విజయ్‌కు స్టాలిన్ అంకుల్ మద్దతు..!
ఈ పరిణామాలతో మేజిక్ ఫిగర్ చేరుకునేందుకు విజయ్‌కు తలకు మించిన భారంగా మారింది. ఎటు చూసినా.. కూటమి పార్టీలే ఆయనకు కనిపించాయి.;
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. నిన్న మొన్నటి వరకు బల నిరూపణకు మంకు పట్టు పట్టిన గవర్నర్.. తాజాగా ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత, దళపతి విజయ్‌కు మార్గం సుగమం చేశారు. నిజానికి విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నించినా.. మేజిక్ ఫిగర్ 118 కి చేరుకోలేదు. దీంతో తొలుత కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. తమ ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్ వెంటే నడుస్తారని ప్రకటించింది. కానీ.. వీరు కలిసినా.. విజయ్‌కు వచ్చిన 108+5 = 113కే పరిమితం అయ్యారు. దీనిలో రెండు స్థానాల్లో విజయ్ విజయం దక్కించుకోవడంతో ఒకటిని మైనస్ చేస్తారు.
ఈ పరిణామాలతో మేజిక్ ఫిగర్ చేరుకునేందుకు విజయ్‌కు తలకు మించిన భారంగా మారింది. ఎటు చూసినా.. కూటమి పార్టీలే ఆయనకు కనిపించాయి. తమిళనాడులో చిన్న చితక పార్టీలు ఉన్నప్పటికీ.. అవి ఏదో ఒక పార్టీలో మిత్ర పక్షంగా ఉన్నాయి. అయినప్పటికీ.. విజయ్ వాటిని స్వాగతించారు. మంత్రిపదవులు ఇస్తామని ఆఫర్ కూడా ప్రకటించారు. కానీ.. ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకున్న సీపీఎం(2), సీపీఐ(2), వీసీకే(2) పార్టీలు.. విజయ్‌తో పొత్తు విషయంలో ఎటూ తేల్చలేదు. ఈ పరిణామాలతో నాలుగు రోజులుగా అనిశ్చితి నెలకొంది. కాగా.. ఈ పార్టీలు.. స్టాలిన్ నేతృత్వంలోనిడీఎంకేతో పొత్తు పెట్టుకున్నాయి.
దీంతో పరోక్షంగా రంగంలోకి దిగిన స్టాలిన్.. విజయ్‌కు మద్దతుగా నిలిచారు. ఆయన నేరుగా ప్రకటన చేయకపోయినా.. తన మిత్రపక్షాలుగాఉన్న సీపీఎం, సీపీఐ, వీసీకేలను విజయ్‌కు మద్దతు ఇచ్చేలా పరోక్షంగా వాటిని ఒప్పించారు. వాస్తవానికి స్టాలిన్.. ఎన్నికల ఫలితం అనంతరం హుందాగా వ్యవహరించారు. తాను ఓటమిని అంగీకరించడమే కాకుండా..తన రాజీనామాను కూడా వెంటనే సమర్పించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తున్నామని కూడా ప్రకటించారు. అంతేకాదు.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ సహకరించాలని కూడా విన్నవించారు. ఇక్కడితో కూడాస్టాలిన్ ఆగకుండా.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. తాము అన్ని విధాలా సహకరిస్తామని.. ఆరు మాసాల వరకు పన్నెత్తు మాట కూడా విమర్శించబోమన్నారు.
అక్కడితో కూడా స్టాలిన్ ఆగలేదు.. ఎన్నికల్లో విజయ్ 2500 రూపాయల పింఛన్ ఇస్తామని మహిళలకు వాగ్దానం చేశారని.. కానీ, ఇది సాధ్యంకాదని.. చెప్పారు. తాము 1000 రూపాయలు ఇచ్చేందుకే అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. ఈ క్రమంలో తాము ఇస్తున్న 1000 రూపాయల పింఛనును కొనసాగిస్తే చాలని కూడా సూచించారు. ఇలా.. స్టాలిన్.. పరోక్షంగా విజయ్‌కు సహకరించారని.. టీవీకే నాయకులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. కాగా.. తాజా ఎన్నికల్లో డీఎంకే 59 స్థానాల్లో విజయం దక్కించుకుని ప్రధాన ప్రతిపక్షంగా మారింది.