సంబంధించి కూడా యాంటీబయాటిక్స వినియోగం ఎక్కువగాఉంటే.. సూపర్ బగ్స్ పెరుగుదలకు కారణమవుతుంది. అందుకే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు సొంత తెలివితో మందులు వాడే కన్నా.. వైద్యుల సలహాను తీసుకోవటం.. తూచా తప్పకుండా పాటించటం చాలా అవసరమన్న విషయాన్ని అస్సలు మరవొద్దు. ఈ విషయంలో మరింత జాగ్రత్త అవసరం.