5 రోజుల్లో రూ.32 లక్షల కోట్లు.. స్టాక్ మార్కెట్ మాయాజాలం

అయితే.. అన్నిసార్లు ఇలానే ఉంటుందని చెప్పలేం. అందుకే అంటారు.. అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుందీ రంగం.;

Update: 2025-04-22 04:45 GMT

కొన్నిసార్లు అంతే. చూస్తుండగానే కళ్ల ముందు ఆవిరి అయ్యే సంపద.. అనూహ్య రీతిలో రికవరీ కావటం ఒక్క స్టాక్ మార్కెట్ లోనే సాధ్యం. చూస్తుండగానే పాతాళానికి.. ఆ షాక్ నుంచి కోలుకున్నంతలోపే ఆకాశమే హద్దుగా దూసుకెళ్లే తత్త్వం స్టాక్ మార్కెట్ లో కనిపిస్తుంటుంది. అయితే.. అన్నిసార్లు ఇలానే ఉంటుందని చెప్పలేం. అందుకే అంటారు.. అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుందీ రంగం.

అందుకే ఈ రంగంలో ట్రేడింగ్ చేసే వారు అన్నింటికి సిద్ధం కావాలని. అదే సమయంలో అనవసరమైన హడావుడి.. ఆత్రుత అస్సలు పనికి రాదు. కాస్త సెటిల్డ్ గా ఉండటంతో పాటు.. ఓపిగ్గా ఎదురుచూసే తత్త్వం చాలా అవసరం. చాలామంది నిపుణులు చెప్పే మాట.. సొంత డబ్బుల్ని మాత్రమే ఇందులో పెట్టుబడిగా పెట్టాలే తప్పించి.. అప్పులు చేసి ట్రేడింగ్ చేయటం.. టార్గెట్లు పెట్టుకొని మార్కెట్ లోకి దిగితే.. మొత్తంగా మునిగిపోవటానికి అవకాశాలు ఎక్కువ. ఆచితూచి ట్రేడింగ్ చేయటంతో పాటు.. సెంటిమెంట్ బాగోలేనప్పుడు ఓపిగ్గా ఎదురుచూడటం చాలా అవసరం.

అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది గడిచిన ఐదు రోజుల నుంచి మార్కెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలే. ఈక్విటీ మార్కెట్ అద్భుతమైన ర్యాలీతో దూసుకెళుతోంది. ఫలితంగా ఐదు వరుస ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ నికంగా రూ.32.03 లక్షల కోట్లు పెరిగింది. దీంతో.. మార్కెట్ లో దీని విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.4,25,85,629.02 కోట్లకు చేరుకుంది.

సోమవారం సర్వత్రా సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 855.30 పాయింట్లు లాభపడితే.. నిఫ్టీ 1,726.40 పాయింట్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్ షేర్లలో సాగిన కొనుగోళ్ల మద్దతుతో బ్యాంక్ నిఫ్టీ సరికొత్త రికార్డు గరిష్ఠస్థాయి 55.200 వరకు దూసుకెళ్లింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పైనా.. ట్రంప్ అస్తవ్యస్త టారిఫ్ విధానంపై విశ్వాసం కోల్పోయిన విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ మీద ఫోకస్ చేయటంతో.. స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడింది.

గత వారంలో ట్రేడింగ్ జరిగిన 3 రోజుల్లో ఎఫ్ పీఐలు నికరంగా రూ.8472 కోట్ల విలువైన కొనుగోళ్లు నిర్వహించారు. సోమవారం నాటి ర్యాలీ అన్ని రంగాలకు విస్తరించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 2.2శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్ సూచీ 1.67 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈలోని రంగాల వారీగా సూచీలన్నీ 2 శాతం పైనే లాభపడ్డాయి. బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో 2.15 శాతం లాభపడి.. 52 వారాల గరిష్ఠస్థాయికి చేరుకుంది. రూ.1437కు వెళ్లినప్పటికి.. లాభంతో రూ.1409.40 వద్ద ప్లాట్ గా ముగిసింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేరు సైతం బీఎస్ ఈలో 1.10 శాతం లాభంతో రూ.1927.55 వద్ద ముగిసింది. మొత్తానికి ఇప్పటికైతే అన్ని శుభసూచకాలే కనిపిస్తున్నాయని చెప్పాలి.

Tags:    

Similar News