హర్మూజ్ జలసంధి వద్ద ఉన్న నౌకలెన్ని? ఏ దేశానివి ఎన్ని?
సమకాలీన ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు కొత్తేం కాదు. కానీ.. అవేమీ ఇవ్వని ఒక ఇబ్బందికర పరిస్థితిని ఇరాన్ - ఇజ్రాయెల్.. అమెరికా మధ్య జరిగిన యుద్ధంతో ప్రపంచ దేశాలకు ఎదురైంది.;
సమకాలీన ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు కొత్తేం కాదు. కానీ.. అవేమీ ఇవ్వని ఒక ఇబ్బందికర పరిస్థితిని ఇరాన్ - ఇజ్రాయెల్.. అమెరికా మధ్య జరిగిన యుద్ధంతో ప్రపంచ దేశాలకు ఎదురైంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన వాణిజ్య నౌకల పుణ్యమా అని పలు దేశాల ఆర్థిక స్థితిగతులు కిందా మీదా పడిన పరిస్థితి. వీరి మధ్య యుద్ధం కొత్త ప్రళయానికి దారి తీస్తుందన్న భయాందోళన వేళ.. అనూహ్య రీతిలో కాల్పుల విరమణకు అమెరికా.. ఇరాన్ లు సమ్మతించటంతో ఏదో అవుతుంది ఈ రోజు ప్రపంచానికి అనుకొని భయపడిన వారంతా.. ఒక్కసారిగా రిలాక్స్ అయిన పరిస్థితి.
దీంతో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం తాలుకు టెన్షన్ కాస్తంత తగ్గిన మొదటిరోజు ఇవాళే అన్నది చెప్పాలి. ఇందుకు తగ్గట్లే.. పలు దేశాల సెన్సెక్స్ లు మొదలు.. మన దేశ రూపాయి సైతం బలపడటం చూస్తే.. సంబంధం లేని దేశాల మధ్య జరిగే యుద్ధం మన బతుకుల్ని ఇంతలా ప్రభావితం చేస్తుందా? అన్న విషయం అందరికి అర్థమయ్యేలా చేసింది. ఇదంతా బాగానే ఉంది కానీ.. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద నిలిచి ఉన్న నౌకలు ఎన్ని? ఏ దేశానికి చెందిన నౌకలు ఎన్ని ఉన్నాయి? హర్మూజ్ జలసంధి వెలుపల ఉన్న నౌకలెన్ని? ఈ రోజు ఉదయం (బుధవారం) నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఎన్ని వాణిజ్య నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
వివిధ విభాగాల నుంచి అందుతున్న సమాచారాన్ని క్రోడీకరిస్తే.. బోలెడన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. అన్నింటికంటే ముందు చెప్పాల్సిన అంశం.. ఈ రోజు ఉదయానికి హర్మూజ్ జలసంధి వద్ద నిలిచి ఉన్న వాణిజ్య నౌకలు 800. ఇక.. జలసంధి వెలువల ఉన్న నౌకలు 1200 ప్లస్ గా చెప్పాలి. అంటే మొత్తంగా 2వేలకు పైనే నౌకలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జలసంధిలో కొన్ని వారాలుగా చిక్కుకుపోయిన 800 నౌకల్ని తొలుత బయటకు పంపే వీలుంది.
వీటిల్లో ముడి చమురు.. గ్యాస్ తో పాటు.. రసాయనాలు.. ఆహార పదార్థాలు ఇలా చాలానే ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈ రోజు బయటకు వచ్చిన నౌకలు ఎన్ని అంటే.. ఈ అంకె కాస్తంత నిరాశకు గురి చేస్తుంది. కారణం.. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికి.. అందరిలో ఒకలాంటి ఆత్మవిశ్వాసం ఇంకా పూర్తిగా రాలేదు. కొత్తగా జరిగిన డీల్ కు సంబంధించి వివరాలు అందినా.. బీమా సంస్థల నుంచి రావాల్సిన క్లియరెన్సు ఇతర సాంకేతిక అంశాల నేపథ్యంలో కాస్త నెమ్మదిగానే కదులుతున్న పరిస్థితి. ఈ ఉదయం నుంచి సాయంత్రం మధ్య కాలంలో పది నుంచి పన్నెండు వాణిజ్య నౌకలు మాత్రం బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
సాధారణ పరిస్థితుల్లో అయితే రోజుకు ఈ జలసంధి నుంచి సుమారు 135 వరకు నౌకలు ప్రయాణిస్తుంటాయి. కొన్ని వారాలుగా చోటు చేసుకున్న యుద్ద ఉద్రిక్తతల కారణంగా భారీ సంఖ్యలో నౌకలు పేరుకుపోయాయి. వీటిని క్లియర్ చేయటం.. కొత్తగా నిర్దేశించిన టోల్ మొత్తాల్ని వసూలు చేసి.. క్లియరెన్స్ ఇవ్వటం లాంటి ప్రక్రియలు కాస్త నెమ్మదిగా జరిగే పరిస్థితి. జలసంధి లోపల నిలిచిపోయిన 800 నౌకల్లో సుమారు ముడి చమురు నౌకలు 350-400 మధ్యలో ఉంటాయి. గ్యాస్ నౌకలు 80-100 వరకు ఉంటాయి. ముఖ్యంగా ఖతార్ నుంచి వెళ్లాల్సిన ఎల్ ఎన్ జీ నౌకలు ఇందులో ఎక్కువ.
ఇతర నౌకలుసుమారు 300-350 వరకు ఉన్నట్లు చెబుతున్నారు. దేశాల వారీగా చూస్తే.. భారత్ విషయానికి వస్తే సుమారు 16-19 నౌకలు ఉన్నాయి. ఇందులో ఎల్పీజీ నౌకలు ఎనిమిది వరకు ఉన్నాయి. కొన్ని ముడి చమురు.. కంటైనర్ నౌకలు ఉన్నాయి. ఇప్పటికే ఎనిమిది నౌకలు సురక్షితంగా బయటకు వచ్చినట్లుగాచెబుతున్నారు, చైనాకు చెందిన సుమారు 100 కంటే ఎక్కువ చమురు ట్యాంకర్లు ఇక్కడ ఉన్నాయి. జపాన్ .. దక్షిణ కొరియాకు చెందిన సుమారు 60-80 నౌకలు ఉన్నాయి.
ఐరోపా దేశాలకు చెందిన 30-40 నౌకలు ఉన్నట్లుగా చెబుతున్నారు. హర్మూజ్ జల సంధి వద్ద ఉన్న 800 వాణిజ్య నౌకల్ని క్లియర్ అయ్యేందుకు సుమారుమూడు నుంచి ఐదు రోజుల వరకు సమయం పడుతుందని చెబుతున్నారు. కాల్పుల విరమణ ప్రకటన విడుదలైన మొదటి ఆరు గంటల్లో నౌకల కదలికలు దాదాపుగా లేదనే చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికి.. పరిస్థితుల్లో మార్పుల రావటానికి కనీసం రెండు నుంచి నాలుగు వారాల సమయం పడుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.