చెత్త వేశాడన్నఆగ్రహంతో పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు
దారుణ నేరాలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉండే ఈఘోరాలు.. దారుణాలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి.;
దారుణ నేరాలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉండే ఈఘోరాలు.. దారుణాలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. చాలా చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకోవటమే కాదు.. ఒక వ్యక్తి ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడని తీరు చూస్తే.. షాక్ కు గురి కావాల్సిందే. తన స్థలంలో చెత్త వేశాడన్న నెపాన్ని బూచిగా చూపిస్తూ.. పక్కింటి వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల పరిధిలో ఈ షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఘటన జరిగిన ప్రాంతం బారువ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. పోలీసు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే.. ఊళ్లో భూమికి సంబంధించిన గొడవలు మోహన్ రావు, సీతారాముల మధ్య నడుస్తున్నాయి. సీతారాములు వేరే ప్రాంతంలో ఉంటారు. అతడికి సంబంధించిన భూమిని మోహన్ రావు చూస్తుంటాడు.
ఇదిలా ఉండగా రెండేళ్ల క్రితం సీతారాములు గ్రామానికి వచ్చి.. తన భూమిని తాను స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయగా.. ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. ఈ వ్యవహారంపై సీతారాములను మోహన్ రావు తరచూ బెదిరింపులకు దిగేవాడు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం సీతారాములు తన స్థలంలో వేసిన చెత్తను మోహన్ రావు ఇంటి ముందు వేశారు. దీంతో.. మోహన్ రావు ముందుగా సిద్ధం చేసుకున్న పెట్రోల్ డబ్బాను సీతారాములపై పోసి.. నిప్పు అంటించాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే..అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో టెక్కలికి తీసుకెళ్లారు.అక్కడ కూడా పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చెప్పటంతో శ్రీకాకుళం.. అనంతరం విశాఖపట్నానికి తీసుకెళ్లి.. అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. సీతారాముల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇక.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడ్ని టీ తాగుతుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చిన్న గొడవను కారణంగా చూపించి.. ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడని దుర్మార్గం చూస్తే.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది.