ప్రతీకార సుంకాలపై వెనకడుగు.. మార్కెట్ జోరు ఎంతంటే?

ఎవరెంత చెప్పినా వినరు సరి కదా.. మార్కెట్లకు రక్తకన్నీరు కార్చేలా చేస్తారు. అదే.. ఫీల్ గుడ్ అన్న భావన కలిగితే చాలు.. వారి దూకుడుకు అడ్డు ఉండదు.;

Update: 2025-04-16 05:14 GMT

సెంటిమెంట్ మహా సిత్రంగా ఉంటుంది. మిగిలిన సెంటిమెంట్ల లెక్క ఎలా ఉన్నా.. మార్కెట్ సెంటిమెంట్ విషయం మాత్రం మార్పులు వేగంగా ఉంటాయి. ఏదో జరుగుతుందన్న సందేహం వస్తే చాలు.. మార్కెట్ సూచీలు కుప్పకూలుతాయి. ఎవరెంత చెప్పినా వినరు సరి కదా.. మార్కెట్లకు రక్తకన్నీరు కార్చేలా చేస్తారు. అదే.. ఫీల్ గుడ్ అన్న భావన కలిగితే చాలు.. వారి దూకుడుకు అడ్డు ఉండదు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఇలానే ఉంది. గత వారం బ్లడ్ బాత్ లో మునిగిన మార్కెట్ ఇప్పుడు లాభాల బాట పట్టటమే కాదు.. బుల్ జోష్ ఎంత ఎక్కువగా ఉందో వేగంగా దూసుకెళుతున్న సెన్సెక్స్ సూచీలను చూస్తేనే అర్థమవుతుంది.

ప్రతీకార సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను మినహాయించటంతో పాటు ఆటో మొబైల్స్ పైనా సుంకాలు సవరించే వీలుందన్న సంకేతాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా లాభపడేందుకు సాయం చేశాయి. అక్కడి మార్కెట్లు సానుకూల సంకేతాలు ఇవ్వటంతో దేశీయ స్టాక్ సూచీలు ర్యాలీ చేశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1578 పాయింట్లు పెరిగితే.. నిఫ్టీ 500పాయింట్లు బలపడింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించటంతో సూచీలు పరుగులు తీస్తున్నాయి.

విదేశీ స్టాక్ మార్కెట్లు సైతం సానుకూలంగా స్పందిస్తున్నాయి. మన దేశంలో ర్యాలీ 2 శాతంగా ఉంటే.. సింగపూర్ స్ట్రెయిల్ టైమ్స్.. తైవాన్ వెయిటెడ్ 2 శాతం.. జపాన్ నికాయ్.. కొరియా కోస్పీ.. ఇండోనేషియా జకర్తా ఒక శాతం చొప్పున పెరిగాయి. హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్.. చైనా షాంఘై 0.5 శాతం రాణించాయి. ఆసియా దేశాల మార్కెట్ల స్పందన ఇలా ఉంటే.. యూరోప్ లోని దేశాల విషయానికి వస్తే.. అవి కూడా లాభాల బాటలోనే నడిచాయి. ఫ్రాన్స్ సీఏసీ 1 శాతం.. జర్మనీ డాక్స్ 1.5 వాతం.. బ్రిటన్ ఎఫ్ టీఎస్ 1.5 శాతం ర్యాలీ చేయగా.. అమెరికా స్టాక్ సూచీ మాత్రం 0.5 శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఏయే రంగాల షేర్లు దూసుకెళుతున్నాయన్న విషయానికి వస్తే మొత్తంగా చూస్తే అన్ని రంగాల షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. అయితే. బ్యాంకింగ్ షేర్ల జోరు ఎక్కువగా ఉంది. ఇండస్ ఇండ్ బ్యాంకు 7 శాతం.. యాక్సిస్ బ్యాంకు 4 శాతం.. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3 శాతం.. హెచ్ డీఎఫ్ సీ 3 శాతం మేర ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఈ నాలుగు షేర్ల వాటానే 750 పాయింట్లు కావటం విశేషం. ఇక.. ఆటో మొబైల్ షేర్లు సైతం లాభ పడ్డాయి. అత్యధికంగా సంవర్ధన మదర్శన్ సుమీ 8 శాతం.. భారత్ ఫోర్జ్.. బాలక్రిష్ణ ఇండస్ట్రీస్ 7 శాతం.. టాటా మోటార్స్.. ఎంఆర్ఎఫ్ 4.5 శాతం ర్యాలీ చేశాయి.

దలాల్ స్ట్రీట్ లో ఈ వారం లాభాల పంట పండటమే కాదు.. సందప స్రష్టి భారీగా జరిగింది. రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.18.42 లక్షల కోట్ల సంపద క్రియేట్ అయ్యింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412.24 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో ఒక్క మంగళవారం పెరిగిన సంపదే రూ.10.8 లక్షల కోట్లు కావటం విశేషం. మార్కెట్ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో మార్కెట్ సూచీలు వేగంగా ముందుకు వెళ్లే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. మేం చెప్పే అంచనాలను పరిగణలోకి తీసుకొని మార్కెట్లో పెట్టుబడులు పెట్టొద్దని మనవి.

Tags:    

Similar News