భారత్ తో సంబంధాల్లో కీలక మలుపుతీసుకున్న కెనడా
భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న వేర్పాటువాద శక్తులకు దూరంగా ఉండాలని కెనడా రాజకీయ పార్టీలకు ఆ దేశ మాజీ ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్ స్పష్టం చేశారు.;
భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న వేర్పాటువాద శక్తులకు దూరంగా ఉండాలని కెనడా రాజకీయ పార్టీలకు ఆ దేశ మాజీ ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్ స్పష్టం చేశారు. కెనడాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఏ పార్టీ అయినా భారత్‌తో సమస్యలు సృష్టించిన వేర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోకపోతే, న్యూదిల్లీతో కెనడా ఎప్పటికీ స్నేహపూర్వకమైన, బలమైన సంబంధాలను కొనసాగించలేదని పేర్కొన్నారు. భారత్‌ను విభజించాలని చూసే అరాచక శక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రాజకీయ పార్టీలకు ఆయన సూచించారు.
వేర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోవడానికి ఇప్పటివరకు వివిధ రాజకీయ పార్టీలు ఎందుకు ఆలస్యం చేశాయో తనకు తెలియదని హార్పర్ అన్నారు. తన పదవీకాలంలో ఇటువంటి విషయాలకు దూరంగా ఉన్నామని, ప్రస్తుత రాజకీయ పార్టీలు కూడా అదే విధానాన్ని పాటిస్తాయని తాను భావిస్తున్నానని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కెనడాకు మిత్ర దేశంగా ఉన్న భారత్‌తో తిరిగి బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలంటే, ఇప్పటివరకు కెనడాకు, భారత్‌కు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని, జిహాదీలు, యాంటీసెమిట్‌లు, ఖలిస్థానీలు వంటి విభజన సమూహాలను ప్రోత్సహించడం ఆపాలని ఆయన అన్నారు. ఇవి మాత్రమే ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు.
-స్టీఫెన్ హార్పర్ నేపథ్యం:
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు హార్పర్ 2006 నుంచి 2015 వరకు కెనడా ప్రధానమంత్రిగా ఉన్నారు. 1985 జూన్ 23న ఖలిస్థానీ ఉగ్రవాదులు ఎయిర్ ఇండియా విమానం కనిష్కపై బాంబు దాడి చేసిన ఘటనపై ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. రిటైర్డ్ జస్టిస్ జాన్ మేజర్ నేతృత్వంలోని ఆ కమిషన్ జులై 16, 2010న తన నివేదికను సమర్పించింది. ఈ దాడికి దారితీసిన వైఫల్యాలకు తమ ప్రభుత్వం తరఫున అప్పట్లోనే భారత్‌కు క్షమాపణలు తెలిపారు.
-భారత్-కెనడా సంబంధాలలో ఉద్రిక్తతలు:
దశాబ్దాల తరబడి మిత్ర దేశాలుగా ఉన్న భారత్, కెనడాల మధ్య గత కొంతకాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ ఆయన ఆరోపించడంతో, భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. అనంతరం కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి భారత్ యత్నిస్తోందంటూ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసు డిప్యూటీ డైరెక్టర్ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇరుదేశాల మధ్య దూరం మరింత పెరిగింది.
అయితే, ఇటీవల కెనడా ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీ మాట్లాడుతూ భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి దోహదపడతాయా లేదా అనేది వేచి చూడాలి.